PC: X
భారత్- ‘ఎ’- సౌతాఫ్రికా- ‘ఎ’ జట్ల మధ్య అనధికారిక తొలి టెస్టు రసవత్తరంగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన సౌతాఫ్రికాను.. రెండో ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే భారత్ పరిమితం చేసింది. ఆఫ్ స్పిన్నర్ తనుశ్ కొటియాన్ (Tanush Kotian) మరోసారి నాలుగు వికెట్లతో చెలరేగి సఫారీ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.
నాలుగు వికెట్లు తీసిన తనుశ్
రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా భారత్- ‘ఎ’- సౌతాఫ్రికా- ‘ఎ’ (IND A vs SA A) జట్ల మధ్య గురువారం తొలి అనధికారిక టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఈ క్రమంలో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 309 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ జోర్డాన్ హెర్మాన్ (71), వన్‌డౌన్ బ్యాటర్ జుబేర్ హంజా (66), రుబిన్ హెర్మాన్ (54) అర్ధ శతకాలతో రాణించారు. టియాన్ వాన్ వారెన్ 46 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.
234 పరుగులకే ఆలౌట్
భారత బౌలర్లలో తనుశ్ కొటియాన్ నాలుగు వికెట్లు తీయగా.. గుర్‌నూర్ బ్రార్, మానవ్ సుతార్ చెరో రెండు, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. టీమిండియా ఆటగాళ్లతో నిండిన భారత ‘ఎ’జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 58 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది.
ఆయుశ్ మాత్రే (76 బంతుల్లో 65; 10 ఫోర్లు) అర్ధ శతకంతో టాప్ స్కోరర్‌గా నిలవగా... ఆయుశ్ బదోనీ (47 బంతుల్లో 38; 5 ఫోర్లు), సాయి సుదర్శన్ (94 బంతుల్లో 32; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు.
రిషబ్ పంత్ విఫలం
ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా నాలుగో టెస్టులో గాయపడి ఆటకు దూరమైన వికెట్ కీపర్ రిషబ్ పంత్ చాన్నాళ్ల తర్వాత మైదానంలో అడుగు పెట్టగా... 17 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రజత్ పాటీదార్ (19), దేవదత్ పడిక్కల్ (6), తనుశ్ కొటియాన్ (13), మానవ్ సుతార్ (4) విఫలమయ్యారు.
దక్షిణాఫ్రికా ‘ఎ’బౌలర్లలో ప్రేనెలన్ సుబ్రాయన్ 61 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. సిపామ్లా రెండు వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. ఇక శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా మరో 169 పరుగులు జతచేసి ఆలౌట్ అయింది.
భారత్‌కు 275 పరుగుల లక్ష్యం
ఈసారి ఓపెనర్లలో జోర్డాన్ (12) విఫలం కాగా.. లెసెగో సెనోక్‌వానే (37).. వన్‌డౌన్ బ్యాటర్ జుబేర్ హంజా (37) రాణించారు. లోయర్ ఆర్డర్‌లో మొరేకి 25 పరుగులు చేశాడు. మిగతా వారంతా విఫలం కావడంతో 48.1 ఓవర్లలో 199 పరుగులకు సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని (75+199) భారత్‌కు 275 పరుగుల లక్ష్యం విధించింది.
భారత బౌలర్లలో తనుశ్ కొటియాన్ నాలుగు వికెట్లతో మెరవగా.. అన్షుల్ కాంబోజ్ మూడు, గుర్‌నూర్ బ్రార్ రెండు, మానవ్ సుతార్ ఒక వికెట్ తీశారు.
లక్ష్య ఛేదనలో భారత్‌కు భారీ షాక్
ఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. గత ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం బాదిన ఓపెనర్ ఆయుశ్ మాత్రే 6 పరుగులకే అవుటయ్యాడు. మొరేకి బౌలింగ్‌లో బౌల్డ్ అయి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు.
ఇక వన్‌డౌన్‌లో వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్ (5) మరోసారి విఫలం అయ్యాడు. సిలీ బౌలింగ్‌లో అతడు బౌల్డ్ అయ్యాడు. కాగా టీ విరామ సమయానికి ఓపెనర్ సాయి సుదర్శన్ 8, నాలుగో నంబర్ బ్యాటర్ రజత్ పాటిదార్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీ బ్రేక్ సమయానికి భారత్ స్కోరు: 25-2 (9).
చదవండి: శివం దూబేను కాదని.. హర్షిత్‌ను ప్రమోట్ చేయడానికి కారణం అదే: అభిషేక్ శర్మ


