
Photo Courtesy: BCCI
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో రెండు సీజన్లలో 600, అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ముంబై ఇండియన్స్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 2023 సీజన్‌లో తొలిసారి 600 ప్లస్ మార్కును (605) తాకిన స్కై.. ప్రస్తుత సీజన్‌లో కూడా 600 పరుగుల మైలురాయిని దాటాడు.
ముంబై ఇండియన్స్ చరిత్రలో (ఐపీఎల్‌లో) స్కై కాకుండా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాత్రమే ఓసారి 600 ప్లస్ పరుగులు స్కోర్ చేశాడు. సచిన్ 2010 సీజన్‌లో 618 పరుగులు సాధించాడు.
ఓ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..
619* - సూర్యకుమార్ యాదవ్ (2025)
618 - సచిన్ టెండూల్కర్ (2010)
605 - సూర్యకుమార్ యాదవ్ (2023)
553 - సచిన్ టెండూల్కర్ (2011)
540 - లెండిల్ సిమన్స్ (2015)
538 - రోహిత్ శర్మ (2013)
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో ఇవాళ (మే 26) జరుగుతున్న మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 600 పరుగుల మార్కును దాటాడు. ఈ మ్యాచ్‌లో 44 పరుగుల వద్ద (16 ఓవర్ల తర్వాత) బ్యాటింగ్ చేస్తున్న స్కై.. ఈ సీజన్‌లో 14వ సారి 25 పరుగుల మార్కును దాటాడు. ఐపీఎల్ చరిత్రలో ఓ బ్యాటర్ ఇన్ని సార్లు (ఒకే సీజన్‌లో) 25 పరుగుల మార్కును దాటడం ఇదే మొదటిసారి. 2018 సీజన్‌లో కేన్ విలియమ్సన్, 2023 సీజన్‌లో శుభ్‌మన్ గిల్ 13 సార్లు ఈ ఘనత సాధించారు.
మ్యాచ్ విషయానికొస్తే.. పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ 16.3 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. సూర్యకుమార్ యాదవ్ 44, నమన్ ధిర్ 0 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ముంబై ఇన్నింగ్స్‌లో రికెల్టన్ 27, రోహిత్ శర్మ 24, తిలక్ వర్మ 1, విల్ జాక్స్ 17 పరుగులు చేసి ఔటయ్యారు. పంజాబ్ బౌలర్లలో జన్సెన్, విజయ్‌కుమార్ వైశాఖ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హర్ప్రీత్ బ్రార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.