Interesting Story How Kylian Mbappe Turns Super Star Just 23 Years Age - Sakshi
Sakshi News home page

Kylian Mbappe: నిండా పాతికేళ్లు లేవు.. ప్రపంచమే సలాం కొట్టింది; ఎవరీ ఎంబాపె

Published Tue, Dec 20 2022 8:20 AM | Last Updated on Tue, Dec 20 2022 10:19 AM

Intresting Story How Kylian Mbappe-Turns Super Star-Just-23-Years Age - Sakshi

డిసెంబర్‌ 18(ఆదివారం) జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్లో అర్జెంటీనాకు ముచ్చెమటలు పట్టించాడు ఫ్రాన్స్‌ సూపర్‌స్టార్‌ కైలియన్‌ ఎంబాపె. మరో 10 నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా రంగంలోకి దిగిన ఎంబాపె మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. కదలికల్లో చిరుత కంటే వేగంతో పరిగెత్తాడు. కేవలం 97 సెకన్ల వ్యవధిలోనే రెండు గోల్స్‌ కొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అలా నిర్ణీత సమయంలోగా 2-2తో ఎలాంటి ఫలితం రాలేదు. అదనపు సమయంలోనూ జట్టు వెనుకబడ్డ దశలో మరో పెనాల్టీ గోల్‌తో మ్యాచ్‌ను షూటౌట్‌కు తీసుకెళ్లాడు. అందులోనూ విజయం సాధించాడు ఎంబాపె.

అయితే తాను ఒక్కడే ఆడితే సరిపోదు కదా.. సహచర ఆటగాళ్లు కూడా ఆడాలి. కానీ వాళ్లు ఆడలేదు.. ఫ్రాన్స్‌ ఓడిపోయింది. ఆ క్షణం ఎంబాపె మొకాళ్లపై మైదానంలో కూలబడ్డాడు. స్టేడియం మొత్తం మెస్సీ నామస్మరణతో మారుమోగుతున్న వేళ.. తాను మాత్రం నిరాశలో మునిగిపోయాడు. కానీ అతని ఆట తీరుకు ముగ్దులైన యావత్‌ ప్రపంచం వీరుడి పోరాటానికి సలాం కొట్టింది.

ఈ తరంలో మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలను.. ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఆటగాళ్లుగా అభివర్ణిస్తుంటారు. తాజాగా ప్రపంచకప్‌ కొట్టి మెస్సీ రొనాల్డో కంటే ఒక మెట్టు పైనున్నాడనుకోండి. అది వేరే విషయం. ఈ ఇద్దరు దిగ్గజాలు తమ చివరి వరల్డ్‌కప్‌ను దాదాపు ఆడేసినట్లే. వచ్చే వరల్డ్‌కప్‌ వరకు అందుబాటులో ఉంటారన్నది అనుమానమే. ఈ నేపథ్యంలో ఫుట్‌బాల్‌కు మరో కొత్త సూపర్‌స్టార్‌ కావాల్సిన అవసరం వచ్చింది.

నాలుగేళ్ల క్రితమే ఫ్రాన్స్‌ ఫిఫా వరల్డ్‌కప్‌ గెలవడంలో ఎంబాపెది కీలకపాత్ర. 19 ఏళ్ల వయస్సులోనే ఫిఫా టైటిల్‌ను కొల్లగొట్టిన అతను.. ఈసారి కూడా అదే ఆటతీరుతో అదరగొట్టాడు. ముఖ్యంగా అర్జెంటీనాతో ఫైనల్లో ఎంబాపె ఆటతీరుకు ముచ్చటపడని వారుండరు. పట్టుమని పాతికేళ్లు కూడా లేని 23 ఏళ్ల కుర్రాడు ఫుట్‌బాల్‌లో సంచలన ప్రదర్శన చేస్తూ ఇక వచ్చే శకం తనదేనని ప్రపంచానికి సగర్వంగా చాటాడు. మరి అంతలా పేరు సంపాదించిన ఎంబాపె అసలు ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చాడు.. 23 ఏళ్ల వయసులోనే ఇన్ని అద్భుతాలు ఎలా చేస్తున్నాడనేది ఆసక్తికరంగా మారింది.

