
దాదాపు ఏడు నెలల తర్వాత టీమిండియా తరఫున పునరాగమనం చేసిన దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) ఊహించని రీతిలో విఫలమయ్యారు. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో ఇద్దరూ తేలిపోయారు. ఓపెనర్ రోహిత్ శర్మ 14 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ బాది ఎనిమిది పరుగులు చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ కోహ్లి పూర్తిగా నిరాశపరిచాడు.
కోహ్లి.. తొలిసారి డకౌట్
ఎనిమిది బంతులు ఎదుర్కొన్న కోహ్లి పరుగుల ఖాతా తెరవకుండానే.. మిచెల్ స్టార్క్ (Mitchell Starc) బౌలింగ్‌లో కూపర్ కన్నోలికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తద్వారా ఆసీస్‌తో వన్డేల్లో కోహ్లి తొలిసారి డకౌట్ నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో రో- కో వైఫల్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తుండగా.. టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ స్పందించిన తీరు చర్చకు దారితీసింది.
కోహ్లి, రోహిత్ అందుకే ఫెయిల్ అయ్యారు
‘‘వాళ్లిద్దరు ఐపీఎల్ ఆడారు. కాబట్టి రీఎంట్రీ సన్నాహకాల గురించి సందేహాలు అవసరమే లేదు. నాకు తెలిసి వాతావరణం కారణంగానే ఇలా జరిగింది. ఒకవేళ ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్‌కు వచ్చిన వాళ్ల టాపార్డర్‌కు ఇలాగే జరిగి ఉండేది.
నాలుగైదుసార్ల అంతరాయం తర్వాత బ్యాటింగ్‌కు వెళితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. వాళ్లిద్దరు తిరిగి పుంజుకుంటారు’’ అని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు. అదే విధంగా.. ‘‘వాళ్లిద్దరు అనుభవజ్ఞులైన బ్యాటర్లు. ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చే ముందు ఇద్దరూ పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు.
ఇప్పుడే వాళ్ల ప్రదర్శను జడ్జ్ చేయడం సరికాదు. ఇటీవలే వాళ్లు టెస్టుల నుంచి రిటైర్ అయ్యారు. ఆ వెంటనే ఈ సిరీస్ ఆడేందుకు వచ్చారు. ఇద్దరూ పూర్తి ఫిట్‌గా ఉన్నారు. సీనియర్లకు ప్రత్యేకంగా మేము ఎలాంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని సితాన్షు కొటక్ రోహిత్- కోహ్లిలను వెనకేసుకువచ్చాడు.
వాళ్లిద్దరు అసలు క్రీజులోనే ఉంటేనే కదా!
అయితే, కొటక్ చెప్పినట్లు రోహిత్- కోహ్లి వర్షం అంతరాయం కలిగించేంత వరకు క్రీజులోనే లేరు. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే ఇద్దరూ పెవిలియన్ చేరారు. ఈ నేపథ్యంలో.. ‘‘వాళ్లిద్దరు అసలు క్రీజులోనే ఉంటేనే కదా.. అంతరాయాల వల్ల డిస్టర్బ్ అవడానికి’’ అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
కాగా ఆసీస్- భారత్ మధ్య పెర్త్‌లో జరిగిన తొలి వన్డేను వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం తమకు విధించిన 131 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
చదవండి: ఆసియా కప్ భారత్‌దే.. కానీ నా చేతుల మీదుగానే ట్రోఫీ ఇస్తా: నఖ్వీ ఓవరాక్షన్