గ్రూప్‌ టాపర్‌గా భారత్‌ | India beat Hong Kong in the last league match | Sakshi
Sakshi News home page

గ్రూప్‌ టాపర్‌గా భారత్‌

Jul 21 2025 4:24 AM | Updated on Jul 21 2025 4:24 AM

India beat Hong Kong in the last league match

చివరి లీగ్‌ మ్యాచ్‌లో హాంకాంగ్‌పై గెలుపు    

 నేడు క్వార్టర్‌ ఫైనల్లో జపాన్‌తో ‘ఢీ’

ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌  

సోలో (ఇండోనేసియా): ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ జోరు సాగుతోంది. ఇప్పటికే క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన భారత జట్టు గ్రూప్‌ ‘డి’లో భాగంగా చివరి మ్యాచ్‌లో హాంకాంగ్‌పై విజయం సాధించింది. తద్వారా గ్రూప్‌లో అగ్రస్థానం దక్కించుకుంది. ఆదివారం జరిగిన పోరులో భారత్‌ 110–100 పాయింట్ల తేడాతో హాంకాంగ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌కు ముందే హాంకాంగ్‌ కూడా నాకౌట్‌ బెర్త్‌ దక్కించుకుంది.

మహిళల సింగిల్స్‌ తొలి పోరులో రుజులా రాము 11–8తో సుమ్‌ యూపై గెలిచి భారత జట్టుకు శుభారంభం అందించగా... భార్గవ్‌ రామ్‌–విశ్వతేజ్‌ జోడీ 11–5తో చెంగ్‌ సెయి షింగ్‌–డెంగ్‌ చీ ఫై జంటపై గెలిచి ఆధిక్యాన్ని మరింత పెంచింది. ఆ తర్వాత హాంకాంగ్‌ షట్లర్లు కాస్త ప్రతిఘటించినా... జూనియర్‌ మహిళల ప్రపంచ నంబర్‌వన్‌ తన్వీ శర్మ, రౌనక్‌ చౌహాన్‌ సహా యువ షట్లర్లు సత్తా చాటడంతో భారత జట్టు విజయం సాధించింది. 

సోమవారం జరగనున్న క్వార్టర్‌ ఫైనల్లో గ్రూప్‌ ‘ఎ’లో రెండో స్థానంలో నిలిచిన జపాన్‌ జట్టుతో భారత్‌ తలపడనుంది. ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ అత్యుత్తమంగా 2011లో కాంస్య పతకం సాధించింది. ఆ తర్వాత మరెప్పుడూ పతకం గెలవలేకపోయింది. గతేడాది క్వార్టర్‌ ఫైనల్లో మలేసియా చేతిలో ఓడింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement