Men's Hockey: జయహో శ్రీజేష్‌, ప్రత్యర్థులకు చుక్కలే!

India beats Germany hockey PR Sreejesh stood like a rock - Sakshi

ప్రత్యర్థి ఆటగాళ్లకు చుక్కలు చూపించిన స్టార్‌ గోల్‌ కీపర్‌ శ్రీజేష్ 

నా సంతోషం, విచారం అన్నీ పోస్ట్‌తోనే: శ్రీజేష్ 

లాంగ్‌ హాలిడే ప్లాన్‌ చేస్తున్నా:  శ్రీజేష్‌ భార్య అనీషా

సాక్షి,న్యూఢిల్లీ:  టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత విజయంతో కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్న భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది.  గురువారం జరిగిన హోరా హోరీ పోరులో చివరికి జర్మనీపై  మన్ ప్రీత్ సింగ్ నేతృత్వంలో టీమిండియా హాకీ జట్టు  ఆధిపత్యాన్ని చాటుకుంది. 41 సంవత్సరాల తర్వాత ఒలింపిక్ పతకం సాధించి చరిత్రను తిరగ రాసింది. ముఖ్యంగా నువ్వా నేనా అన్నట్టుగా ఉత్కంఠ భరితంగా సాగిన ఈ టఫ్‌ ఫైట్‌ లో అనుభవజ్ఞుడైన భారత గోల్ కీపర్‌ పీఆర్ శ్రీజేష్ జర్మనీ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. జర్మనీకి 13 పెనాల్టీ కార్నర్‌లు లభించినప్పటికీ, అడ్డుగోడగా నిలబడి, అద్భతమైన డిఫెన్స్‌తో  ప్రత్యర్థి గోల్స్‌ను అడ్డుకొని 5-4 తో విజయాన్ని భారత్‌కు అందించారు. 

మరోవైపు ఈ విజయంపై టీమిండియా కోచ్‌ , ఆస్ట్రేలియన్, గ్రాహం రీడ్ సంతోషం వ్యక్తం చేశారు. తమ కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందన్నారు. అలాగే మ్యాచ్‌ మొత్తానికి హీరోగా నిలిచిన స్టార్ గోల్‌ కీపర్ శ్రీజేష్‌ విజయానందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. దీనిపై తన  కుటుంబం గర్వంగా ఫీలవుతోందన్నారు. ఈ  ఆనందంలో అమ్మ కన్నీరు పెట్టుకుందని తనతో సరిగ్గా మాట్లాడలేకపోయిందని పేర్కొన్నాడు. తనకు ఇది పునర్జన్మ అని ఈ ఘనత కొత్త తరం ఆటగాళ్లను తయారు చేయడంలో సహాయపడుతుందనే విశ్వాసాన్ని ప్రకటించాడు.

ఇది ఇలా ఉంటే.. అపూర్వ విజయం విజిల్‌ వినిపించగానే నార్త్ పిచ్‌లో శ్రీజేష్ గోల్‌పోస్ట్ పైకి ఎక్కిన ఫోటో వైరల్‌గా మారింది. ‘జీవితమంతా పోస్ట్‌తోనే గడిపాను. అది నా ప్లేస్‌. నా కష్టం, నష్టం...సంతోషం...దుఃఖం అన్నీ పోస్ట్‌తోనే.. అందుకే అలా ఎక్కి వేడుక చేసుకున్నా’ అని శ్రీజేష్  భావోద్వేగంతో  వెల్లడించాడు. మరోవైపు లాంగ్‌ హాలిడే ప్లాన్‌ చేస్తున్నామని శ్రీజేష్ భార్య అనీషా మీడియాతో  పేర్కొనడం విశేషం. 

కాగా భారత జట్టులోని సిమ్రంజీత్ సింగ్ (17, 34 వ నిమిషాలు) తొలి బ్రేస్ సాధించగా, హార్దిక్ సింగ్ (27 వ), హర్మన్‌ప్రీత్ సింగ్ (29 వ) రూపిందర్ పాల్ సింగ్ (31 వ)  గోల్ సాధించారు. జర్మనీ తరఫున తైమూర్ ఒరుజ్ (2 వ), నిక్లాస్ వెల్లెన్ (24 వ), బెనెడిక్ట్ ఫుర్క్ (25 వ) లుకాస్ విండ్‌ఫెడర్ (48 వ) గోల్స్ సాధించిన సంగతి తెలిసిందే. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top