Indw vs Ausw: తమ వన్డేల చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా

India Women Defeat Australia Women By 2 Wickets - Sakshi

చివరి వన్డేలో మెరిసిన భారత మహిళల జట్టు 

ఆస్ట్రేలియాపై రెండు వికెట్లతో విజయం

రాణించిన షఫాలీ, యస్తిక, జులన్‌ గోస్వామి

29 అక్టోబర్, 2017... ఆస్ట్రేలియా మహిళల జట్టు చివరిసారి వన్డేల్లో ఓడిన రోజు. ఆ మ్యాచ్‌ తర్వాత ఆ్రస్టేలియా జైత్రయాత్ర మొదలైంది. ఒకటి కాదు.. రెండు కాదు... మూడు కాదు... వరుసగా 26 వన్డేల్లో ఆ జట్టు గెలుస్తూ వచి్చంది. పురుషుల, మహిళల క్రికెట్‌లో ఏ జట్టుకూ సాధ్యంకాని ఘనతను సాధించింది. ఎట్టకేలకు 3 సంవత్సరాల 11 నెలల తొమ్మిది రోజుల తర్వాత మళ్లీ ఆస్ట్రేలియా మహిళల జట్టు వన్డేల్లో ఓటమి చవిచూసింది.

రెండో వన్డేలో చివరి బంతికి ఓడిపోయిన బాధను అధిగమిస్తూ... సిరీస్‌ను కోల్పోయిన విషయాన్ని విస్మరిస్తూ... మిథాలీ రాజ్‌ నాయకత్వంలోని భారత జట్టు చివరిదైన మూడో వన్డేలో పోరాడితే పోయేదేమీ లేదన్నట్లుగా దూకుడుగా ఆడింది. మూడు బంతులు మిగిలి ఉండగా 265 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో టీమిండియా తమ వన్డే చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన రికార్డును సృష్టించింది. దాదాపు నాలుగేళ్లుగా ఓటమి ఎరుగని ఆస్ట్రేలియాకు పరాజయం రుచి చూపించింది. చివరి వన్డేలో ఓడినా ఆస్ట్రేలియా 2–1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.

మెకాయ్‌ (క్వీన్స్‌లాండ్‌): తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి డీలాపడ్డ భారత మహిళల జట్టు చివరి వన్డేలో మాత్రం రికార్డు ఛేదనతో అదరగొట్టింది. 265 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 49.3 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 266 పరుగులు చేసి రెండు వికెట్ల తేడాతో నెగ్గింది. వన్డేల్లో భారత్‌కిదే అత్యధిక ఛేదన కావడం విశేషం. మరోవైపు వరుసగా 26 వన్డేల్లో నెగ్గిన ఆ్రస్టేలియాకు ఇదే తొలి పరాజయం. తొలి రెండు వన్డేల్లో నెగ్గిన ఆ్రస్టేలియా సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుంది. రెండు జట్ల మధ్య ఈనెల 30న ఏకైక టెస్టు (డే/నైట్‌) మొదలవుతుంది.  

శుభారంభం...
టాస్‌ గెలిచిన ఆ్రస్టేలియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిరీ్ణత 50 ఓవర్లలో 9 వికెట్లకు 264 పరుగులు చేసింది. యాష్లే గార్డ్‌నర్‌ (62 బంతుల్లో 62; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), బెత్‌ మూనీ (64 బంతుల్లో 52; 6 ఫోర్లు), తహిలా మెక్‌గ్రాత్‌ (32 బంతుల్లో 47; 7 ఫోర్లు) రాణించారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జులన్‌ గోస్వామి, పూజా వస్త్రాకర్‌ చెరో మూడు వికెట్లు తీశారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు షఫాలీ వర్మ (91 బంతుల్లో 56; 7 ఫోర్లు), స్మృతి మంధాన (25 బంతుల్లో 22; 3 ఫోర్లు) తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు.

