
121 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) (8) తొలి ఓవర్‌లోనే రెండు బౌండరీలు బాది జోరుమీదున్నట్లు కనిపించినప్పటికీ.. ఆతర్వాతి ఓవర్‌లోనే ఔటయ్యాడు.
వార్రికన్ బౌలింగ్‌లో ఆండర్సన్ ఫిలిప్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. జైస్వాల్ ఔటయ్యాక కేఎల్ రాహుల్ (14), సాయి సుదర్శన్ (17) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ టీమిండియాను లక్ష్యం దిశగా తీసుకెళ్తున్నారు.
12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ వికెట్ నష్టానికి 39 పరుగులుగా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 82 పరుగులు చేయాల్సి ఉంది.
విండీస్ బ్యాటర్ల అనూహ్య పోరాటం
అంతకుముందు విండీస్ ఫాలో ఆడుతూ అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శించింది. ఆ జట్టు బ్యాటర్లు ఊహించని రీతిలో ప్రతిఘటించి భారత్ ముందు మూడంకెల టార్గెట్‌ను ఉంచారు.
తొలుత జాన్ క్యాంప్‌బెల్ (115), షాయ్ హోప్ (103) వీరోచిత శతకాలు బాది ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించగా.. ఆఖర్లో జస్టిన్ గ్రీవ్స్ (50 నాటౌట్), జేడన్ సీల్స్ (32) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించి టీమిండియా ముందు 121 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. గ్రీవ్స్, సీల్స్ చివరి వికెట్‌కు 79 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో కుల్దీప్, బుమ్రా తలో 3, సిరాజ్ 2, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు.
అంతకుముందు కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకే కుప్పకూలింది. ఆ ఇన్నింగ్స్‌లో అలిక్ అథనాజ్ (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5 డిక్లేర్) చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు.
కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.
చదవండి: World Cup 2025: వరుస ఓటములు.. భారత్ సెమీ ఫైనల్ చేరాలంటే...