ఉప్పల్‌లో తుఫాన్‌కు సై | India vs West Indies fourth T20 in Hyderabad tomorrow | Sakshi
Sakshi News home page

ఉప్పల్‌లో తుఫాన్‌కు సై

Oct 13 2026 4:23 AM | Updated on Oct 13 2026 4:23 AM

India vs West Indies fourth T20 in Hyderabad tomorrow

రేపు హైదరాబాద్‌లో నాలుగో టి20 

మెరుపు బ్యాటింగ్‌కు భారత్, విండీస్‌ సిద్ధం

సాక్షి, హైదరాబాద్‌: సరిగ్గా రెండేళ్ల క్రితం దసరా పండగ రోజున ఉప్పల్‌ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్‌ టి20 మ్యాచ్‌ జరిగింది. సామ్సన్‌ 47 బంతుల్లోనే 111 పరుగులు చేయగా, మ్యాచ్‌లో భారత్‌ 22 సిక్సర్ల మోత మోగించింది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌ 164 పరుగులకే కుప్పకూలడంతో భారత్‌ ఏకంగా 133 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ ఉప్పల్‌ మైదానంలో మరో అంతర్జాతీయ టి20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. దీనికి ముందు ఈ స్టేడియంలో రెండు అంతర్జాతీయ టి20లు జరగ్గా... అప్పుడూ ఒక్కో ఇన్నింగ్స్‌లో 207, 209, 186, 187 పరుగులు నమోదయ్యాయి. 

ఇక ఐపీఎల్‌లో ఇక్కడ పరుగుల విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సామ్సన్‌ సహచరుడు అభిషేక్‌ శర్మ ఈ మైదానంలో ఆడిన 31 ఐపీఎల్‌ మ్యాచ్‌లలో 141 స్ట్రయిక్‌రేట్‌తో ఏకంగా 975 పరుగులు చేశాడు. ఇప్పుడు వీరిద్దరు ఓపెనర్లుగా మరోసారి బరిలోకి దిగుతున్నారంటే హైదరాబాద్‌ క్రికెట్‌ అభిమానులందరికీ వినోదాల విందు ఖాయం. ఇప్పటికే తొలి మూడు టి20ల్లో మెరుపు ప్రదర్శనల తర్వాత భారత్, వెస్టిండీస్‌ ఇక్కడ ఎలా ఆడతాయనేది ఆసక్తికరం.  

పిచ్‌ మార్చినా... 
టి20 మ్యాచ్‌ ఏర్పాట్లలో భాగంగా కొద్దిరోజుల క్రితమే ఉప్పల్‌ స్టేడియంలో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) పలు మార్పులు చేసింది. ఇందులో భాగంగా రెండు పిచ్‌లను కూడా మార్చినట్లు హెచ్‌సీఏ ప్రకటించింది. అయితే వీటిని పూర్తిగా తవ్వి కొత్తగా వేసినట్లు కాకుండా పాడైపోయిన పిచ్‌ పైభాగాన్నే సరి చేశారు. కాబట్టి మూల లక్షణంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. అందుకే మరోసారి మ్యాచ్‌లో భారీ స్కోర్లకే ఎక్కువగా అవకాశం ఉంది. అభిషేక్‌తో పాటు ఇతర సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు ఇషాన్‌ కిషన్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి కూడా సత్తా చాటితే భారత్‌కు తిరుగుండదు. హైదరాబాద్‌ లోకల్‌ ప్లేయర్‌ తిలక్‌వర్మకు సొంతగడ్డపై ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ కానుంది. అతను కూడా తన స్థాయికి తగ్గట్లు ఆడాలని పట్టుదలగా ఉన్నాడు.  

నగరానికి చేరుకున్న ఆటగాళ్లు...
నాలుగో టి20 మ్యాచ్‌ కోసం భారత్, వెస్టిండీస్‌ ఆటగాళ్లు సోమవారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. హెచ్‌సీఏ ప్రతినిధులు వారికి స్వాగతం పలకగా, భారీ భద్రత మధ్య క్రికెటర్లు హోటల్‌కు చేరుకున్నారు. మ్యాచ్‌కు ముందు రోజు సన్నాహాల్లో భాగంగా నేడు ఉప్పల్‌ స్టేడియంలో ఇరు జట్ల ప్లేయర్లు ప్రాక్టీస్‌ చేయనున్నారు.

3 ఉప్పల్‌ స్టేడియంలో 3 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు జరగ్గా మూడూ భారత్‌ గెలుచుకుంది. వెస్టిండీస్‌ (2019), ఆస్ట్రేలియా (2022), బంగ్లాదేశ్‌ (2024)లపై టీమిండియా గెలిచింది.

విండీస్‌ క్రికెటర్లకు హెచ్చరిక...
ఇండోర్‌లో జరిగిన మూడో టి20లో క్రమశిక్షణను ఉల్లంఘించిన వెస్టిండీస్‌ క్రికెటర్లు రావ్‌మాన్‌ పావెల్, షెర్ఫాన్‌ రూథర్‌ఫర్డ్‌లను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) హెచ్చరించడంతో పాటు ఒక డీమెరిట్‌ పాయింట్‌ చొప్పున శిక్షగా విధించింది. పావెల్‌ అవుటై వెనుదిరుగుతున్న సమయంలో అసహనంగా బ్యాట్‌తో బంతిని కొట్టగా...అంపైర్‌ నిర్ణయంతో రూథర్‌ఫర్డ్‌ బహిరంగంగా అసంతప్తిని ప్రదర్శించాడు. దాంతో ఫీల్డ్‌ అంపైర్లు ఫిర్యాదు చేయగానిబంధనల ప్రకారం మ్యాచ్‌ రిఫరీ చర్య తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement