
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా (India Vs Australia) మధ్య రేపు (అక్టోబర్ 23) అడిలైడ్ వేదికగా రెండో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని (Virat Kohli) పలు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి.
ఈ మ్యాచ్‌లో విరాట్ 54 పరుగులు చేస్తే వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కరను వెనక్కు నెట్టి రెండో స్థానానికి చేరతాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు.
సచిన్ టెండూల్కర్-18426
కుమార సంగక్కర-14234
విరాట్ కోహ్లి-14181
ఈ మ్యాచ్‌లో విరాట్ 68 పరుగులు చేస్తే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో (వన్డేలు, టీ20లు కలిపి) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 463 వన్డేల్లో 18426 పరుగులు, ఒకే ఓక టీ20లో 10 పరుగులు సహా 18436 పరుగులు చేయగా.. విరాట్ 303 వన్డేల్లో 14181 పరుగులు, 125 టీ20ల్లో 4188 పరుగులు 18369 చేశాడు.
ఈ మ్యాచ్‌లో విరాట్ సెంచరీ చేస్తే సచిన్ పేరిటే ఉన్న మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంటాడు. ఏదైనా సింగిల్ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు ప్రస్తుతం విరాట్, సచిన్‌ల పేరిట సంయుక్తంగా ఉంది. విరాట్ వన్డేల్లో 51 సెంచరీలు చేయగా.. టెస్ట్‌ల్లో సచిన్ పేరిట 51 శతకాలు ఉన్నాయి.
కాగా, టెస్ట్‌లకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి, వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్.. ఆరు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ) ప్రస్తుత ఆసీస్ సిరీస్‌తోనే రీఎంట్రీ ఇచ్చాడు. తొలి వన్డేలో 8 బంతులు ఆడి డకౌటైన విరాట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాడు. రేపు జరుగబోయే రెండో వన్డేలో విరాట్ చెలరేగడం ఖాయమని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
ఈ మ్యాచ్‌కు వేదిక అయిన అడిలైడ్‌లో విరాట్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన 4 వన్డేల్లో 2 సెంచరీల సాయంతో 244 పరుగులు చేశాడు. ఈ మైదానంలో మిగతా రెండు ఫార్మాట్లలో కూడా విరాట్‌కు మంచి రికార్డు ఉంది. 5 టెస్ట్‌ల్లో 3 సెంచరీలు, ఓ అర్ద సెంచరీ సాయంతో 527 పరుగులు... 3 టీ20ల్లో 3 అర్ద సెంచరీల సాయంతో 204 పరుగులు చేశాడు.
రేపటి మ్యాచ్‌లో విరాట్ 25 పరుగలు చేస్తే అడిలైడ్‌లో 1000 పరుగులు (మూడు ఫార్మాట్లలో) పూర్తి చేసుకుంటాడు.
ఇదిలా ఉంటే, పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా మరో 29 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
చదవండి: ఓపెనర్‌గానూ రోహిత్ శర్మపై వేటు!?.. గంభీర్, అగార్కర్ చర్య వైరల్