ఆస్ట్రేలియాతో రెండో వన్డేకు టీమిండియా స్టార్ రోహిత్ శర్మ (Rohit Sharma) సన్నద్ధమయ్యాడు. ఆప్షనల్ సెషన్‌లో భాగంగా నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చిన హిట్‌మ్యాన్.. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. త్రోడౌన్స్ ఎదుర్కొంటూ బిజీబిజీగా గడిపాడు.
అయితే, ప్రాక్టీస్ సెషన్ ముగించుకున్న తర్వాత రోహిత్ శర్మ మైదానాన్ని వీడే క్రమంలో ముభావంగా కనిపించడం చర్చకు దారితీసింది. ఇందుకు ప్రధాన కారణం.. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir), చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) చర్యలే అని తెలుస్తోంది.
అందుకే రోహిత్‌పై వేటు
కెప్టెన్ హోదాలో భారత్‌కు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 అందించిన 38 ఏళ్ల రోహిత్ శర్మపై యాజమాన్యం ఊహించని రీతిలో వేటు వేసిన విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్-2027 టోర్నీని దృష్టిలో పెట్టుకుని రోహిత్‌ను తప్పించి.. అతడి స్థానంలో శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలు అప్పగించినట్లు అగార్కర్ ఆసీస్ పర్యటన జట్టు ప్రకటన సందర్భంగా తెలిపాడు.
రోహిత్‌కు ఇష్టం లేకపోయినా..
అయితే, ఇప్పటికే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ.. వన్డే కెప్టెన్‌గా కొనసాగాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే, కోచ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అగార్కర్ బలవంతంగానే రోహిత్‌ను తప్పించడంలో కీలక పాత్ర పోషించినట్లు వార్తలు వచ్చాయి.
ఓపెనర్‌గానూ చోటివ్వరా?
ఇక ఈ పరిణామాల నేపథ్యంలో.. భారత్‌కు రెండు ఐసీసీ టైటిళ్లు అందించిన దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డే జట్టులో ఓపెనర్‌గా మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే, ఆ స్థానానికీ గంభీర్- అగార్కర్ ఎసరు పెట్టినట్లు తాజా ఊహాగానాల ద్వారా తెలుస్తోంది.
ఆసీస్‌తో రెండో వన్డేకు ముందు అడిలైడ్ ఓవల్ మైదానంలో రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్న వేళ.. గంభీర్, అగార్కర్.. యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌తో సుదీర్ఘ చర్చలు జరిపినట్లు సమాచారం. ఇదే రోహిత్ మూడ్ ఆఫ్ అవడానికి కారణమని రెవ్‌స్పోర్ట్స్ కథనం ద్వారా అర్థమవుతోంది.
జైసూతో చర్చలకు అర్థం ఏమిటి?
కాగా ఇప్పటికే టెస్టుల్లో ఓపెనర్‌గా పాతుకుపోయిన యశస్వి జైస్వాల్.. వన్డేల్లో మాత్రం అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు. రోహిత్- గిల్ వన్డే ఫార్మాట్లో ఓపెనింగ్ జోడీగా కొనసాగుతున్న నేపథ్యంలో జైసూకు ఇంత వరకు ఒకే ఒక్క వన్డే ఆడే అవకాశం వచ్చింది.
అయితే, తాజాగా ఆసీస్‌తో వన్డే సిరీస్ నేపథ్యంలో జైస్వాల్‌ను బ్యాకప్ ఓపెనర్‌గా ఎంపిక చేశారు సెలక్టర్లు. కెప్టెన్‌గా తుదిజట్టులో గిల్ స్థానానికి వచ్చిన ఢోకా లేదు. మరోవైపు.. రోహిత్ కూడా పది కిలోల బరువు తగ్గి పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. ఇలాంటి తరుణంలో గంభీర్, అగార్కర్ జైసూకు ప్రాధాన్యం ఇస్తూ చర్చలు జరపడం.. రోహిత్ అభిమానులను ఆందోళనలోకి నెట్టేసింది.
భవిష్యత్తు ప్రణాళికలు అంటూ.. రోహిత్‌ను జట్టు నుంచే తప్పించి జైస్వాల్ ఆడిస్తారా ఏమిటి? అనే సందేహాలు ఫ్యాన్స్‌ను వెంటాడుతున్నాయి. ఇదిలా ఉంటే.. ప్యూర్ బ్యాటర్ అయిన జైస్వాల్.. నెట్స్‌లో లెగ్ స్పిన్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం గమనార్హం. గంభీర్ ఆల్‌రౌండర్లకే పెద్దపీట వేస్తాడన్న పేరుంది.
కాబట్టి తనలోని ఆల్‌రౌండ్ నైపుణ్యాలతో గంభీర్‌ను ఆకట్టుకుని తుదిజట్టులో చోటు సంపాదించాలని జైసూ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఈ ఆప్షనల్ సెషన్‌కు విరాట్ కోహ్లితో పాటు గిల్ కూడా డుమ్మాకొట్టినట్లు సమాచారం.
విఫలమైన రో- కో
కాగా ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇరుజట్ల మధ్య గురువారం జరిగే రెండో వన్డేకు అడిలైడ్ ఓవల్ వేదిక. ఇక ఏడు నెలల తర్వాత టీమిండియా తరఫున తొలి వన్డేతో రీఎంట్రీ ఇచ్చిన రో- కో నిరాశపరిచారు. రోహిత్ 8 పరుగులే చేసి అవుట్ కాగా.. కోహ్లి డకౌట్‌గా వెనుదిరిగాడు.
చదవండి: కోహ్లి, రోహిత్ అందుకే ఫెయిల్ అయ్యారు: టీమిండియా కోచ్ కామెంట్స్ వైరల్


