
భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)కి ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన ఆట తీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ రన్‌మెషీన్.. వర్ధమాన క్రికెటర్లకు ఆదర్శప్రాయం. ఎంతో మంది యువ ఆటగాళ్లకు అతడొక రోల్‌మోడల్.
కోహ్లిని నేరుగా కలిసి బ్యాటింగ్ మెళకువలు నేర్చుకోవాలని తహతహలాడే వారెందరో!.. తాము కూడా ఆ కోవకే చెందుతామని చెబుతోంది భారత మహిళా జట్టు స్టార్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues). అయితే, తాను, స్మృతి మంధాన (Smriti Mandhana) చేసిన పని వల్ల విరాట్ కోహ్లి, అతడి భార్య అనుష్క శర్మ కాస్త అసౌకర్యానికి గురికావాల్సి వచ్చిందని తాజాగా వెల్లడించింది.
ఒకే హోటల్‌లో బస.. అనుష్క కూడా అక్కడే
‘‘అప్పుడు భారత పురుష, మహిళా క్రికెట్ జట్లు న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నాయి. ఇరుజట్లకు ఒకే హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. అప్పుడు స్మృతి, నేను కలిసి విరాట్‌ను కలవాలి అనుకున్నాం.
మీతో మాట్లాడాలనుకుంటున్నాము అనగానే.. ‘ఓహ్.. ప్లీజ్.. మేము ఇక్కడే కేఫ్‌లో ఉన్నాము వచ్చేయండి’ అని కోహ్లి చెప్పాడు. అప్పుడు అనుష్క శర్మ కూడా అక్కడే ఉంది.

మొదటి అర్ధగంట సేపు క్రికెట్ గురించి మాట్లాడాము. ఈ క్రమంలో .. నేను, స్మృతి భారత మహిళా క్రికెట్‌లో కీలక ప్లేయర్లుగా ఉండిపోతామని కోహ్లి అన్నాడు. మేమిద్దరం గొప్ప పేరు తెచ్చుకుంటామని అన్నాడు.
ఇక చాలు.. బయటకు వెళ్లండి
ఆ తర్వాత బ్యాటింగ్ గురించి మాకు కొన్ని టిప్స్ ఇచ్చాడు. మా మాటలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత వ్యక్తిగత జీవితాల గురించి కూడా మాట్లాడుకున్నాము. ఏదో.. పాత స్నేహితులు చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్నట్లుగా మా సంభాషణలు కొనసాగాయి.
అప్పటికి నాలుగు గంటలు గడిచిపోయింది. అప్పుడు కేఫ్ నిర్వాహకులు వచ్చి.. ‘సమయం దాటిపోయింది.. ఇక వెళ్లండి’ అని చెప్పేంత వరకు అక్కడే కూర్చున్నాము. సుమారుగా రాత్రి 11.30 గంటల ప్రాంతంలో మేము అక్కడి నుంచి వెళ్లిపోయాము’’ అని జెమీమా రోడ్రిగ్స్ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది.
లండన్‌లోనే నివాసం
కాగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించిన విరాట్ కోహ్లి.. 2017లో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ సంతానం.
లండన్‌లో అకాయ్‌కు జన్మనిచ్చిన తర్వాత అనుష్క కోహ్లితో కలిసి అక్కడే ఎక్కువగా ఉంటోంది. మ్యాచ్‌లు ఉన్నపుడు మాత్రమే కోహ్లి భారత్‌కు వస్తున్నాడు. ఇక పెళ్లికి ముందు నుంచే కోహ్లితో పాటు అనుష్క కూడా టీమిండియా వెళ్లే పర్యటనల్లో భాగమయ్యేదన్న విషయం తెలిసిందే.
చదవండి: 21 సార్లు డకౌట్ అయినా సరే.. జట్టులోనే.. అతడికి గంభీర్ చెప్పిందిదే..