అభిషేక్ శర్మ- హర్షిత్ రాణా (PC: X)
ఆస్ట్రేలియాతో రెండో టీ20 మ్యాచ్‌లో భారత పేసర్ హర్షిత్ రాణా (Harshit Rana)ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోట్ చేయడంపై విమర్శల వర్షం కురుస్తోంది. పవర్ హిట్టింగ్ ఆల్‌రౌండర్ శివం దూబే (Shivam Dube)ను కాదని.. ఈ బౌలర్‌ను ఏడో స్థానంలో ఎందుకు పంపారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ విషయంపై టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) స్పందించాడు. ఆసీస్ చేతిలో ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. హర్షిత్ రాణాను ముందుగా బ్యాటింగ్‌కు పంపడానికి గల కారణాన్ని వెల్లడించాడు.
ఇక్కడ షాట్లు బాదడం అంత తేలికేమీ కాదు
‘‘మా జట్టులో చాలా మందికి ఆస్ట్రేలియాలో ఇదే తొలి పర్యటన. ఇక్కడి పిచ్‌లపై అదనపు బౌన్స్, పేస్ గురించి మాకు తెలుసు. అయినా.. సరే ఈ మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్లు బౌల్ చేసిన తీరు మమ్మల్ని ఆశ్చర్యపరిచింది.
క్రమశిక్షణగా సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో వాళ్లు బౌలింగ్ చేశారు. ఆరంభం నుంచే బౌలర్లపై ఎదురుదాడికి దిగాలని మేము ప్రణాళికలు రచించుకున్నాం. అయితే, ఊహించని రీతిలో వారు చెలరేగారు.
వరుసగా వికెట్లు పడుతుంటే అక్కడ బ్యాటర్‌గా ఎవరున్నారన్న విషయంతో బౌలర్లకు పనిలేదు. ఇక క్రీజులో ఎవరు ఉన్నా జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే ఆడతారు. మెల్‌బోర్న్ వికెట్ కఠినంగా ఉంది. ఇక్కడ షాట్లు బాదడం అంత తేలికేమీ కాదు.
అందుకే శివంను కాదని హర్షిత్‌ను..
హర్షిత్ బ్యాట్‌తోనూ రాణించగలడని నాకు తెలుసు. నెట్స్‌లో అతడు చాలాసార్లు సిక్స్‌లు బాదాడు. ‘నీ సాధారణ ఆట తీరుతోనే ముందుకు సాగు’ అని నాకు చెప్పాడు. మా లెఫ్ట్- రైట్ కాంబినేషన్ ఈ మ్యాచ్‌లో బాగా వర్కౌట్ అయింది.
ఈ కాంబినేషన్ కోసమే.. శివం దూబే కంటే.. హర్షిత్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా పంపించారు’’ అని అభిషేక్ శర్మ తెలిపాడు. కాగా 24 ఏళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఆసీస్‌తో రెండో మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు.
.@IamAbhiSharma4 leads from the front with a blazing half-century, taking the Aussies head-on in true Skyball fashion! 💥
Fearless intent, clean hitting, and total command at the crease! 🚀#AUSvIND 👉 2nd T20I | LIVE NOW 👉 https://t.co/mq9j8bivd0 pic.twitter.com/bcAUdN2kyw— Star Sports (@StarSportsIndia) October 31, 2025
మొత్తంగా 37 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 68 పరుగులు సాధించాడు. అయితే, నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్‌గా వెనుదిరగడంతో అతడి ధనాధన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక ఈ మ్యాచ్‌లో అభిషేక్‌తో పాటు హర్షిత్ రాణా (33 బంతుల్లో 35) ఒక్కడే మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు.
Short ball? No problem! #HarshitRana clears it for a six! 🚀
Brings up a solid fifty stand fearless, fiery, and full Skyball mode on! 🔥#AUSvIND 👉 2nd T20I | LIVE NOW 👉 https://t.co/mq9j8bivd0 pic.twitter.com/sOGZ6m3u5y— Star Sports (@StarSportsIndia) October 31, 2025
మూకుమ్మడిగా విఫలం
ఓపెనర్ శుబ్‌మన్ గిల్ 5, మూడో స్థానంలో వచ్చిన సంజూ శాంసన్ 2, నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 1 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచారు. ఐదో స్థానానికి డిమోట్ అయిన తిలక్ వర్మ డకౌట్ కాగా.. కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా కూడా పరుగుల ఖాతా తెరవలేదు. శివం దూబే 4 పరుగులకే వెనుదిరిగాడు.
ఫలితంగా 18.4 ఓవర్లలో కేవలం 125 పరుగులు చేసి టీమిండియా ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్ చెరో రెండు వికెట్లు, మార్కస్ స్టొయినిస్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 13.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. రెండో టీ20లో భారత్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. కాగా కాన్‌బెర్రాలో జరగాల్సిన తొలి టీ20 వర్షం వల్ల రద్దైన విషయం తెలిసిందే.
చదవండి: అతడే మా ఓటమిని శాసించాడు.. అభిషేక్ మాత్రం అద్భుతం: భారత కెప్టెన్


