
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (ICC Women's World Cup 2025) ఇవాళ (అక్టోబర్ 2) పాకిస్తాన్ (Pakistan), బంగ్లాదేశ్ (Bangladesh) తలపడుతున్నాయి. కొలొంబో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసి స్వల్ప స్కోర్‌కే ఆలౌటైంది.
బంగ్లాదేశ్ బౌలర్లు మూకుమ్మడిగా విజృంభించడంతో పాక్ 38.3 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. షోర్నా అక్తర్ 3, మరుఫా అక్తర్, నహిద అక్తర్ చరో 2, నిషిత అక్తర్, ఫహీమా ఖాతూన్, రబేయా ఖాన్ తలో వికెట్ తీసి పాక్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేశారు.
పాక్ ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసిన రమీన్ షమీమ్ టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ ఫాతిమా సనా (22), మునీబా అలీ (17), అలియా రియాజ్ (13), సిద్రా నవాజ్ (15), డయానా బేగ్ (16 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఒమైమా సోహైల్, సిద్రా అమీన్ డకౌట్లయ్యారు.
కాగా, ప్రస్తుత ప్రపంచ కప్ సెప్టెంబర్ 30న ప్రారంభమైంది. ఈ మెగా టోర్నీ భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతుంది. టోర్నీ ఓపెనర్‌లో ఆతిథ్య దేశాలు గౌహతిలో తలపడ్డాయి. ఇందులో భారత్ శ్రీలంకపై 59 పరుగుల తేడతో గెలుపొంది బోణీ కొట్టింది.
నిన్న జరిగిన రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడ్డాయి. ఇండోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో రేపు (అక్టోబర్ 3) ఇంగ్లండ్, సౌతాఫ్రికా తలపడనున్నాయి.
అక్టోబర్ 4న శ్రీలంక, ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది. అక్టోబర్ 5న కొలొంబో వేదికగా భారత్, పాకిస్తాన్ తలపడతాయి. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ముగిసిన పురుషుల ఆసియా కప్‌లో భారత్ ఫైనల్లో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది.
ఈ టోర్నీలో భారత్ పాక్‌పై మూడుసార్లు గెలుపొందింది. ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు హ్యాండ్‌షేక్‌ను నిరాకరించారు. టోర్నీ గెలిచిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న పీసీబీ ఛైర్మన్ చేతుల మీదుగా ట్రోఫీని అందుకునేందుకు నిరాకరించింది.
దీంతో చిర్రెత్తిపోయని ఏసీసీ అధ్యక్షుడు నఖ్వీ ట్రోఫీ సహా భారత ఆటగాళ్లకు ఇవ్వాల్సిన మెడల్స్‌ను ఎత్తుకెళ్లిపోయారు. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.
చదవండి: చెలరేగిన బౌలర్లు.. రాణించిన కేఎల్ రాహుల్.. భారీ స్కోర్ దిశగా టీమిండియా