పాక్‌ను ఓడించగానే రాత్రంతా సంబరాలు: రషీద్‌ ఖాన్‌ | I Did Not Stop Until Late In Night: Rashid Khan On Celebrations 2023 WC Win On Pak | Sakshi
Sakshi News home page

పాక్‌ను ఓడించగానే రాత్రంతా సంబరాలు.. నేనైతే: రషీద్‌ ఖాన్‌

Published Wed, May 8 2024 4:30 PM | Last Updated on Wed, May 8 2024 5:06 PM

రషీద్‌ ఖాన్‌ (PC: X)

వన్డే ప్రపంచకప్‌-2023 ఆరంభంలో ఓటములు చవిచూసిన అఫ్గనిస్తాన్‌ ఇంగ్లండ్‌ను ఓడించి సంచలన గెలుపుతో విజయాల బాట పట్టింది. ఆ తర్వాత పాకిస్తాన్‌ను మట్టికరిపించిన హష్మతుల్లా బృందం.. శ్రీలంక, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లలో కూడా గెలుపు బావుటా ఎగురవేసింది.

ఈ క్రమంలో చాంపియన్స్‌ ట్రోఫీ-2025కి కూడా అర్హత సాధించింది. భారత్‌ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అఫ్గన్‌ ఊహించని స్థాయిలో ప్రత్యర్థులకు షాకిచ్చి సత్తా చాటింది.

అదే హైలైట్‌
ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోనూ ఆఖరి వరకు అద్భుతంగా పోరాడి ఓడినా అభిమానుల హృదయాలు గెలిచింది. సంతృప్తిగానే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే, అన్నింటికంటే పాకిస్తాన్‌పై గెలుపు మాత్రం అఫ్గన్‌కు ప్రత్యేకంగా నిలిచిపోయింది.

ఎందుకంటే.. అంతర్జాతీయ వన్డేల్లో అది కూడా.. వరల్డ్‌కప్‌ లాంటి ప్రధాన ఈవెంట్లో తొలిసారి పాక్‌పై అఫ్గనిస్తాన్‌ పైచేయి సాధించింది. స్టార్‌ బ్యాటర్లు రహ్మనుల్లా  గుర్బాజ్‌(65), ఇబ్రహీం జద్రాన్‌(87), రెహమత్‌ షా(77) ఇన్నింగ్స్‌ కారణంగా తొలిసారి పాక్‌ను ఓడించింది. దీంతో అఫ్గన్‌ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి.

రాత్రి మొత్తం డాన్స్‌ చేస్తూ
తాజాగా ఈ విషయం గురించి గుర్తుచేసుకున్నాడు అఫ్గనిస్తాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌. ‘‘పాకిస్తాన్‌ మీద గెలిచిన తర్వాత ఆ రోజు రాత్రి మొత్తం నేను డాన్స్‌ చేస్తూ సెలబ్రేట్‌ చేసుకుంటూనే ఉన్నాను.

గ్రౌండ్‌ నుంచి హోటల్‌ దాకా సంబరాలు చేసుకున్నా. అర్ధరాత్రి దాటిన తర్వాత నేను విశ్రాంతి తీసుకోలేదు. అప్పుడు నన్నెవరైనా చూసి ఉంటే.. అసలు నాకు వెన్నునొప్పి ఉందంటే నమ్మేవారే కాదు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా
అప్పటికీ జాగ్రత్తగా ఉండాలని మా ఫిజియో చెప్తూనే ఉన్నారు. ఏదేమైనా నేను అలా పిచ్చిపట్టినట్లుగా డాన్స్‌ చేస్తూ సెలబ్రేట్‌ చేసుకుంటూ ఉంటే మా జట్టు మొత్తం ఆశ్చర్యపోయింది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ వాళ్లు నన్ను అలా చూడనేలేదు’’ అని ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో రషీద్‌ ఖాన్‌ చెప్పుకొచ్చాడు.

కాగా ఆ మ్యాచ్‌లో పది ఓవర్లు బౌల్‌ చేసిన రషీద్‌ వికెట్‌ తీయకపోయినా పొదుపుగా(ఎకానమీ 4.10) బౌలింగ్‌ చేశాడు. నాటి మ్యాచ్‌లో నూర్‌ అహ్మద్‌ మూడు వికెట్లతో చెలరేగి పాక్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను దెబ్బకొట్టాడు. 

ఐపీఎల్‌తో బిజీ
ఇదిలా ఉంటే.. రషీద్‌ ఖాన్‌ ప్రస్తుతం ఐపీఎల్‌-2024తో బిజీగా ఉన్నాడు. గుజరాత్‌ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు ఇప్పటి వరకు 102 పరుగులు చేయడంతో పాటు 8 వికెట్లు తీశాడు.

చదవండి: T20 WC: ద్రవిడ్‌, రోహిత్‌కు నచ్చకపోవచ్చు.. కానీ నా సలహా ఇదే!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement