IPL 2022: కోల్‌కతా... అదే కథ

IPL 2022: Delhi Capitals beat Kolkata Knight Riders by four wickets - Sakshi

వరుసగా ఐదో మ్యాచ్‌లో ఓటమి

కట్టడి చేసిన కుల్దీప్, ముస్త్తఫిజుర్‌

ధాటిగా ఆడిన వార్నర్, పావెల్‌

4 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపు  

ముంబై: ప్రత్యర్థి స్పిన్, పేస్‌ ధాటికి మాజీ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మళ్లీ తడబడింది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో వరుసగా ఐదో పరాజయం చవిచూసింది. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లు కుల్దీప్‌ యాదవ్‌ (4/14) తన స్పిన్‌తో... ముస్త ఫిజుర్‌ (3/18) తన పేస్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను కట్టిపడేశారు. అనంతరం సులువైన లక్ష్యాన్ని ఢిల్లీ కష్టపడి ఛేదించింది. గురువారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో క్యాపిటల్స్‌ జట్టు 4 వికెట్లతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై నెగ్గింది.

మొదట కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసింది. నితీశ్‌ రాణా (34 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (37 బంతుల్లో 42; 4 ఫోర్లు) రాణించారు. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి గెలిచింది. వార్నర్‌ (26 బంతుల్లో 42; 8 ఫోర్లు) ధాటిగా ఆడగా, పావెల్‌ (16 బంతుల్లో 33 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్సర్లు) గెలిచేదాకా నిలిచాడు.  

కుల్దీప్‌ స్పిన్‌ ఉచ్చులో...
ఆరంభం నుంచే నైట్‌రైడర్స్‌ కష్టాలు పడింది. చేతన్‌ సకారియా రెండో ఓవర్లో అందివచ్చిన లైఫ్‌ను ఫించ్‌ (3) తర్వాతి బంతికే సమర్పించుకున్నాడు. మరో ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ (6)ను అక్షర్‌ పటేల్‌ అవుట్‌ చేశాడు. కోల్‌కతా పవర్‌ప్లే స్కోరు 29/2.

ఆ తర్వాత కుల్దీప్‌ స్పిన్‌ ఉచ్చులో కోల్‌కతా చిక్కుకుంది. బౌలింగ్‌కు దిగిన తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో బాబా ఇంద్రజిత్‌ (6), సునీల్‌ నరైన్‌ (0)లను కుల్దీప్‌ పెవిలియన్‌ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులో కుదురుకున్న అయ్యర్‌ను, అప్పుడే వచ్చిన హిట్టర్‌ రసెల్‌ (0)ను కుల్దీప్‌ డగౌట్‌కు పంపాడు. దాంతో కోల్‌కతా మళ్లీ కష్టాల్లో పడింది.  

ఢిల్లీ కష్టపడి లక్ష్యానికి...
ఏమంత కష్టమైన లక్ష్యం కానప్పటికీ ఢిల్లీ ఆరంభం కూడా పేలవమే! పరుగుకు ముందే వికెట్‌ పడింది. ఉమేశ్‌ తొలి బంతికి పృథ్వీ షా (0) డకౌటయ్యాడు. రెండో ఓవర్లో మిచెల్‌ మార్ష్‌ (13)ను హర్షిత్‌ రాణా అవుట్‌ చేశాడు. అయితే క్రీజులో వార్నర్‌ ఉండటం ఢిల్లీని తేలిగ్గా నడిపించింది. చక్కగా కుదుటపడిన ఈ సమయంలో ఉమేశ్‌... వార్నర్‌ను అవుట్‌ చేయడంతో ఢిల్లీ కష్టాలపాలైంది. కేవలం రెండే పరుగుల తేడాతో మూడు ఓవర్లలో 3 వికెట్లను కోల్పోయింది. తర్వాత శార్దుల్‌ (8 నాటౌట్‌), పావెల్‌ నిలబడటంతో ఢిల్లీ విజయం సాధించింది.

స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: ఫించ్‌ (బి) సకారియా 3; వెంకటేశ్‌ (సి) సకారియా (బి) అక్షర్‌ 6; అయ్యర్‌ (సి) పంత్‌ (బి) కుల్దీప్‌ 42; బాబా ఇంద్రజిత్‌ (సి) పావెల్‌ (బి) కుల్దీప్‌ 6; నరైన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్‌ 0; నితీశ్‌ రాణా (సి) సకారియా (బి) ముస్తఫిజుర్‌ 57; రసెల్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) కుల్దీప్‌ 0; రింకూ సింగ్‌ (సి) పావెల్‌ (బి) ముస్తఫిజుర్‌ 23; ఉమేశ్‌ (నాటౌట్‌) 0; సౌతీ (బి) ముస్తఫిజుర్‌ 0; హర్షిత్‌ రాణా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1–4, 2–22, 3–35, 4–35, 5–83, 6–83, 7–145, 8–146, 9–146. బౌలింగ్‌: ముస్తఫిజుర్‌ 4–0–18–3; సకారియా 3–0–17–1, శార్దుల్‌ 3–0–32–0, అక్షర్‌ 4–0–28–1, కుల్దీప్‌ 3–0–14–4, లలిత్‌ 3–0–32–0.

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి అండ్‌ బి) ఉమేశ్‌ 0; వార్నర్‌ (సి) నరైన్‌ (బి) ఉమేశ్‌ 42; మార్‌‡్ష (సి) వెంకటేశ్‌ (బి) హర్షిత్‌ 13; లలిత్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) నరైన్‌ 22; పంత్‌ (సి) ఇంద్రజిత్‌ (బి) ఉమేశ్‌ 2; పావెల్‌ (నాటౌట్‌) 33; అక్షర్‌ (రనౌట్‌) 24; శార్దుల్‌ (నాటౌట్‌) 8; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19 ఓవర్లలో 6 వికెట్లకు) 150.
వికెట్ల పతనం: 1–0, 2–17, 3–82, 4–84, 5–84, 6–113.
బౌలింగ్‌: ఉమేశ్‌ యాదవ్‌ 4–0–24–3, హర్షిత్‌ రాణా 3–0–24–1, సౌతీ 4–0–31–0, నరైన్‌ 4–0–19–1, నితీశ్‌ రాణా 1–0–14–0, రసెల్‌ 1–0–14–0, వెంకటేశ్‌ 1–0–14–0, శ్రేయస్‌  అయ్యర్‌ 1–0–7–0.  

ఐపీఎల్‌లో నేడు
పంజాబ్‌ కింగ్స్‌ X లక్నో సూపర్‌ జెయింట్స్‌
వేదిక: çపుణే, రాత్రి గం. 7:30 నుంచ స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top