Lewis Hamilton: హామిల్టన్‌ ‘సెంచరీ’

Hamilton beats Verstappen for 100th pole position - Sakshi

కెరీర్‌లో 100 పోల్‌ పొజిషన్స్‌ సాధించిన మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌

ఈ ఘనత సాధించిన తొలి ఎఫ్‌1 డ్రైవర్‌గా రికార్డు

నేడు స్పెయిన్‌ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసు

సాయంత్రం గం. 6:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌ సెలెక్ట్‌–2లో ప్రత్యక్ష ప్రసారం

బార్సిలోనా (స్పెయిన్‌): ఫార్ములావన్‌ (ఎఫ్‌1) క్రీడలో మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ మరో రికార్డు నెలకొల్పాడు. శనివారం జరిగిన స్పెయిన్‌ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌ సెషన్‌లో ‘పోల్‌ పొజిషన్‌’ సాధించడంద్వారా ఎఫ్‌1 క్రీడా చరిత్రలో 100 పోల్‌ పొజిషన్స్‌ సాధించిన తొలి డ్రైవర్‌గా హామిల్టన్‌ రికార్డు పుటల్లోకి ఎక్కాడు. చివరి క్వాలిఫయింగ్‌ సెషన్‌లో ల్యాప్‌ను అందరికంటే వేగంగా ఒక నిమిషం 16.741 సెకన్లలో ముగించిన హామిల్టన్‌ కెరీర్‌లో 100వ పోల్‌ పొజిషన్‌ను సొంతం చేసుకున్నాడు. తద్వారా ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్‌ తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఎఫ్‌1 దిగ్గజం మైకేల్‌ షుమాకర్‌ పేరిట ఉన్న అత్యధిక పోల్‌ పొజిషన్స్‌ (68) రికార్డును 2017లోనే బద్దలు కొట్టిన హామిల్టన్‌ నాలుగేళ్ల తర్వాత ‘సెంచరీ’ మైలురాయిని చేరుకున్నాడు.  

► 2007లో మాంట్రియల్‌లో జరిగిన కెనడా గ్రాండ్‌ప్రిలో మెక్‌లారెన్‌ జట్టు తరఫున బరిలోకి దిగిన హామిల్టన్‌ కెరీర్‌లో తొలిసారి ‘పోల్‌ పొజిషన్‌’ సాధించాడు.  

► 2012 వరకు మెక్‌లారెన్‌ జట్టుతోనే కొనసాగిన హామిల్టన్‌ ఆ జట్టు తరఫున 26 పోల్‌ పొజిషన్స్‌ సాధించాడు.
 
► 2013 సీజన్‌ నుంచి మెర్సిడెస్‌ జట్టు తరఫున బరిలోకి దిగిన హామిల్టన్‌ ఇప్పటి వరకు అదే జట్టుతో కొనసాగుతున్నాడు. మెర్సిడెస్‌ తరఫున హామిల్టన్‌ 74 పోల్‌ పొజిషన్స్‌ను కైవసం చేసుకున్నాడు. తన 14 ఏళ్ల ఎఫ్‌1 కెరీర్‌లో హామిల్టన్‌ అత్యధికంగా ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచి మైకేల్‌ షుమాకర్‌ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. ఈ క్రీడలో అత్యధిక విజయాలు (97) సాధించిన డ్రైవర్‌గానూ గుర్తింపు పొందాడు.  

► స్పెయిన్‌ గ్రాండ్‌ప్రిలో భాగంగా జరిగిన క్వాలిఫయింగ్‌ సెషన్‌లో మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ రెండో స్థానంలో నిలువగా... హామిల్టన్‌ సహచరుడు వాల్తెరి బొటాస్‌ మూడో స్థానాన్ని పొందాడు.  

గ్రిడ్‌ పొజిషన్స్‌: 1. హామిల్టన్‌ (మెర్సిడెస్‌); 2. వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌); 3. బొటాస్‌ (మెర్సిడెస్‌); 4. లెక్‌లెర్క్‌ (ఫెరారీ); 5. ఎస్తెబన్‌ ఒకాన్‌ (అలైన్‌); 6. కార్లోస్‌ సెయింజ్‌ (ఫెరారీ); 7. రికియార్డో (మెక్‌లారెన్‌); 8. సెర్గియోపెరెజ్‌ (రెడ్‌బుల్‌); 9. లాండో నోరిస్‌ (మెక్‌లారెన్‌); 10. ఫెర్నాండో అలోన్సో (అలైన్‌); 11. లాన్స్‌ స్ట్రోల్‌ (ఆస్టన్‌ మార్టిన్‌); 12. పియరీ గాస్లీ (అల్ఫాటౌరి); 13. సెబాస్టియన్‌ వెటెల్‌ (ఆస్టన్‌ మార్టిన్‌); 14. జియోవినాజి (అల్ఫా రోమియో); 15. జార్జి రసెల్‌ (విలియమ్స్‌); 16. యుకీ సునోడా (అల్ఫా టౌరి); 17. కిమీ రైకోనెన్‌ (అల్ఫా రోమియో); 18. మిక్‌ షుమాకర్‌ (హాస్‌); 19. నికోలస్‌ లతీఫి (విలియమ్స్‌); 20. నికిటా మేజ్‌పిన్‌ (హాస్‌).

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top