వైభవ్‌ వయసు పిల్లలంతా హ్యాపీ!.. ఎందుకింత ఓర్వలేనితనం? | He Will Learn: Rohit Sharma Consoles Suryavanshi Memes Break Internet | Sakshi
Sakshi News home page

పిల్లలంతా హ్యాపీ అంటూ ట్రోలింగ్‌!.. వైభవ్‌ను ఓదార్చిన రోహిత్‌.. ఆటలో ఇవి మూమూలే

Published Fri, May 2 2025 12:47 PM | Last Updated on Fri, May 2 2025 1:48 PM

He Will Learn: Rohit Sharma Consoles Suryavanshi Memes Break Internet

వైభవ్‌ను ఓదార్చిన రోహిత్‌ (Photo Courtesy: BCCI/JioHotstar)

రాజస్తాన్‌ రాయల్స్‌ చిచ్చర పిడుగు వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)కి చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్‌ టైటాన్స్‌తో గత మ్యాచ్‌లో శతక్కొట్టిన పద్నాలుగేళ్ల ఈ పిల్లాడు.. గురువారం ముంబై ఇండియన్స్‌ (RR vs MI)తో మ్యాచ్‌లో డకౌట్‌ అయ్యాడు.

రెండు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. ముంబై పేసర్‌ దీపక్‌ చహర్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి విల్‌ జాక్స్‌కు క్యాచ్‌ ఇచ్చిన వైభవ్‌ పెవిలియన్‌ చేరకతప్పలేదు. ఫలితంగా 218 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు ఇలా ఆరంభంలోనే షాక్‌ తగిలింది.

ముంబై బౌలర్ల ధాటికి మిగతా బ్యాటర్లు కూడా చేతులెత్తేయడంతో రాజస్తాన్‌ 16.1 ఓవర్లలో కేవలం 117 పరుగులకే ఆలౌట్‌ అయింది. తద్వారా ఏకంగా 100 పరుగుల భారీ తేడాతో ముంబై చేతిలో చిత్తుగా ఓడి.. ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది.

వైభవ్‌ వయసు పిల్లలంతా హ్యాపీ!.. ఎందుకింత ఓర్వలేనితనం?
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ బ్యాటర్లంతా విఫలమైనా సోషల్‌ మీడియా మాత్రం వైభవ్‌ సూర్యవంశీపైనే ఎక్కువగా దృష్టి సారించింది. ఆటలో ఇవన్నీ సహజమేనని కొంత మంది అతడికి అండగా నిలుస్తుంటే.. మరికొంత మంది మాత్రం విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు.

‘‘చిన్న వయసులో విజయవంతం కావడం బాగానే ఉంటుంది. కానీ ప్రతిసారీ అదృష్టం కలిసి రాదు.. ఈరోజు వైభవ్‌ వయసు పిల్లలంతా సంతోషపడి ఉంటారు.. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు అతడిని చూపించి వారి పిల్లలకు గట్టిగా క్లాసులు ఇస్తున్నారు.. 

అందుకే ఈ ఒక్కరోజు వారికి ఉపశమనం కలిగి ఉంటుంది.. ఇక చాలు వైభవ్‌ నువ్వు కూడా వెళ్లి హోం వర్క్‌ చేసుకో’’ అంటూ పద్నాలుగేళ్ల వయసులోనే సంచలనాలు సృష్టించిన అతడిని ఓర్వలేక విద్వేషం చిమ్ముతున్నారు.

వైభవ్‌ను ఓదార్చిన రోహిత్‌
మరోవైపు.. వైభవ్‌ అవుట్‌ కాగానే ముంబై ఇండియన్స్‌ స్టార్‌, టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) అతడిని ఓదార్చిన తీరు మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. వైభవ్‌ వెన్నుతట్టి మరేం పర్లేదు అన్నట్లుగా రోహిత్‌ అతడి పట్ల సానుభూతి కనబరిచాడు.

తప్పక పాఠాలు నేర్చుకుంటాడు
ఈ విషయం గురించి కామెంటేటర్‌ రవిశాస్త్రి లైవ్‌లో మాట్లాడుతూ.. ‘‘వైభవ్‌ కచ్చితంగా తన పొరపాట్లను సరిచేసుకుంటాడు. రోహిత్‌ శర్మ అతడిలో ఆత్మవిశ్వాసం నింపేలా మంచి మాటలు చెప్పాడు.

ముంబై జట్టులోని చాలా మంది ఆటగాళ్లు అతడికి అండగా నిలిచారు. ప్రతి మ్యాచ్‌లోనూ ఇలాంటి గొప్ప సన్నివేశాలు చూడలేము. 14 ఏళ్ల పిల్లాడు సెంచరీ చేసిన మరుసటి మ్యాచ్‌లోనే ఇలా డకౌట్‌ అయ్యాడు. క్రికెట్‌ అంటే అంతే మరి!.. అతడు తప్పక ఈ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుంటాడు’’ అని వైభవ్‌ సూర్యవంశీకి మద్దతు ప్రకటించాడు.

కాగా ఐపీఎల్‌-2025 ద్వారా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అరంగేట్రం చేసిన వైభవ్‌ సూర్యవంశీ.. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తద్వారా ఐపీఎల్‌ చరిత్రలో అతి పిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాకుండా మరెన్నో రికార్డులు సొంతం చేసుకుని.. క్రికెట్‌ ప్రపంచం దృష్టిని తన వైపునకు తిప్పుకొన్నాడు.

ఐపీఎల్‌-2025: రాజస్తాన్‌ వర్సెస్‌ ముంబై
వేదిక: సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియం, జైపూర్‌
టాస్‌: రాజస్తాన్‌.. తొలుత బౌలింగ్‌
ముంబై స్కోరు:  217/2 (20)
రాజస్తాన్‌ స్కోరు: 117 (16.1)
ఫలితం: వంద పరుగుల తేడాతో రాజస్తాన్‌పై ముంబై గెలుపు.

చదవండి: RR VS MI: కంటిపై 7 కుట్లు పడినా అదిరిపోయే ప్రదర్శన చేసిన హార్దిక్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement