మరోసారి దుమ్మురేపిన వార్నర్‌.. కేన్‌ మామ మాత్రం​ మారలేదు..! | The Hundred League 2025, Manchester Original Beat London Spirit By 10 Runs, Check Out Score Details Inside | Sakshi
Sakshi News home page

మరోసారి దుమ్మురేపిన వార్నర్‌.. కేన్‌ మామ మాత్రం​ మారలేదు..!

Aug 12 2025 7:59 AM | Updated on Aug 12 2025 10:14 AM

The Hundred League 2025: Manchester Original Beat London Spirit By 10 Runs

హండ్రెడ్‌ లీగ్‌ 2025లో చిరకాల మిత్రులు కేన్‌ విలియమ్సన్‌ (న్యూజిలాండ్‌), డేవిడ్‌ వార్నర్‌ (ఆస్ట్రేలియా) ఒకే జట్టుకు ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ లీగ్‌లో వీరిద్దరు లండన్‌ స్పిరిట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ జట్టుకు విలియమ్సన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. వార్నర్‌ సాధారణ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ ఇద్దరు లండన్‌ జట్టుకు ఓపెనర్లుగా కూడా ఉన్నారు.

ఇంత వరకు అంతా బాగానే ఉంది. అయితే ఈ సీజన్‌లో వార్నర్‌ అంచనాలకు మించి సత్తా చాటుతుండగా.. కేన్‌ మామ మాత్రం వరుసగా విఫలమవుతున్నాడు. గత మ్యాచ్‌లో వెల్ష్‌ ఫైర్‌పై 45 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 70 పరుగులు చేసిన వార్నర్‌.. నిన్న (ఆగస్ట్‌ 11) మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 51 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 71 పరుగులు చేశాడు.

విలియమ్సన్‌ విషయానికొస్తే.. తొలి మ్యాచ్‌లో 9, రెండో మ్యాచ్‌లో 14, తాజాగా మూడో మ్యాచ్‌లో 19 పరుగులు చేసి హ్యాట్రిక్‌ వైఫల్యాలు ఖాతాలో వేసుకున్నాడు. వాస్తవానికి విలియమ్సన్‌ ఈ లీగ్‌ ప్రారంభానికి ముందు మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌లోనే మల్టీ డే ఫార్మాట్‌లో వరుసగా సెంచరీలు బాదాడు. టీ20లకు వచ్చే సరికి విలియమ్సన్‌ పాత బాటనే పట్టాడు.

ఈ ఫార్మాట్‌లో అతను కెరీర్‌ ప్రారంభం నుంచి పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. అతను నిదానంగా ఇన్నింగ్స్‌ను నిర్మించడం పొట్టి ఫార్మాట్‌ తీరుకు సరిపొదు. ఓ దశలో ఐపీఎల్‌లో ఫాస్ట్‌గా ఆడటం అలవాటు చేసుకున్నా.. కొద్ది రోజుల్లోనే మొదటికొచ్చాడు. స్లో బ్యాటింగ్‌ తీరు కారణంగా ఐపీఎల్‌ సహా చాలా లీగ్‌ను విలియమ్సన్‌ను పరిగణలోకి తీసుకోవడం లేదు. హండ్రెడ్‌ లీగ్‌ ద్వారా తనను తాను నిరూపించుకునే​ అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు.

మరోపక్క వార్నర్‌ మాత్రం అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై పలికినా పూర్వ వైభవం అందుకున్నాడు. విలియమ్సన్‌తో పోలిస్తే పెద్దవాడైనా వార్నర్‌ ఇంకా టీ20ల్లో సత్తా చాటుతూనే ఉన్నాడు. హండ్రెడ్‌ లీగ్‌లో విలియమ్సన్‌ వైఫల్యాలు ఇలాగే కొనసాగితే అతని టీ20 కెరీర్‌కు పుల్‌ స్టాప్‌ పడటం ఖాయం.

మ్యాచ్‌ విషయానికొస్తే.. నిన్న మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేన్‌, వార్నర్‌లు ప్రాతినిథ్యం వహిస్తున్న లండన్‌ స్పిరిట్‌ 10 పరుగుల తేడా పరాజయం పాలైంది. వార్నర్‌ హాఫ్‌ సెంచరీతో సత్తా చాటినా వారి జట్టుకు ఓటమి తప్పలేదు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఒరిజినల్స్‌ నిర్ణీత 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌ (46), ఫిల్‌ సాల్ట్‌ (31), మెక్‌కిన్నీ (29), హెన్రిచ్‌ క్లాసెన్‌ (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

అనంతరం 164 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన లండన్‌ జట్టుకు వార్నర్‌ శుభారంభం అందించినా మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించకపోవడంతో ఓటమి తప్పలేదు. ఆ జట్టు నిర్ణీత 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. లండన్‌ స్పిరిట్‌ను సన్నీ బేకర్ (20-10-21-1), జోష్‌ టంగ్‌ (20-9-29-3) దెబ్బకొట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement