
చెన్నై: ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్‌మన్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో ఫ్రాంచైజీల ఫేవరెట్‌గా మారాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని చేజిక్కించుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇరు ఫ్రాంచైజీలు పోటీపడితే మాత్రం అతనిపై కోట్లు కురిసే అవకాశముంది. మ్యాక్సీతో పాటు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ, ఇతని సహచరుడు, నంబర్‌వన్ టి20 బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్‌లు కూడా వేలంలో చెప్పుకోదగ్గ ధర పలకొచ్చు. వేలానికి వెయ్యిమందికి పైగా ఆటగాళ్లు ఆసక్తి చూపగా... వడపోత అనంతరం చివరకు 292 మంది వేలంలోకి వచ్చారు. ఇందులో 164 మంది భారత ఆటగాళ్లయితే... 125 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. మరో ముగ్గురు అసోసియేట్ దేశాలకు చెందిన ఆటగాళ్లు. మొత్తం 8 ఫ్రాంచైజీల్లో కలిపి 61 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా బెంగళూరులో 11 ఖాళీలుండగా... ఈ ఫ్రాంచైజీ చేతిలో రూ. 35.40 కోట్లు మిగిలున్నాయి. అతి తక్కువగా మూడే ఖాళీలు హైదరాబాద్‌లో ఉన్నాయి. ఇందుకోసం రూ. 10.75 కోట్లు అందుబాటులో ఉన్నాయి.