వారు నన్ను తీసుకోలేకపోవడం బాధించింది: పుజారా

IPL 2021: Pujara Was Disappointed When He Was Not Buy Gujarat Lions - Sakshi

చెన్నై:  ఏడేళ్ల తర్వాత ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు చతేశ్వర్‌ పుజారా. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడేందుకు పుజారా సిద్ధమయ్యాడు. ఈసారి వేలంలో పుజారాను రూ. 50 లక్షల కనీస ధరకు సీఎస్‌కే దక్కించుకుంది. దాంతో అతని సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. కేవలం టెస్టు ప్లేయర్‌ ముద్ర కారణంగానే పుజారాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోగా, చివరకు సీఎస్‌కే ధైర్యం చేసి అతన్ని తీసుకుంది. చివరిసారి 2014లో కింగ్స్‌ పంజాబ్‌ తరఫున ఆడిన పుజారా.. 2011 నుంచి 2013 వరకూ ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు.ఏడేళ్ల నుంచి ప్రతీసారి వేలంలో తన పేరును నమోదు చేసుకుంటున్నా ఏ ఫ్రాంచైజీ ఆసక్తికనబరచలేదు. తాను టెస్టు ప్లేయర్‌నే కాదని, అన్ని ఫార్మాట్లు ఆడే సత్తా ఉందని పదే పదే మొత్తుకున్నా పుజారాను ఎవరూ పట్టించుకోలేదు. ఆఖరికి సీఎస్‌కే తీసుకోవడంతో పుజారా తన ఆటకు పదును పెట్టే పనిలో ఉన్నాడు. 

అది నన్ను బాధించింది
2014 తర్వాత తాను ఐపీఎల్‌ ఆడకపోవడం ఒకటైతే, 2016, 2017 సీజన్లలో పాల్గొన్న గుజరాత్‌ లయన్స్‌ తనను తీసుకోలేకపోవడం తనను చాలా బాధించిందని పుజారా పేర్కొన్నాడు. క్రిక్‌బజ్‌తో మాట్లాడిన పుజారా.. తన హోమ్‌ టౌన్‌(రాజ్‌కోట్‌)లో ఆడాలనే కోరిక బలంగా ఉండేదని, ఆ క్రమంలోనే గుజరాత్‌ లయన్స​ తనను తీసుకుంటుందని ఆశించానన్నాడు. కాకపోతే వారు తనను రెండు సీజన్ల వేలంలో కూడా కొనుగోలు చేయకపోవడం చాలా నిరాశపరిచిందన్నాడు. ఒకవేళ అప్పుడు వారు తనను తీసుకుని హోమ్‌ టౌన్‌లో ఆడే అవకాశాన్ని ఇచ్చి ఉంటే బాగుండేదన్నాడు. అదంతా గడిచి పోయిన గతమని, ప్రస్తుతం ఏమి చేయాలనే దానిపై దృష్టి పెడుతున్నట్లు పుజారా తెలిపాడు.  ఇక చివరి గేమ్‌ ఎవరితో ఆడారో గుర్తుందా అనే ప్రశ్నకు పుజారా సమాధానమిస్తూ.. ‘ నేను కింగ్స​ పంజాబ్‌ తరఫున చివరి సారి ఆడాను. ముంబై ఇండియన్స్‌తో వాంఖేడ్‌లో జరిగిన మ్యాచ్‌ అది.  వరల్డ్‌ బెస్ట్‌ లీగ్‌ అయిన ఐపీఎల్‌లో  తిరిగి ఆడబోతుండటం సంతోషాన్ని ఇచ్చిందన్నాడు.  ఇక్కడ చదవండి: ఐపీఎల్‌ 2021: సీఎస్‌కే లాజిక్‌ అదేనా?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top