‘నేనైతే వాట్సన్‌ను తీసే ప్రసక్తే ఉండదు’

I Would Never Drop Shane Watson, Gautam Gambhir - Sakshi

దుబాయ్‌: ఐపీఎల్‌ సీజన్‌లో సీఎస్‌కే ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ దారుణంగా విఫలమవుతున్నాడు. సరైన శుభారంభాన్ని అందివ్వడంలో ఫెయిల్‌ అవుతున్న వాట్సన్‌ను ఇంకా కొనసాగించడం ఎందుకు అనే చర్చ నడుస్తోంది. టీమిండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ అయితే వాట్సన్‌ను తప్పిస్తేనే సీఎస్‌కే గాడిలో పడుతుందని విమర్శించాడు. కాగా, మరో టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ మాత్రం విభేదించాడు. ఏంటి వాట్సన్‌ను తీయడం అంటే సీఎస్‌కే సాహసం చేసినట్లేనని ఎద్దేవా చేశాడు. ఓవరాల్‌ సీఎస్‌కే బ్యాటింగ్‌ తుప్పుబట్టినట్లు ఉన్నప్పుడు వాట్సన్‌ను తప్పించడం ఎందుకు అని ప్రశ్నించాడు. (చదవండి:ఐపీఎల్‌ చరిత్రలో ‘గ్రేటెస్ట్‌ వార్నర్‌’)

తానైతే వాట్సన్‌ను తప్పించే ప్రసక్తే ఉండదు. ప్రస్తుత పరిస్థితుల్లో వాట్సన్‌ను కొనసాగిస్తేనే మంచిదన్నాడు. అసలు సీఎస్‌కే బ్యాటింగ్‌లో పసలేనప్పుడు వాట్సన్‌కు ఉద్వాసన పలికే సాహసం మంచిది కాదన్నాడు. ఒకవేళ వాట్సన్‌ను తీసేస్తే అతని ప్లేస్‌లో ఎవరిని రిప్లేస్‌ చేస్తారని నిలదీశాడు. వాట్సన్‌ తప్పిస్తే మురళీ విజయ్‌, రుతురాజ్‌ గ్వైక్వాడ్‌లలో ఎవరో ఒకర్ని తీసుకోవాలని, వారిలో ఎవరూ ఫామ్‌లో లేకపోవడంతో వాట్సన్‌ను తీసేసి నిర్ణయం అనేది మంచిది కాదన్నాడు.

మరో నాలుగు, ఐదు మ్యాచ్‌ల వరకూ వాట్సన్‌ను కొనసాగించడమే సమంజసమన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాడని, కానీ ఒక బ్యాట్స్‌మన్‌ విజయాలు అందించాలంటే జట్టులో సాధ్యమైనన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వాల్సిందేనన్నాడు. ప్రస్తుతం వాట్సన్‌ ఫామ్‌లో లేకపోవచ్చు.. కానీ ఒకసారి గాడిలో పడితే మాత్రం అతనొక చాంపియన్‌ ప్లేయర్‌ అని అన్నాడు. వాట్సన్‌ ఫామ్‌లోకి ఎప్పుడు వస్తాడో తెలియన్నప్పుడు, అతనికంటే మంచి ప్రత్యామ్నాయం సీఎస్‌కేకు లేనప్పుడు మార్పులు అనవసరమని గంభీర్‌ విశ్లేషించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top