ఎంబాపె తల్లిదండ్రులిద్దరు క్రీడాకారులే. కామెరూన్‌ నుంచి శరణార్థిగా పారిస్‌ శివారులోని బాండీకి వచ్చిన ఎంబాపె ఫుట్‌బాల్‌ ఆడేవాడు. ఆ తర్వాత కోచ్‌గా మారాడు. అల్జీరియాకు చెందిన అతని భార్య ఫైజా హ్యాండ్‌బాల్‌ క్రీడాకారిణిగా రాణించింది. 1998లో ఫ్రాన్స్‌ తొలిసారి ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ అందుకున్నప్పుడు పుట్టాడు కైలియన్‌ ఎంబాపె. అయితే ఎంబాపె పుట్టడమే గోల్డెన్‌ స్పూన్‌తో పుట్టలేదు. ఇరుకు గదుల్లో ఉంటూ.. కడు పేదరికంలో పెరిగిన ఎంబాపె చిన్నప్పటి నుంచే ఫుట్‌బాల్‌పై ఇష్టాన్ని పెంచుకున్నాడు. చదువు కంటే ఆటనే ఎక్కువగా ప్రేమించిన కొడుకును చూసి సంతోషపడిన తండ్రి విల్‌ఫ్రైడ్‌ ప్రోత్సహించాడు.

ఎంబాపెకు ఫుట్‌బాల్‌ ఆటలో ఓనమాలు నేర్పిన మొదటి గురువు కూడా అతని తండ్రే కావడం విశేషం. ఆ తర్వాత ఎంబాపెను తాను పనిచేసే ఏఎస్‌ బాండీ క్లబ్‌లో జాయిన్‌ చేశాడు. అలా ఫుట్‌బాల్‌ ఆటలో పట్టు సాధించిన ఎంబాపె రెండేళ్ల పాటు మొనాకోకు ఆడాడు. 2017 ఎంబాపె కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచింది. పారిస్‌ సెయింట్‌ జెర్మైన్‌తో(పీఎస్‌జీ) ఎంబాపెకు ఒప్పందం కుదిరింది. ఇక్కడే మెస్సీ, నెయమర్‌ లాంటి స్టార్‌ ఆటగాళ్లతో ఆడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత స్పెయిన్‌ దిగ్గజ క్లబ్‌ రియల్‌ మాడ్రిడ్‌ నుంచి ఎంబాపెకు పిలుపొచ్చినా .. పీఎస్‌జీకి కొనసాగడంలో ఆ దేశ అధ్యక్షుడు ఎమాన్యుయెల్‌ మక్రాన్‌ ముఖ్య పాత్ర పోషించాడు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.. ఎంబాపెకు ఎంత ప్రాముఖ్యత ఉందనేది.

అలా 2018 ఫిఫా వరల్డ్‌కప్‌ రానే వచ్చింది. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఫైనల్‌ చేరిన ఫ్రాన్స్‌ విశ్వవిజేతగా అవతరించింది. 19 ఏళ్ల వయసులోనే ఫిఫా వరల్డ్‌కప్‌ టైటిల్‌ సాధించిన ఎంబాపె ఆ ప్రపంచకప్‌లో నాలుగు గోల్స్‌ కొట్టాడు. అయితే ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌లో అన్నీ తానై నడిపించిన ఎంబాపె ఏకంగా ఎనిమిది గోల్స్‌ కొట్టి గోల్డెన్‌ బూట్‌ ఎగురేసుకుపోయాడు. 23 ఏళ్ల వయసులోనే ప్రత్యర్థి జట్లను అల్లాడిస్తూ ఫుట్‌బాల్‌ను శాసిస్తున్న ఎంబాపె ఇదే ఆటతీరు ప్రదర్శిస్తే భవిష్యత్తులో దిగ్గజ ఆటగాడిగా పేరు పొందడం ఖాయం. సలాం కైలియన్‌ ఎంబాపె.

చదవండి: మెస్సీ మ్యాజిక్కా.. అదృష్టమా.. ఎంబాపె అల్లాడించాడు

36 ఏళ్ల నిరీక్షణకు తెర.. మెస్సీకి ఘనంగా వీడ్కోలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement