ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 25) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 229 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. అభిషేక్ శర్మ (57), ఇషాన్ కిషన్ (74), నితీశ్ కుమార్ రెడ్డి (36) మెరుపు విన్యాసాల కారణంగా ఎస్‌ఆర్‌హెచ్ మరో 9 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఊదేసింది.
ఈ గెలుపుపై మ్యాచ్ అనంతరం ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఇలా స్పందించాడు. సీజన్‌లో తొలి మ్యాచ్ (ఈ సీజన్‌లో కమిన్స్‌కు ఇదే తొలి మ్యాచ్) ఎలా సాగుతుందో ఎప్పుడూ కొంత అనిశ్చితి ఉంటుంది. కానీ మా సన్నాహాలు అద్భుతంగా జరిగాయి. అనుభవంతో ఆటను త్వరగా అర్థం చేసుకోగలుగుతున్నాను.
ప్రస్తుతం టీ20 క్రికెట్ పూర్తిగా బ్యాటర్ల ఆటగా మారిపోయింది. ఇలాంటి హై స్కోరింగ్ మ్యాచ్‌లు బౌలర్లకు పెద్ద సవాలే. కానీ రెండు ఖరీదైనా ఓవర్లు వేసినా, మళ్లీ తిరిగి వచ్చి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అదే టీ20 అందం.
యువ బౌలర్ల ప్రదర్శనపై కమిన్స్ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించాడు. ప్రఫుల్ హింగే ప్రస్తావన తీసుకొచ్చాడు. వీరిని ఇషాన్ కిషన్ అద్భుతంగా ముందుండి నడిపించాడని కితాబునిచ్చాడు. హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్ లాంటి సీనియర్లు ఉండనే ఉన్నారని అన్నాడు. డగౌట్ బౌలర్లతో కలకలలాడుతుందని తెలిపాడు. యువ బౌలర్లు స్పష్టమైన ప్రణాళికలతో రాణిస్తున్నారని కొనియాడాడు.
మధ్య విరామ సమయంలో జట్టు చాలా ప్రశాంతంగా ఉందని వెల్లడించాడు. ప్రత్యర్థి స్కోరు 250 దాటే అవకాశముండగా, 220 వద్ద నిలిపేయడం కీలకమైందని చెప్పాడు. పవర్‌ప్లేలోనే మ్యాచ్‌పై పట్టుసాధించాలని భావించామని తెలిపాడు. ప్రస్తుతమున్న ఫామ్‌లో మా బ్యాటర్లు ఇలాంటి లక్ష్యాలను సులభంగా ఊదేయగలరని విశ్వాసం వ్యక్తం చేశాడు.
కాగా, కమిన్స్ వ్యాఖ్యల్లో తన బృందంపై నమ్మకం, ధీమా కొట్టొచ్చినట్లు కనిపించింది. తన గైర్హాజరీలో ఇషాన్ జట్టును అద్భుతంగా ముందుండి నడిపించాడని అభిప్రాయపడ్డాడు. అలాగే బౌలర్లు, ముఖ్యంగా యువ బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. బ్యాటర్ల మెరుపు విన్యాసాలపై ధీమా కనిపించింది. మొత్తంగా జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు.


