నేడు భారత్, దక్షిణాఫ్రికా మహిళల మూడో టి20 మ్యాచ్
రాత్రి గం. 9:30 నుంచి జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత మహిళల క్రికెట్ జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు... బుధవారం మూడో మ్యాచ్ బరిలోకి దిగనుంది. ఇప్పటికే సిరీస్‌లో 0–2తో వెనుకబడి ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఓడితే సిరీస్ కోల్పోతుంది. ఈ నేపథ్యంలో జట్టు మొత్తం కలిసికట్టుగా కదంతొక్కాలని భావిస్తోంది.
టి20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్‌లో భారత బ్యాటర్లు షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ ఫర్వాలేదనిపిస్తుండగా... మిగిలిన వాళ్లు ఆకట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన వైఫల్యం జట్టును ఇబ్బంది పెడుతోంది. సిరీస్ కోల్పోయే ప్రమాదంలో ఉన్న తరుణంలో స్మృతి, జెమీమా, షఫాలీ, హర్మన్‌ప్రీత్, రిచా ఘోష్, దీప్తి శర్మ సమష్టిగా సత్తా చాటాల్సిన అవసరముంది.
‘ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను పరిశీలిస్తే ఆరంభంలో మా బ్యాటింగ్ బాగానే సాగింది. కానీ చివర్లో వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో బ్యాటర్లు విఫలమయ్యారు. ఈ సారి ఆ తప్పిదాలను అధిగమిస్తాం. దీప్తికి అపార అనుభవం ఉంది. ఒకటీ రెండు మ్యాచ్‌ల్లో ప్రదర్శన బాగాలేనంత మాత్రానే ఆమె ప్రతిభను తక్కువ అంచనా వేయలేం. వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు అన్నీ విధాలుగా సిద్ధమవుతాం’ అని టీమిండియా బౌలింగ్ కోచ్ అవిష్కార్ సాల్వీ అన్నాడు. మరోవైపు వరుస విజయాలతో జోరు మీదున్న దక్షిణాఫ్రికా ఇక్కడే సిరీస్ చేజిక్కించుకోవాలని పట్టుదలగా ఉంది.


