నేడు అఫ్గానిస్తాన్‌తో భారత్ తొలి వన్డే
మధ్యాహ్నం గం.1:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
ధర్మశాల: వన్డే వరల్డ్ కప్ వచ్చే ఏడాది అక్టోబర్–నవంబర్‌లలో జరగనుండగా... దానికి ముందు భారత జట్టు కనీసం 25 వన్డేలు ఆడనుంది. మెగా టోర్నీ కోసం జట్టును సిద్ధం చేసేందుకు, అందుబాటులో ఉన్న అన్ని రకాల ప్రత్యామ్నాయాలను పరీక్షించేందుకు మేనేజ్‌మెంట్‌కు ఇదే సరైన సమయం. ఈ నేపథ్యంలో ఓపెనర్, మాజీ కెపె్టన్ రోహిత్ శర్మపైనే అందరి దృష్టీ నిలిచింది. భారత్, అఫ్గానిస్తాన్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు ధర్మశాలలో తొలి వన్డే జరగనుంది.
ఇటీవల ఐపీఎల్‌లో ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొని కోలుకున్న రోహిత్ ఎలా ఆడతాడనేది ఆసక్తికరం. గాయంతో ఇప్పటికే విరాట్ కోహ్లి సిరీస్ నుంచి తప్పుకోవడంతో రోహిత్ ఆట కీలకం కానుంది. 39 ఏళ్ల రోహిత్ అటు బ్యాటింగ్‌లో రాణించడంతో పాటు తన ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాల్సి ఉంటుంది. భారత్ తమ ఆఖరి వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడగా, రోహిత్ అన్ని మ్యాచ్‌లలో విఫలమయ్యాడు.
సత్తా చాటేందుకు నితీశ్ సిద్ధం...
కెపె్టన్ శుబ్‌మన్ గిల్‌తో పాటు రోహిత్ ఓపెనింగ్ చేయనుండగా... కోహ్లికి బదులుగా ఇషాన్ కిషన్ మూడో స్థానంలో దిగవచ్చు. ఆ తర్వాత శ్రేయస్, రాహుల్ స్థానాలు పదిలం కాగా, ఇద్దరు స్పిన్నర్లు కుల్దీప్, సుందర్ ఉంటారు. ఇక్కడి పిచ్‌ను బట్టి చూస్తే భారత్ ముగ్గురు పేసర్లతో ఆడనుంది. ప్రసిధ్, అర్ష్ దీప్‌లతో పాటు మూడో స్థానం కోసం కొత్త ఆటగాడు గుర్నూర్ సింగ్, ప్రిన్స్ యాదవ్ మధ్య పోటీ ఉంది. ఇద్దరిలో ఒకరు అంతర్జాతీయ అరంగేట్రం చేయడం ఖాయం.
ఆరో స్థానంలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్, ఆంధ్ర ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి తన చోటును సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో నిలకడగా రాణించిన నితీశ్ తన గత వన్డేలో అర్ధ సెంచరీ కూడా సాధించాడు. బౌలింగ్‌లో కూడా పేస్ పదును పెంచుకున్న అతను టి20లను దాటి ఈ ఫార్మాట్‌లో 10 ఓవర్లు ఎలా వేస్తాడనేది ఆసక్తికరం. హార్దిక్ పాండ్యా పదే పదే గాయాలతో జట్టుకు దూరమవుతున్న నేపథ్యంలో నితీశ్‌కు ఇది చాలా చక్కటి అవకాశం.
3–0తో ఆధిక్యం...
మరోవైపు అఫ్గానిస్తాన్ జట్టు అనుభవజు్ఞలైన ఆటగాళ్లపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఇబ్రహీమ్, గుర్బాజ్, రహ్మత్ షా, హష్మతుల్లా ప్రధాన బ్యాటర్లు కాగా... ఆల్‌రౌండర్‌గా అజ్మతుల్లా ఒమర్జాయ్ గత రెండేళ్లలో చాలా బాగా ఆడుతున్నాడు. టెస్టు ఆడని రషీద్ ఖాన్ రాకతో స్పిన్ బలంగా మారగా, ఘజన్‌ఫర్ కూడా కీలకం కానున్నాడు. ఇరు జట్ల మధ్య ఇదే తొలి ద్వైపాక్షిక సిరీస్. గతంలో ప్రపంచకప్, ఆసియా కప్‌లలో కలిపి రెండు టీమ్‌లు 4 మ్యాచ్‌లలో తలపడగా... భారత్ 3 గెలిచింది. మరో మ్యాచ్ ‘టై’గా ముగిసింది.


