IPL 2023: ఆర్సీబీకి డీకే, రాజస్థాన్‌కు పరాగ్‌, సన్‌రైజర్స్‌కు మయాంక్‌.. మరి ఢిల్లీకి..? 

IPL 2023: Players Who Are Making Franchises To Struggle - Sakshi

ఐపీఎల్‌-2023లో సగానికిపైగా మ్యాచ్‌లు పూర్తయినా ఇప్పటికీ కొందరు బ్యాటర్లు గాడిలో పడకపోవడంతో సంబంధిత ఫ్రాంచైజీలు కలవరపడుతున్నాయి. భారీ మొత్తం వెచ్చించి సొంత చేసుకున్న కొందరు ఆటగాళ్లు పదేపదే అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేక ఫ్రాంచైజీలకు తలనొప్పిగా మారారు. తమ చెత్త బ్యాటింగ్‌తో ఫ్రాంచైజీలకు భారంగా మారిన ఆటగాళ్లెవరో ఓసారి పరిశీలిద్దాం.

ప్రస్తుత సీజన్‌లో జట్టుకు భారంగా మారిన ఆటగాళ్ల జాబితాలో రాజస్థాన్‌ రియాన్‌ పరాగ్‌ ముందువరుసలో ఉంటాడు. వేలంలో 3.8 కోట్లు దక్కించుకున్న ఈ ఓవరాక్షన్‌ ఆటగాడు.. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 20 అత్యధిక స్కోర్‌తో కేవలం 58 పరుగులు మాత్రమే చేశాడు. 

పరాగ్‌ తర్వాత చెత్త పెర్ఫార్మెన్స్‌ చేస్తున్న ఆటగాడు ఆర్సీబీ దినేశ్‌ కార్తీక్‌. ఫినిషర్‌గా ఇరగదీస్తాడని భారీ అంచనాల నడుమ ఈ సీజన్‌ బరిలోకి దిగిన డీకే (5.5 కోట్లు).. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 28 అత్యధిక స్కోర్‌తో కేవలం 99 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటర్‌గా దారుణంగా విఫలమైన డీకే.. వికెట్‌కీపింగ్‌లోనూ తీవ్రంగా నిరాశపరిచాడు.

క్యాచ్‌లు మిస్‌ చేయడం, స్టంపింగ్‌, రనౌట్లు చేయలేకపోవడం, చేతిలోకి వచ్చిన బాల్స్‌ను జారవిడచడం.. ఇలా వికెట్‌కీపింగ్‌లోనూ డీకే అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాడు. ఇంతటితో ఇతని ఆగడాలు ఆగలేదు. బ్యాటింగ్‌ సమయంలో ఇతను పరుగులు చేయలేకపోగా.. బాగా ఆడుతున్న వారిని పలు సందర్భాల్లో రనౌటయ్యేలా చేశాడు.
కార్తీక్‌తో పాటు మరో ఆటగాడు కూడా ఆర్సీబీకి చాలా భారంగా మారాడు. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అని చెప్పుకునే షాబాజ్‌ అహ్మద్‌ కూడా ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ విఫలమై జట్టు ఓటములకు కారకుడయ్యాడు.

సన్‌రైజర్స్‌ విషయానికొస్తే.. ఈ జట్టులో మయాంక్‌ అగర్వాల్‌, హ్యారీ బ్రూక్‌తో పాటు జట్టు మొత్తం బ్యాటింగ్‌ విభాగంలో దారుణంగా నిరాశపరుస్తుంది. బ్రూక్‌ ఒకే ఒక మ్యాచ్‌లో సెంచరీ చేసి, ఆతర్వాత వరుసగా విఫలమవుతున్నాడు. మయాంక్‌ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. చించేస్తాడనుకున్న కెప్టెన్‌ మార్క్రమ్‌ కూడా తేలిపోతున్నాడు. 

లక్నో సూపర్‌ జెయింట్స్‌కు దీపక్‌ హుడా.. సీఎస్‌కేకు అంబటి రాయుడు.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు పృథ్వీ షాలు పెద్ద తలనొప్పిగా మారారు. వీరిని సంబంధిత ఫ్రాంచైజీలు తదుపరి జరుగబోయే మ్యాచ్‌ల్లో ఆడిస్తారో లేక సాహసం చేసి పక్కకు కూర్చోబెడతారో వేచి చూడాలి. 

చదవండి: ముంబైతో మ్యాచ్‌.. జూనియర్‌ మలింగ అద్భుత గణాంకాలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top