అఫ్గనిస్తాన్‌తో ‘ట్రై’ సిరీస్‌.. ధనాధన్‌కు వైభవ్‌ సూర్యవంశీ రెడీ! | Vaibhav Suryavanshi to Represent India U19 in Youth ODI Tri-Series | Sakshi
Sakshi News home page

అఫ్గనిస్తాన్‌తో ‘ట్రై’ సిరీస్‌.. ధనాధన్‌ దంచికొట్టేందుకు వైభవ్‌ సూర్యవంశీ రెడీ

Oct 22 2025 1:03 PM | Updated on Oct 22 2025 1:08 PM

Vaibhav Suryavanshi Set to Shine Under 19 Tri Series Schedule Announced

పద్నాలుగేళ్ల వయసులోనే క్రికెట్‌ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). బిహార్‌కు చెందిన ఈ పిల్లాడు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ (35 బంతుల్లో) నమోదు చేసిన తర్వాత.. భారత అండర్‌-19 జట్టు తరఫునా మెరుపులు మెరిపిస్తున్నాడు.

ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా పర్యటనల్లో యూత్‌ వన్డేలు, యూత్‌ టెస్టుల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు వైభవ్‌. ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌తో బిజీగా ఉన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. బిహార్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌ (Bihar Vice Captain)గానూ వ్యవహరిస్తున్నాడు.

మరోసారి భారత్‌కు ప్రాతినిథ్యం
అయితే, వచ్చే నెలలో వైభవ్‌ సూర్యవంశీ మరోసారి భారత్‌కు ప్రాతినిథ్యం వహించబోతున్నట్లు తెలుస్తోంది. తమ అండర్‌-19 జట్టు భారత్‌లో పర్యటించనున్నట్లు అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (ACB) ఇటీవలే ప్రకటించింది. భారత అండర్‌-19 స్థాయిలోని ‘A’, ‘B’ జట్లతో యూత్‌ వన్డే ట్రై సిరీస్‌ ఆడనున్నట్లు వెల్లడించింది.

జట్టులో చోటు లాంఛనమే
ఈ నేపథ్యంలో త్వరలోనే వైభవ్‌ సూర్యవంశీ మళ్లీ భారత జెర్సీలో కనిపించడం లాంఛనమే అని తెలుస్తోంది. ఇక అఫ్గన్‌- భారత అండర్‌-19 జట్ల మధ్య ఈ ట్రై సిరీస్‌ డబుల్‌ రౌండ్‌- రాబిన్‌ ఫార్మాట్లో జరుగనుంది. ప్రతి జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది. మెరుగ్గా ఆడిన రెండు జట్లు ఫైనల్‌కు చేరతాయి.

వరల్డ్‌కప్‌ టోర్నీ సన్నాహకంగా
కాగా నవంబరు 17 నుంచి నవంబరు 30 వరకు భారత్‌- అఫ్గన్‌ అండర్‌-19 జట్ల మధ్య యూత్‌ వన్డే ట్రై సిరీస్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇందుకు వేదిక. కాగా ఐసీసీ మెన్స్‌ అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నీకి ముందు ఈ సిరీస్‌ ఇరుజట్లకు సన్నాహకంగా నిలవనుంది. వైభవ్‌ సూర్యవంశీ వంటి యువ స్టార్లు అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌లో అడుగుపెట్టేందుకు బాటలు వేయనుంది.

ఇదిలా ఉంటే.. భారత్‌ అండర్‌-19 జట్టుకు ముంబై ఆటగాడు ఆయుశ్‌ మాత్రే సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా పర్యటనల్లో ఆయుశ్‌ జట్టును ముందుకు నడిపించగా.. వైభవ్‌ ఓపెనర్‌గా భారత ఇన్నింగ్స్‌ ఆరంభించాడు.

భారత్‌- అఫ్గన్‌ అండర్‌-19 జట్ల వన్డే ట్రై సిరీస్‌ షెడ్యూల్‌ ఇదే
👉నవంబరు 17: భారత్‌-‘ఎ’ వర్సెస్‌ భారత్‌-‘బి’
👉నవంబరు 19: భారత్‌-‘బి’ వర్సెస్‌ అఫ్గనిస్తాన్‌
👉నవంబరు 21: భారత్‌-‘ఎ’ వర్సెస్‌ అఫ్గనిస్తాన్‌
👉నవంబరు 23: భారత్‌-‘ఎ’ వర్సెస్‌ భారత్‌-‘బి’
👉నవంబరు 25: భారత్‌-‘బి’ వర్సెస్‌ అఫ్గనిస్తాన్‌
👉నవంబరు 27: భారత్‌-‘ఎ’ వర్సెస్‌ అఫ్గనిస్తాన్‌
👉నవంబరు 30: ఫైనల్‌.

చదవండి: కోహ్లి, రోహిత్‌ అందుకే ఫెయిల్‌ అయ్యారు: టీమిండియా కోచ్‌ కామెంట్స్‌ వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement