Kumar Sangakkara: అతన్ని ఓపెనర్‌గా పంపండి.. సెహ్వాగ్‌లా సక్సెస్ అవుతాడు..!

Jos Buttler Should Open Batting In Tests Says Kumar Sangakkara - Sakshi

ఐపీఎల్ 2022 సీజన్‌లో పరుగుల వరద (863 పరుగులు) పారించి, ఆతర్వాత నెదర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అంతకుమించిన బీభత్సం (162, 86 నాటౌట్‌) సృష్టించిన ఇంగ్లండ్‌ వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ గురించి శ్రీలంక లెజెండరీ ఆటగాడు, రాజస్థాన్‌ రాయల్స్‌ కోచ్‌  కుమార సంగక్కర ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బట్లర్‌ను టెస్ట్‌ల్లో 6, 7 స్థానాల్లో కాకుండా ఓపెనర్‌గా పంపిస్తే సెహ్వాగ్‌లా సూపర్‌ సక్సెస్‌ అవుతాడని సంగక్కర అభిప్రాయపడ్డాడు. బట్లర్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓపెనర్‌గా వచ్చి వేగంగా పరుగులు రాబట్టడంతో పాటు సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడిన వైనాన్ని ఇందుకు ఉదహరించాడు. 

సెహ్వాగ్‌ టీమిండియలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో అతన్ని కూడా లోయర్‌ ఆర్డర్‌లో పంపారని, ఆతర్వాత ఓపెనర్‌గా ప్రమోషన్‌ వచ్చాక సెహ్వాగ్‌ ఏం చేశాడో ప్రపంచమంతా చూసిందని అన్నాడు. ఈతరంలో బట్లర్‌ అంత విధ్వంసకర ఆటగాడిని చేడలేదని, అతన్ని టెస్ట్‌ల్లో కూడా ఓపెనర్‌గా ప్రమోట్‌ చేస్తే రెడ్‌ బాల్‌ క్రికెట్‌లోనూ రికార్డులు తిరగరాస్తాడని జోస్యం చెప్పాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో రెచ్చిపోయి ఆడే బట్లర్‌ టెస్ట్‌ల్లో తేలిపోతున్న నేపథ్యంలో సంగక్కర్‌ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు 57 టెస్ట్‌లు ఆడిన బట్లర్‌.. 2 సెంచరీలు, 18 హాఫ్‌ సెంచరీల సాయంతో 31.92 సగటున 2907 పరుగులు మాత్రమే చేశాడు. 

ఇంగ్లండ్‌ గతేడాది యాషెస్‌లో దారుణ పరాభవం ఎదుర్కొన్న అనంతరం బట్లర్‌ టెస్ట్‌ జట్టులో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే లిమిటెడ్‌ ఓవర్స్‌లో అతని భీకర ఫామ్‌ తిరిగి టెస్ట్‌ జట్టులో చోటు సంపాదించిపెడుతుందని అంతా అనుకున్నారు. అయితే టీమిండియాతో జరిగే ఐదో టెస్ట్‌కు బట్లర్‌కు పిలుపు రాకపోవడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, కొత్త కెప్టెన్‌ (స్టోక్స్‌), కొత్త కోచ్‌ (మెక్‌కల్లమ్‌) ఆధ్వర్యంలో ఇంగ్లండ్‌ జట్టు న్యూజిలాండ్‌పై హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసి టీమిండియాకు ఛాలెంజ్‌ విసురుతుంది. 

భారత్‌తో జరిగే 5వ టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ ఫోక్స్, జాక్ లీచ్, అలెక్స్ లీస్, క్రెయిగ్ ఓవర్టన్, జామీ ఓవర్టన్, మాథ్యూ పాట్స్‌, ఓలీ పోప్, జో రూట్
చదవండి: టీమిండియాతో ఐదో టెస్టు.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్‌..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top