
PC: IPL Twitter
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న (మే 13) జరిగిన మ్యాచ్ సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ ఆండీ ఫ్లవర్ ప్రవర్తించిన తీరు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. సన్‌రైజర్స్ బ్యాటింగ్ సమయంలో నో బాల్ విషయంలో జరిగిన రసాభస సందర్భంగా ఆండీ ఫ్లవర్.. ఫీల్డ్ అంపైర్లకు మిడిల్ ఫింగర్ (ఓ రకమైన బూతు సంజ్ఞ) చూపించి తన అసహనాన్ని ప్రదర్శించాడు. ఫ్లవర్ ప్రవర్తించిన తీరును మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు తప్పుబడుతున్నారు.
అత్యున్నత హోదాలో ఉన్న ఫ్లవర్ ఇలా ప్రవర్తించడమేంటని ఎండగడుతున్నారు. శాంతంగా కనిపించే వ్యక్తి ఇలా ప్రవర్తించడం జిగుప్సాకరంగా ఉందని అంటున్నారు. కోచ్ పదవిలో ఉన్న వ్యక్తి హుందాగా వ్యవహరించాలి కాని ఇలా చిల్లరగా ప్రవర్తించకూడదని అక్షింతలు వేస్తున్నారు. కొందరు లక్నో ఫ్యాన్స్ మాత్రం ఫ్లవర్ అలా ప్రవర్తించడంలో తప్పేమీ లేదని వెనకేసుకొస్తున్నారు. రీప్లేలో క్లియర్‌గా నో బాల్ అని తెలుస్తున్నా, థర్డ్ అంపైర్ తప్పు తీర్పు చెబితే ఏ కోచ్‌కు కోపం రాదని అంటున్నారు. మొత్తంగా చూస్తే మెజారిటీ శాతం ఫ్లవర్ వ్యవహరించిన తీరును తప్పుబడుతున్నారు.
కాగా, హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్-లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌లో కాసేపు ఉత్కంఠ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ బ్యాటింగ్ సందర్భంగా ఓ నో బాల్ విషయంలో థర్డ్ అంపైర్ వ్యవహరించిన తీరుపై ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. థర్డ్ అంపైర్‌ని దూషిస్తూ, లక్నో డగౌట్ వైపు నట్లు, బోల్ట్‌లు విసిరారు. దీంతో స్టేడియంలో కొద్ది సేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.
లక్నో శిబిరంలోని వారు మైదానంలోకి వచ్చారు. మ్యాచ్ కాసేపు ఆగిపోయింది. ఎస్‌ఆర్‌హెచ్ అభిమానుల ప్రవర్తించిన తీరు పట్ల లక్నో బృందంతో పాటు ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్లు సైతం అసహనం వ్యక్తం చేశారు. అయితే లక్నో శిబిరంలోని వారికి అంపైర్లు సర్ధిచెప్పడంతో వ్యవహారం సద్దుమణిగింది. అనంతరం మ్యాచ్ సజావుగా సాగింది. నిర్ణీత ఓవర్లలో సన్‌రైజర్స్ 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఛేదనలో పూరన్ విధ్వంసం సృష్టించడంతో లక్నో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.