IND vs AUS 1st T20I: వర్షం వల్ల మ్యాచ్‌ రద్దు | IND vs AUS 1st T20: Toss Update And Playing XIs Nititsh Reddy Ruled Out | Sakshi
Sakshi News home page

IND vs AUS 1st T20I: వర్షం వల్ల మ్యాచ్‌ రద్దు

Oct 29 2025 1:28 PM | Updated on Oct 29 2025 4:46 PM

IND vs AUS 1st T20: Toss Update And Playing XIs Nititsh Reddy Ruled Out

Australia vs India, 1st T20I- Canberra: ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య తొలి టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైపోయింది. కాన్‌బెర్రాలో టాస్‌ గెలిచిన ఆసీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలో ఐదు ఓవర్ల తర్వాత ఆటకు వర్షం అంతరాయం కలిగించగా.. మ్యాచ్‌ను 18 ఓవర్లకు కుదించారు. కాసేపటి తర్వాత తిరిగి మొదలుపెట్టారు.

అయితే, 9.4 ఓవర్ల మధ్య వర్షం మళ్లీ ఆటంకం కలిగించింది. ఆ తర్వాత వాన తగ్గే సూచనలు కనిపించకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. 9.4 ఓవర్లలో టీమిండియా వికెట్‌ నష్టానికి 97 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ 14 బంతుల్లో 19 పరుగులు చేసి నాథన్‌ ఎల్లిస్‌ బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు. మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ (20 బంతుల్లో 37), కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (24 బంతుల్లో 39) అజేయంగా నిలిచారు.

మళ్లీ వర్షం.. ఆగిన ఆట
9.4 ఓవర్ల వద్ద వర్షం మళ్లీ ఆటకు ఆటంకం కలిగింది. స్కోరు: 97-1. సూర్య 24 బంతుల్లో 39, గిల్‌ 20 బంతుల్లో 37 పరుగులతో క్రీజులో ఉన్నారు.

తొమ్మిది ఓవర్లలో టీమిండియా స్కోరు: 82-1.
సూర్య 20 బంతుల్లో 37, సూర్య 20 బంతుల్లో 25 పరుగులతో క్రీజులో ఉన్నారు.

తిరిగి ప్రారంభమైన ఆట.. 
ఆట తిరిగి ప్రారంభమైంది. 6 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ వికెట్‌ నష్టానికి 53 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్‌ గిల్‌(25), సూర్యకుమార్‌ యాదవ్‌(12) ఉన్నారు.

వర్షం వల్ల ఆటకు అంతరాయం
ఐదు ఓవర్ల ఆట ముగిసే సరికి భారత్‌ స్కోరు: 43-1. గిల్‌ 16,  సూర్య 8 పరుగులతో ఉన్నారు. 

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌
3.5: నాథన్‌ ఎల్లిస్‌ బౌలింగ్‌లో తొలి వికెట్‌గా వెనుదిరిగిన అభిషేక్‌ శర్మ. 14 బంతుల్లో 19 పరుగులు చేసి టిమ్‌ డేవిడ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరిన ఓపెనింగ్‌ బ్యాటర్‌. టీమిండియా స్కోరు: 36-1(4). గిల్‌ 16 పరుగులతో ఉండగా.. సూర్యకుమార్‌ ఒక పరుగుతో క్రీజులో ఉన్నాడు.

టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా
కాన్‌బెర్రా వేదికగా టీమిండియాతో తొలి టీ20లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా (IND vs AUS 1st T20I) తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ సందర్భంగా ఆసీస్‌ సారథి మిచెల్‌ మార్ష్‌ (Mitchell Marsh) మాట్లాడుతూ.. ‘‘వికెట్‌ బాగుంది. కాన్‌బెర్రాలో ప్రేక్షకుల మద్దతు కూడా మాకు కలిసి వస్తుంది. టీమిండియా మాదిరే మేము కూడా దూకుడైన క్రికెట్‌ ఆడుతున్నాం.

ఇరుజట్లు పటిష్టంగా ఉన్నాయి. ప్రస్తుతం టీమిండియా వరల్డ్‌ నంబర్‌ వన్‌ జట్టుగా ఉంది. ఇలాంటి జట్టుతో పోటీ అంటే ఆసక్తికరమే. మా జట్టులో అవసరమైన మేర బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లు ఉన్నారు’’ అని పేర్కొన్నాడు.

ఇక టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ‘‘మేము ముందుగా బ్యాటింగ్‌ చేయాలనే భావించాము. వికెట్‌ బాగుంది. మనుకా ఓవల్‌లో ఎక్కువ మ్యాచ్‌లు జరుగలేదని మా అనలిస్టుల ద్వారా విన్నాను. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో వికెట్‌ కాస్త నెమ్మదించవచ్చు.

అది ఎప్పుడూ తలనొప్పిగానే ఉంటుంది
అందుకే ముందుగానే బ్యాటింగ్‌ చేయాలనే అనుకున్నాం. మూడు- నాలుగు రోజుల ముందే ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్‌ చేశాము. నిన్నటి మాదిరే ఈరోజు వాతావరణం చల్లగా ఉంది.

మా జట్టులో ప్రతి ఆటగాడు తన వంతు పాత్ర పోషిస్తాడు. బాధ్యతాయుతంగా ఆడతారు. అందుకే తుదిజట్టు ఎంపిక ఎప్పుడూ తలనొప్పిగా మారుతుంది. అయితే, ఆ విషయంలో మాకు సంతోషంగా ఉంది. ఇంతమంది మంచి ఆటగాళ్లు అందుబాటులో ఉండటం సానుకూలాంశం. మాకు చాలా ఆప్షన్లు ఉన్నాయి.

నితీశ్‌ రెడ్డి అవుట్‌
ఈరోజు రింకూ సింగ్‌, జితేశ్‌ శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, నితీశ్‌ రెడ్డి మిస్సవుతున్నారు’’ అని తెలిపాడు. కాగా గాయం కారణంగా నితీశ్‌ రెడ్డి ఆస్ట్రేలియాతో తొలి మూడు టీ20 మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI)  వెల్లడించింది. గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడుతున్న నితీశ్‌ రెడ్డి బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపింది. 

తుదిజట్లు:
టీమిండియా 
అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా.

ఆస్ట్రేలియా
మిచెల్ మార్ష్(కెప్టెన్‌), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(వికెట్‌ కీపర్‌), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టొయినిస్, జోష్ ఫిలిప్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్.

చదవండి: నేను మాట్లాడితే కథ వేరేలా మారుతుంది.. సెలక్టర్‌ జోక్యంతో షమీ యూటర్న్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement