India vs England: ప్రతీకారానికి సమయం!

India vs England Womens World Cup 2022: Head to Head Stats - Sakshi

నేడు ఇంగ్లండ్‌తో భారత్‌ పోరు 

మహిళల వన్డే వరల్డ్‌ కప్‌ 

ఉ.గం.6.30నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

దాదాపు ఐదేళ్ల క్రితం...అద్భుత ఆటతీరుతో భారత మహిళల జట్టు వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కు చేరింది. నాటి మన ఆటను చూస్తే టైటిల్‌ ఖాయమనిపించింది. అయితే ఆఖరి మెట్టుపై ఇంగ్లండ్‌ మన విజయాన్ని అడ్డుకుంది. చివరి వరకు పోరాడినా...మిథాలీ సేన 9 పరుగులతో ఓడి రన్నరప్‌గానే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నాటి మ్యాచ్‌ తర్వాత ఇప్పుడు మరోసారి వరల్డ్‌ కప్‌లో ఇరు జట్లు ముఖాముఖీ తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ సారి ఆధిక్యం ఎవరిదనేది ఆసక్తికరం.

మౌంట్‌ మాంగనీ: వరల్డ్‌ కప్‌లో ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే ఇంగ్లండ్‌కంటే భారత్‌ పరిస్థితే మెరుగ్గా ఉంది. న్యూజిలాండ్‌ చేతిలో ఓడినా...పాకిస్తాన్, వెస్టిండీస్‌లపై సాధించిన ఘన విజయాలు జట్టును ముందంజలో నిలిపాయి. మరో వైపు డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ ఇప్పటి వరకు ఖాతా తెరవలేకపోయింది. ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఓడిన ఆ జట్టు పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. 

వాళ్లిద్దరి ఆటతో... 
కీలక పోరుకు ముందు ఇద్దరు స్టార్‌ బ్యాటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఫామ్‌లోకి రావడం భారత్‌కు అతి పెద్ద సానుకూలాంశం. విండీస్‌పై వీరిద్దరు శతకాలతో చెలరేగారు. మరో ఇద్దరు కీలక ప్లేయర్లు యస్తిక, రిచా ఘోష్‌ తమపై ఉన్న అంచనాలకు అనుగుణంగా సత్తా చాటాల్సి ఉంది. ఆల్‌రౌండర్లుగా స్నేహ్‌ రాణా, దీప్తి శర్మ కూడా ఈ మ్యాచ్‌లో కీలకం కానున్నారు. జులన్‌ అనుభవం, పూజ వస్త్రకర్‌ పదునైన బౌలింగ్‌ భారత్‌ను బలంగా మార్చాయి. అయితే అన్నింటికి మించి కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ కూడా మెరుగైన ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. గత మూడు మ్యాచ్‌లలో కలిపి ఆమె 45 పరుగులే చేయగలిగింది.  

గెలిపించేదెవరు?  
ఇంగ్లండ్‌లో పేరుకు అంతా గొప్ప ప్లేయర్లు ఉన్నా జట్టుకు ఒక్క విజయం కూడా అందించలేకపోవడం అనూహ్యం. ఈ మ్యాచ్‌లోనూ ఓడితే ఆ జట్టు సెమీస్‌ దారులు దాదాపుగా మూసుకుపోతాయి. సివర్‌ ఒక సెంచరీ, బీమాంట్‌ రెండు అర్ధ సెంచరీలు మినహా ఆ జట్టునుంచి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన రాలేదు. హీతర్‌నైట్, డన్‌క్లీ, జోన్స్‌ తగిన ప్రభావం చూపించలేకపోయారు. బౌలింగ్‌లో కూడా ఎకెల్‌స్టోన్, ష్రబ్‌సోల్‌ అంచనాలకు అందుకోలేకపోవడంతో టీమ్‌ గెలవడం సాధ్యం కాలేదు. ఇలాంటి స్థితిలో ఆ జట్టు భారత్‌ను నిలువరించాలంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top