అనంతరం యస్తిక భాటియా (69 బంతుల్లో 64; 9 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడింది. షఫాలీ, యస్తిక రెండో వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యం జత చేశారు. ఈ క్రమంలో షఫాలీ, యస్తిక వన్డేల్లో తమ తొలి అర్ధ సెంచరీలను సాధించారు. షఫాలీ అవుటయ్యాక రిచా ఘోష్‌ (0), యస్తిక, పూజా వ్రస్తాకర్‌ (3), కెపె్టన్‌ మిథాలీ రాజ్‌ (16) వెంట వెంటనే అవుటవ్వడంతో భారత శిబిరంలో ఆందోళన నెలకొంది. అయితే దీప్తి శర్మ (30 బంతుల్లో 31; 3 ఫోర్లు), స్నేహ్‌ రాణా (27 బంతుల్లో 30; 5 ఫోర్లు) నిలబడి భారత్‌ను విజయం దిశగా నడిపించారు. అయితే ఓవర్‌ తేడాలో వీరిద్దరూ పెవిలియన్‌కు చేరడంతో మళ్లీ ఉత్కంఠ పెరిగింది.

ఈ దశలో జులన్‌ గోస్వామి (7 బంతుల్లో 8 నాటౌట్‌; 1 ఫోర్‌), మేఘన సింగ్‌ (3 బంతుల్లో 2 నాటౌట్‌) ఒత్తిడికి లోనుకాకుండా ఆడి మూడు బంతులు మిగిలి ఉండగానే భారత్‌కు విజయాన్ని అందించారు. చివరి ఓవర్లో భారత్‌ విజయానికి 4 పరుగులు అవసరమయ్యాయి. ఆసీస్‌ స్పిన్నర్‌ మోలినెక్స్‌ వేసిన ఈ ఓవర్‌ తొలి బంతికి మేఘన పరుగు తీయలేదు. రెండో బంతికి సింగిల్‌ తీసి జులన్‌ గోస్వామికి స్ట్రయిక్‌ ఇచి్చంది. మూడో బంతిని జులన్‌ గోస్వామి ముందుకు వచ్చి స్ట్రయిట్‌ లాఫ్టెడ్‌ షాట్‌ కొట్టింది. బంతి బౌండరీ దాటింది. భారత్‌కు విజ యం ఖాయమైంది. రెండో వన్డేలో జులన్‌ గోస్వామి వేసిన చివరి ఓవర్లోనే భారత్‌ ఓటమి చవిచూడగా... మూడో వన్డేలో జులన్‌ గోస్వామియే భారత్‌కు విజయాన్ని కట్టబెట్టింది. తాజా గెలుపుతో భారత్‌ 2019లో వదోదరాలో దక్షిణాఫ్రికాపై ఛేదించిన 248 పరుగుల లక్ష్యం రికార్డును సవరించింది.

సంక్షిప్త స్కోర్లు
ఆ్రస్టేలియా ఇన్నింగ్స్‌: 264/9 (అలీసా హీలీ 35, ఎలీస్‌ పెర్రీ 26, బెత్‌ మూనీ 52, యాష్లే గార్డ్‌నర్‌ 67, తహిలా మెక్‌గ్రాత్‌ 47, జులన్‌ గోస్వామి 3/37, పూజా వస్త్రాకర్‌ 3/46);
భారత్‌ ఇన్నింగ్స్‌: 266/8 (49.3 ఓవర్లలో) (షఫాలీ వర్మ 56, స్మృతి మంధాన 22, యస్తిక భాటియా 64, దీప్తి శర్మ 31, స్నేహ్‌ రాణా 30, అనాబెల్‌ సదర్లాండ్‌ 3/30).

ఈ విజయంతో చాలా ఆనందంగా ఉన్నాం. భారత్‌లో భారత్‌పైనే ఆస్ట్రేలియా వరుస విజయాల పరంపర మొదలైంది. ఆసీస్‌ విజయాలకు మనమే అడ్డకట్ట వేయగలమని జట్టు సభ్యులకు చెబుతూ వచ్చాను. చివరికి అమ్మాయిలు నిజం చేసి చూపించారు. షఫాలీ, యస్తిక, స్నేహ్‌ రాణా అద్భుతంగా ఆడారు.
 – మిథాలీ రాజ్‌
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top