నవంబర్ 22 నుంచి గౌహతి వేదికగా టీమిండియాతో జరుగబోయే రెండో టెస్ట్‌కు ముందు సౌతాఫ్రికా జట్టుకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే తొలి టెస్ట్ హీరోలు సైమన్ హార్మర్, మార్కో జన్సెన్ గాయాల బారిన పడ్డారని ప్రచారం జరుగుతుండగా.. తాజాగా మరో ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ రెండో టెస్ట్‌కు దూరమయ్యాడని అధికారిక ప్రకటన వెలువడింది.
పక్కటెముకల్లో గాయం కారణంగా తొలి టెస్ట్‌కు దూరంగా ఉన్న రబాడ రెండో టెస్ట్‌కు కూడా అందుబాటులో ఉండడని క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది. అతనికి ప్రత్యామ్నాయంగా లుంగి ఎంగిడిని ఎంపిక చేసినట్లు తెలిపింది. ఎంగిడి చివరిగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడాడు. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసి సౌతాఫ్రికాను టెస్ట్ ఛాంపియన్‌గా నిలబెట్టడంలో తనవంతు పాత్ర పోషించాడు.
మరోవైపు భారత్‌ను కూడా గాయాల సమస్య వేధిస్తుంది. తొలి టెస్ట్ సందర్భంగా మెడ గాయానికి గురైన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండో టెస్ట్ ఆడటం అనుమానంగా ఉంది. గిల్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంపిక చేయాల్సి ఉంది. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే గిల్ గాయపడ్డాడు. వెంటనే అతన్ని వుడ్‌లాండ్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్సనందించారు. ఆతర్వాత ఆతర్వాత రెండో ఇన్నింగ్స్‌లో అతని అవసరం అనివార్యమైనా తిరిగి బరిలోకి దిగలేకపోయాడు.
హార్మర్, జన్సెన్‌కు కూడా గాయాలు..?
తొలి టెస్ట్ అనంతరం సైమన్ హార్మర్ (Simon Harmer), మార్కో జన్సెన్ (Marco Jansen) గాయాలతో బాధపడుతూ గిల్ చికిత్స పొందిన వుడ్‌లాండ్స్ హాస్పిటల్‌లోనే చికిత్స పొందారని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతంది. హార్మర్ భుజం గాయం, జన్సెన్ మరో గాయంతో బాధపడుతున్నారని సమాచారం. అయితే ఈ విషయమై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఒకవేళ హార్మర్, జన్సెన్ గాయాల బారిన పడి ఉంటే, సౌతాఫ్రికాకు ట్రిపుల్ షాక్‌లు (రబాడ) తగిలినట్లవుతుంది.
కాగా, తొలి టెస్ట్‌లో భారత్ సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నాలుగో ఇన్నింగ్స్‌లో 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ భారత్ 93 పరుగులకే ఆలౌటైంది. రెండు ఇన్నింగ్స్‌ల్లో 8 వికెట్లు తీసిన హార్మర్ భారత్‌ను ఓడించడంలో ప్రధానపాత్ర పోషించాడు. జన్సెన్ 2 ఇన్నింగ్స్‌ల్లో 5 వికెట్లు తీసి టీమిండియాను ఓడించడంలో తనవంతు పాత్ర పోషించాడు.
చదవండి: IPL 2026 Auction: 'ఆ ఆటగాడి' కోసం తిరిగి ప్రయత్నించనున్న సీఎస్‌కే


