
సౌత్ కొరియా వేదికగా జరుగుతున్న ఆర్చరీ ఛాంపియన్ షిప్-2025లో భారత ఆర్చర్లు సత్తాచాటారు. ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. రిషబ్ యాదవ్, అమన్ సైని, ప్రథమేష్ ఫుగేలో కూడిన భారత పురుషల జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది.
తొలి రౌండ్‌లో భారత బృందానికి బై లభించడంతో నేరుగా రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో సెకెండ్ రౌండ్‌లో ఇండియన్ టీమ్‌కు ఆస్ట్రేలియా నుంచి గట్టి పోటీ ఎదురైంది. నిర్ణీత సమయంలో రెండు జట్ల పాయింట్లు 232-232 సమం కావడంతో షూట్-ఆఫ్ నిర్వహించారు. షూట్-ఆఫ్‌లో 30-28 తేడాతో భారత్ విజయం సాధించింది.
అనంతరం క్వార్టర్ ఫైనల్‌లో యూఎస్‌పై (234-233) ఒక్క పాయింట్ తేడాతో భారత్ గెలుపొందింది. క్వార్టర్స్‌లో భారత్ ఆరంభం నుంచి వెనకబడి ఉన్నప్పటికి ఆఖరిలో ఆర్చర్లు అద్భుతాలు చేయడంతో యూఎస్‌పై పైచేయి సాధించింది.
ఇక సెమీఫైనల్లో మూడవ సీడ్ టర్కీ(234-232 )ని రెండు పాయింట్ల తేడాతో ఓడించి తమ ఫైనల్ బెర్త్‌ను టీమిండియా ఖారారు చేసుకుంది. ఆదివారం జరగనున్న ఫైనల్లో ఫ్రాన్స్‌ను భారత్ బృందం ఎదుర్కొనుంది. భారత్ ఫైనల్ చేరడంలో రిషబ్ యాదవ్‌ది కీలక పాత్ర. క్వాలిఫయింగ్ రౌండ్‌లో 709 పాయింట్లతో భారత తరపున టాప్ స్కోరర్‌గా నిలిచిన రిషబ్.. క్వార్టర్స్, సెమీస్‌లోనూ సత్తాచాటాడు.
ఆ తర్వాత రిషబ్ యాదవ్.. వెన్నం జ్యోతీ సురేఖతో కలిసి కాంపౌండ్ మిక్సిడ్ టీమ్ విభాగంలో భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు. సెమీఫైనల్లో చైనీస్ తైపీపై 157-155 పాయింట్లతో తేడాతో ఈ భారత ద్వయం విజయం సాధించింది. ఆదివారం ఫైనల్లో నెదర్లాండ్స్‌తో తలపడనున్నారు.