
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల వరద పారిస్తూ రన్‌మెషీన్‌గా పేరొందిన ఈ ఢిల్లీ ఆటగాడు.. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. గతేడాది పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లి.. ఇటీవలే టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇక సోషల్ మీడియాలో పాతిక కోట్లకు పైగా ఫాలోవర్లు కలిగి ఉన్న కోహ్లి.. కుటుంబానికి సంబంధించి అరుదుగా పోస్టులు పెడుతుంటాడు. వీటిలోనూ ఎక్కువగా భార్య, నటి అనుష్క శర్మ (Anushka Sharma)తో ఉన్న ఫొటోలే పంచుకుంటాడు. కాగా విరుష్క దంపతులు ఇప్పటి వరకు తమ కుమార్తె వామిక (Vamika), కుమారుడు అకాయ్ (Akaay)ల ఫొటోలు కూడా రివీల్ చేయలేదు.
కుటుంబంతో కలవరా?
ఇదిలా ఉంటే.. విరాట్ కుటుంబంతో అనుష్క శర్మ ఎక్కువగా కలిసినట్లే కనిపించదు. విరాట్ అక్క భావనా కోహ్లి ధింగ్రా, అన్న వికాస్ కోహ్లి భార్య చేతన కోహ్లి మాత్రం.. కోహ్లి, అతడి పిల్లల గురించి అప్పుడప్పుడూ పోస్టులు పెడుతుంటారు. అయితే, వీరికి సంబంధించిన ఫొటోలను మాత్రం అనుష్క ఎక్కువగా పోస్ట్ చేయదు. కానీ వారి పోస్టులకు లైకులు మాత్రం కొడుతుంది.
తోటి కోడలిని ప్రశంసించిన అనుష్క
ఈ నేపథ్యంలో అనుష్క శర్మ తాజాగా.. తన తోటి కోడలు చేతన కోహ్లిని ప్రశంసిస్తూ ఇన్‌స్టా స్టోరీ పెట్టడం వైరల్‌గా మారింది. చేతన యోగాసనంలో ఉన్న ఫొటోను పంచుకున్న అనుష్క .. ‘‘ప్రతి భంగిమలోనూ యోగానే ఈమె ప్రతిబింబిస్తోంది. స్ట్రెంత్, గ్రేస్ అన్నీ తనలో ఉన్నాయి. నిన్ను చూసి గర్విస్తున్నా చేట్స్’’ అంటూ చేతులు జోడించి నమస్కరిస్తున్న ఎమోజీని జతచేసింది. '
ఈ పోస్టుకు చేతనను ట్యాగ్ చేయగా.. ఆమె కూడా స్పందించింది. ‘‘కృతజ్ఞతలు అనుష్క.. నాలో ఉన్న గ్రేస్ గుర్తించినందుకు థాంక్యూ’’ అంటూ చేతన హర్షం వ్యక్తం చేసింది.
లండన్‌లోనే నివాసం
కాగా కుమారుడు అకాయ్ జన్మించిన తర్వాత విరాట్- అనుష్క లండన్‌లోనే నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. మ్యాచ్‌ల కోసం మాత్రమే కోహ్లి భారత్‌కు వస్తున్నాడు.
ఇక ప్రస్తుతం అతడు వన్డే సిరీస్ ఆడేందుకు టీమిండియాతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చిన కోహ్లి నిరాశపరిచాడు. పెర్త్ వేదికగా తొలి వన్డేలో ఎనిమిది బంతులు ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు.
చదవండి: రూ. 80 కోట్ల ప్రాపర్టీ అన్నకు ఇచ్చేసిన కోహ్లి.. ట్విస్ట్ ఏంటంటే?