వచ్చే ఏడాది 9 జట్లతో ఐపీఎల్‌!

IPL 2021 to be played with 9 teams - Sakshi

ముంబై: నాలుగు నెలల్లో ఐపీఎల్‌–14 జరగాలి. ఈ సీజన్‌కు, వచ్చే సీజన్‌కు విరామం తక్కువున్నా తప్పనిసరిగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లోనే నిర్వహించాలి. ఎందుకంటే వచ్చే ఏడాది భారత్‌ ఆతిథ్యమిచ్చే టి20 ప్రపంచకప్‌ కూడా నిర్వహించాలి. ఈ ఏడాదిలా 2021లో ఐపీఎల్‌ వాయిదా వేస్తే కుదరదు. అందుకే వెంటనే భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఐపీఎల్‌ పాలకమండలి వచ్చే సీజన్‌పై కసరత్తు మొదలుపెట్టాయి. అందులో భాగంగానే వచ్చే సీజన్‌లో 8 జట్లు కాకుండా 9 జట్లను ఆడిస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది.

అలాగే పాక్షిక వేలం కాకుండా వచ్చే సీజన్‌ కోసం మెగా వేలాన్ని నిర్వహించాలా అనే దానిపై కూడా బోర్డు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఇదే జరిగితే ఆటగాళ్లందరినీ వేలానికి తెస్తారు. అప్పుడు జట్ల రూపురేఖలు మారొచ్చు. అయితే ఇది కేవలం ప్రతిపాదనే అని దీనిపై ఇంకా చర్చగానీ, నిర్ణయం కానీ తీసుకోలేదు. ‘రెండు నెలల్లో జరిగే వేలానికి సిద్ధంగా ఉండాలంటూ బీసీసీఐ మాకు సమాచారం ఇచ్చింది. అధికారికంగా తెలపకపోయినా... మరో జట్టు చేరే అవకాశమున్నట్లు మాకూ తెలిసింది’ అని ఒక ఫ్రాంచైజీ ఉన్నతాధికారి వెల్లడించారు.

లక్షా 10 వేల మంది సామర్థ్యం కలిగిన సర్దార్‌ పటేల్‌ స్టేడియం వేదికగా అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీ కొత్తగా రానుందని, బడా కార్పొరేట్‌ సంస్థలు దీనిపై కన్నేశాయని కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో వేలం ఎలా వుంటుందో, ఆటగాళ్ల రిటెన్షన్‌ పాలసీ (అట్టిపెట్టుకునే విధానం) ఏ విధంగా మారుతుందోననే చర్చ మొదలైంది. ఆటగాళ్లను అట్టిపెట్టుకునేందుకు అనుమతిస్తారా లేదంటే అందరీని వేలంలోకి తేస్తారా అనే విషయంపై బోర్డు ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ఐపీఎల్‌ స్టేక్‌ హోల్డర్స్‌తో సమావేశం ఏర్పాటు చేశాకే దీనిపై మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయి.  
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top