RR VS MI: కంటిపై 7 కుట్లు పడినా అదిరిపోయే ప్రదర్శన చేసిన హార్దిక్‌ | IPL 2025, RR VS MI: Hardik Pandya Played The Match With 7 Stitches Above Left Eye | Sakshi
Sakshi News home page

RR VS MI: కంటిపై 7 కుట్లు పడినా అదిరిపోయే ప్రదర్శన చేసిన హార్దిక్‌

May 2 2025 9:24 AM | Updated on May 2 2025 10:27 AM

IPL 2025, RR VS MI: Hardik Pandya Played The Match With 7 Stitches Above Left Eye

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌ 2025లో భాగంగా నిన్న (మే 1) రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా డబుల్‌ హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌లో ముంబై అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి ఏకపక్ష విజయం సాధించింది.

ఈ గెలుపులో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాట్‌తో చెలరేగి (23 బంతుల్లో 48 నాటౌట్‌; 6 ఫోర్లు, సిక్స్‌), ఆతర్వాత బంతితోనూ రాణించాడు (1-0-2-1). వాస్తవానికి ఈ మ్యాచ్‌కు హార్దిక్‌ అందుబాటులో ఉండాల్సింది కాదు. అతడికి ప్రాక్టీస్‌ సందర్భంగా తీవ్రమైన రక్తస్రావంతో కూడిన గాయమైంది. అతడి ఎడమ కంటి పైభాగంలో ఏడు కుట్లు పడ్డాయి. అయినా హార్దిక్‌ ఈ మ్యాచ్‌ బరిలోకి దిగి సత్తా చాటాడు.

ఈ సీజన్‌లో హార్దిక్‌ మొదటి నుంచి చాలా కమిట్‌మెంట్‌తో ఉన్నాడు. ఎలాగైనా ముంబై ఇండియన్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాలని కసితో రగిలిపోతున్నాడు. గత సీజన్‌లో ఎదురైన పరాభవానికి ఈ సీజన్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. అనుకున్నట్లుగానే వరుస పరాజయాల బాట పట్టిన జట్టును డబుల్‌ హ్యాట్రిక్‌ విజయాలతో టేబుల్‌ టాపర్‌గా నిలబెట్టాడు. వ్యక్తిగతంగానూ హార్దిక్‌ రాణించాడు. 9 మ్యాచ్‌ల్లో 172.5 స్ట్రయిక్‌ రేట్‌తో 157 పరుగులు చేసి, 13 వికెట్లు తీశాడు.

రోహిత్‌ శర్మ నుంచి ముంబై ఇండియన్స్‌ పగ్గాలు చేపట్టిన హార్దిక్‌ గత సీజన్‌లో కెప్టెన్‌గా, ఆటగాడిగా దారుణంగా విఫలమయ్యాడు. గత సీజన్‌లో ముంబై 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.

ఈ సీజన్‌ తొలి 5 మ్యాచ్‌ల్లోనూ ముంబై అదే  పేలవ ప్రదర్శన కొనసాగించింది. కేవలం​ ఒక్క విజయం మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉండింది. అయితే సీజన్‌ గడిచే కొద్ది ముంబై ఇండియన్స్‌ ఆటతీరులో అనూహ్య మార్పు వచ్చింది. స్టార్‌ ఆటగాళ్లంతా టచ్‌లోకి రావడంతో ఒక్కసారిగా గెలుపు బాట పట్టింది. మూడు వారాలు తిరక్కుండానే తొమ్మిదో స్థానం నుంచి అగ్రస్థానానికి దూసుకొచ్చింది.

వాస్తవానికి ముంబై ఇండియన్స్‌ను ఇలా పడి లేవడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సీజన్లలో ఇలాగే ఆరంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొని, ఆతర్వాత ఏకంగా టైటిల్‌నే ఎగరేసుకుపోయింది. ముంబై ఇండియన్స్‌ చరిత్రలో ఇలా వరుసగా 6 మ్యాచ్‌లు గెలవడం ఇది మూడో సారి. లీగ్‌ ఆరంభ సీజన్‌లో ఈ జట్టు తొలిసారి వరుసగా ఆరు విజయాలు సాధించింది. అయితే ఆ సీజన్‌లో లీగ్‌ దశలోనే నిష్క్రమించింది.  తిరిగి 2017 సీజన్‌లో వరుసగా ఆరు విజయాలు సాధించింది. అయితే ఈ సారి ఛాంపియన్‌గా అవతరించింది.

2017 సీజన్‌ తరహాలోనే ఆరు వరస విజయాల సెంటిమెంట్‌ ఈ సీజన్‌లోనూ కలిసొస్తుందని ముంబై ఇండియన్స్‌ భావిస్తుంది. ఈసారి కూడా తాము టైటిల్‌ ఎగరేసుకుపోతామని ఆ జట్టు అభిమానులు ధీమాగా ఉన్నారు. ఈ సీజన్‌లో టైటిల్‌ గెలిస్తే ముంబై చరిత్ర సృష్టించినట్లవుతుంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఏ జట్టు ఆరు టైటిళ్లు సాధించలేదు. ముంబై, సీఎస్‌కే సంయుక్తంగా ఐదు టైటిళ్లు సాధించాయి.

ఈ సీజన్‌లో ముంబై తదుపరి టార్గెట్‌ అన్ని మ్యాచ్‌లు పూర్తయ్యే సరికి టేబుల్‌ టాపర్‌గా నిలవడం​. ఈ సీజన్‌లో ముంబై ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 6న గుజరాత్‌, మే 11న పంజాబ్‌, మే 15న ఢిల్లీతో తలపడాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement