Virat Kohli: సెంచరీ కరువైంది.. ఆ విషయం తెలుసు.. కానీ: ఆసీస్‌ దిగ్గజం

Ind Vs Aus: Ricky Ponting Verdict On Kohli Might Be In Bit Of Drought - Sakshi

Ind Vs Aus Test Series 2023: ‘‘ఈ సిరీస్‌లో బ్యాటర్ల ఫామ్‌ గురించి నేను పెద్దగా మాట్లాడదలచుకోలేదు. ఎందుకంటే వాళ్లకు ఇదో పీడకల లాంటిది’’ అని ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌ అన్నాడు. నాగ్‌పూర్‌, ఢిల్లీ టెస్టుల్లో వికెట్‌ కఠినంగా ఉందని.. పరుగులు రాబట్టేందుకు బ్యాటర్లు కష్టపడ్డారని పేర్కొన్నాడు. తొలి రెండు మ్యాచ్‌లలో ఓడినప్పటికీ ఇండోర్‌ విజయంతో ఆసీస్‌ తిరిగి పుంజుకోవడం హర్షించదగ్గ విషయమన్నాడు.

కాగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా టీమిండియాతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడేందుకు భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు మూడు టెస్టులు జరుగగా.. ఒకే ఒక్క సెంచరీ(రోహిత్‌ శర్మ) నమోదైంది. ఆ తర్వాత ఒక్క బ్యాటర్‌ కూడా కనీసం మూడంకెల స్కోరు అందుకోలేకపోయాడు.

నిరాశపరిచిన కోహ్లి
ముఖ్యంగా ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి సైతం నిరాశపరిచాడు. రెండో టెస్టులో 64 పరుగులతో పర్వాలేనిపించినా.. అనుకున్న స్థాయిలో మాత్రం రాణించలేకోయాడు. తొలి టెస్టులో 12, మూడో టెస్టులో 35 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో.. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో 74 సెంచరీలు పూర్తి చేసుకున్న కోహ్లి.. ఈ సిరీస్‌లో వరుస శతకాలు బాదుతాడని ఆశపడ్డ అభిమానులకు నిరాశే ఎదురైంది.

సెంచరీ కరువైంది.. తనకు ఆ విషయం తెలుసు
ఈ నేపథ్యంలో ఆసీస్‌ బ్యాటింగ్‌ లెజెండ్‌ రిక్కీ పాంటింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ రివ్యూలో తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ‘‘కోహ్లి గురించి ఇప్పటికే ఎన్నోసార్లు మాట్లాడాను. చాంపియన్లు ఎల్లప్పుడూ చాంపియన్లుగానే ఉంటారు. కఠిన పరిస్థితులను దాటుకుని ముందుకు సాగమని వాళ్లకు ఎవరూ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ప్రస్తుతం తను భారీ స్కోర్లు నమోదు చేయలేకపోతున్నాడు. చాన్నాళ్లుగా టెస్టుల్లో సెంచరీ కరువైంది. అయితే, ఓ బ్యాటర్‌ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడన్న విషయం అతడికి తప్పకుండా తెలిసి ఉంటుంది. లోపాలు ఎక్కడున్నాయో.. వాటిని ఎలా సరిదిద్దుకోవాలో కూడా తెలుస్తుంది. కోహ్లి ఫామ్‌ విషయంలో నాకెలాంటి భయాలు లేవు. తను తప్పకుండా తిరిగి పుంజుకుంటాడు’’ అని రిక్కీ పాంటింగ్‌ ధీమా వ్యక్తం చేశాడు.

బ్యాటర్లకు చుక్కలే
జరిగిన మూడు మ్యాచ్‌లలో బంతి బీభత్సంగా టర్న్‌ అయిందని.. పరుగులు రాబట్టలేక బ్యాటర్లు చుక్కలు చూశారని అభిప్రాయపడ్డాడు. కాగా స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్‌లపై తొలి రెండు మ్యాచ్‌లలో టీమిండియా నెగ్గగా.. మూడో మ్యాచ్‌లో ఆసీస్‌ విజయం సాధించింది. ఇక ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక నాలుగో టెస్టు మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌ వేదికగా ఆరంభం కానుంది. 

చదవండి: Virat Kohli: నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు.. కనీసం: స్మృతి మంధాన
WPL 2023: ఎంఎస్‌డీ పేరును బ్యాట్‌పై రాసుకుని హాఫ్‌ సెంచరీ బాదిన యూపీ వారియర్జ్‌ బ్యాటర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top