Under-19 World Cup: గ్రౌండ్‌లోకి రావడానికి నానాతంటాలు.. అంత కష్టమెందుకు

ICC Shares Video Involving Medical Staff At U19 World Cup Goes Viral - Sakshi

ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ మజిలి చివరి దశకు చేరింది. శనివారం భారత్‌, ఇంగ్లండ్‌ జట్లు ఫైనల్లో తలపడనున్నాయి. మరి భారత్‌ ఐదోసారి టైటిల్‌ గెలుస్తుందా.. లేక ఇంగ్లండ్‌ రెండోసారి కప్‌ను అందుకుంటుందా చూడాలి. ఇక ఈ టోర్నీలో ఆఫ్‌ ఫీల్డ్‌.. ఆన్‌ఫీల్డ్‌లో ఎన్నో వింతలు, విశేషాలు చోటుచేసుకున్నాయి. ఫైనల్‌కు ఒక్కరోజు మాత్రమే మిగిలిఉండడంతో ఐసీసీ ఫ్యాన్స్‌ను నవ్వించడానికి ఒక ఆసక్తికర వీడియోనూ రిలీజ్‌ చేసింది. ఈ సంఘటన ఏ మ్యాచ్‌లో జరిగిందో తెలియదు. కచ్చితంగా మనల్ని నవ్విస్తుంది.

విషయంలోకి వెళితే.. మ్యాచ్‌ సందర్భంగా ఆటగాడు గాయపడడంతో మెడికల్‌ అవసరం ఏర్పడింది. దీంతో ఇద్దరితో కూడిన మెడికల్‌ టీం సహాయం చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో ఒక వ్యక్తి బాగా లావుగా ఉన్నాడు.. అతని పక్కన అసిస్టెంట్‌గా ఒక అమ్మాయి ఉంది. కాల్‌ రావడంతో గ్రౌండ్‌లోకి వేగంగా వెళ్లాలనే ఉద్దేశంతో బౌండరీలైన్‌ వద్ద ఉ‍న్న అడ్వర్టైజ్‌మెంట్‌ బోర్డులను దాటే ప్రయత్నం చేశారు. వారికి సాధ్యం కాలేదు. ఏమనుకున్నాడో.. ఒక్కసారిగా అథ్లెట్‌గా మారిన మెడికో దానిపై నుంచి జంప్‌ చేసి వెళ్లాలనుకున్నాడు. కానీ బొక్కబోర్లా పడ్డాడు.. పాపం అతని దెబ్బకు పక్కనున్న అమ్మాయి కూడా బలయ్యింది. ఆ తర్వాత కిందపడిన దానికి కవర్‌ చేసుకుంటూ పరిగెత్తడం నవ్విస్తుంది. ఇది చూసిన కామెంటేటర్లు.. ఈ మెడికో సూపర్‌గా ఉ‍న్నాడు.. హార్డిల్స్‌కు పంపిస్తే కచ్చితంగా మెడల్స్‌ తీసుకొస్తాడు అంటూ కామెంట్‌ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టడం ఇది ఎనిమిదోసారి. నాలుగుసార్లు విజేతగా నిలిచిన భారత్‌.. ఐదో టైటిల్‌పై కన్నేసింది. మరోవైపు ఇంగ్లండ్‌ మాత్రం 1998 తర్వాత మళ్లీ అండర్‌-19 ప్రపంచకప్‌ సాధించలేకపోవడం విశేషం. దీంతో టీమిండియానే మరోసారి ఫెవరెట్‌గా కనిపిస్తోంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top