
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త నిబంధన ప్రవేశపెట్టింది. అండర్-16, అండర్-19 ఆటగాళ్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఆడాలంటే.. కనీసం ఒక్క ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ అయినా ఆడి ఉండాలని తెలిపింది. ముంబైలో ఆదివారం జరిగిన వార్షిక సర్వ సభ్య సమావేశంలో బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
వైభవ్ సూర్యవంశీ అలానే వచ్చాడు
కాగా ఐపీఎల్‌లో ఇప్పటికే ఎంతో మంది అండర్-19 ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకున్న విషయం తెలిసిందే. అయితే, బిహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ మాత్రం పదమూడేళ్ల 243 రోజుల వయసులోనే ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయాడు.
ఐపీఎల్ వేలం-2025 సందర్భంగా రాజస్తాన్ రాయల్స్ వైభవ్ (Vaibhav Suryavanshi)ను ఏకంగా రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే, అంతకంటే ముందే వైభవ్ సూర్యవంశీ దేశీ జట్టు తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాడు. రంజీల్లో చిన్న వయసులోనే అరంగేట్రం చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఆయుశ్ మాత్రే సైతం
ఇక వైభవ్‌తో పాటు.. మహారాష్ట్రకు చెందిన ఆయుశ్ మాత్రే కూడా ఇదే కోవకు చెందుతాడు. ఇప్పటికే రంజీల్లో ఆడుతున్న ఆయుశ్.. ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించారు. వీరితో పాటు ఆండ్రీ సిద్దార్థ్, ముషీర్ ఖాన్, స్వస్తిక్‌చికారా.. సౌతాఫ్రికాకు చెందిన క్వెనా మఫాకా.. అఫ్గనిస్తాన్ ఆటగాడు అల్లా ఘజన్‌ఫర్ వంటి వాళ్లు అండర్-19 స్థాయిలోనే ఐపీఎల్‌లో అడుగుపెట్టారు.
ఇకపై అదే అర్హత
అయితే.. ఇకపై ఐపీఎల్‌లోకి రావాలంటే అండర్-16, అండర్-19 ప్లేయర్లు కనీసం ఒక్క ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ అయినా ఆడాలని బీసీసీఐ తాజాగా నిర్ణయించింది. అంతకుముందు ఈ నిర్ణయం ఫ్రాంఛైజీల చేతుల్లో ఉండేది. అండర్-16, 19 స్థాయిల్లో తమకు నచ్చిన ఆటగాళ్లను ఫ్రాంఛైజీలు ఎంచుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు మాత్రం అలా కుదరదు.
కనీసం ఒక్క ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడిన ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. బీసీసీఐ నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో హర్షం వ్యక్తమవుతోంది. ప్రతిభతో పాటు సంప్రదాయ క్రికెట్‌లో నైపుణ్యాలు కలిగిన ఆటగాళ్లను ఎంపిక చేయడం ద్వారా వారి భవిష్యత్తుతో పాటు లీగ్‌కు కూడా మేలు జరుగుతుందని నెటిజన్లు అంటున్నారు.
చదవండి: ‘పాక్‌తో ఫైనల్... శివం దూబే అవుట్!.. భారత తుదిజట్టు ఇదే!