10.09 సెకన్లలో 100 మీ.పరుగు పూర్తి
రాంచీ: గురీందర్‌వీర్ సింగ్ భారత ఫాస్టెస్ట్ స్ప్రింటర్‌గా గుర్తింపు పొందాడు. జాతీయ సీనియర్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ టోరీ్నలో అతను కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. 100 మీటర్ల పరుగును 10.09 సెకన్లలో గురీందర్‌వీర్ పూర్తి చేసి అగ్ర స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. తద్వారా 100 మీటర్ల రేస్‌ను 10.10 సెకన్లకంటే తక్కువ టైమింగ్‌తో పూర్తి చేసిన తొలి భారత అథ్లెట్‌గా అతను నిలిచాడు.
ఆసియాలో ఫుకుటో కొమురో (జపాన్ – 10.08 సె.) తర్వాత ఇది రెండో అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. అనిమేశ్ కుజుర్ (10.20 సె.)కు రెండో స్థానం దక్కగా, ప్రణవ్ ప్రమోద్ (10.29 సె.)కు మూడో స్థానం దక్కింది. గత ఏడాది 10.18 సెకన్లలో పరుగు పూర్తి చేసి అనిమేశ్ జాతీయ రికార్డును నెలకొల్పగా... ఇదే ఈవెంట్‌లో తొలి సెమీఫైనల్లో గురీందర్ 10.17తో దానిని అధిగమించాడు. అయితే రెండో సెమీఫైనల్లో 10.15 సెకన్లలో అనిమేశ్ మళ్లీ తన పేరిటే రికార్డు లిఖించుకోగా... ఫైనల్లో దానిని గురీందర్ తిరగరాసి సత్తా చాటాడు.
కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడల సెలక్షన్స్ కోసం నిర్వహిస్తున్న ఈ పోటీల్లో 10.16 సెకన్లను క్వాలిఫయింగ్ మార్క్‌గా నిర్ధారింంచారు. తాజా ఫలితం గురీందర్ పోటీలకు అర్హత సాధించాడు. శనివారం మరో రెండు ఈవెంట్లలో కూడా కొత్త జాతీయ రికార్డులు నమోదయ్యాయి. 400 మీటర్ల పరుగులో టీకే విశాల్ 44.98 సెకన్లతో కొత్త రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు తన పేరిటే ఉన్న 45.12 సెకన్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఈ విభాగంలో రాజేశ్ రమేశ్ (45.31 సె.), జై కుమార్ (45.47 సె.) తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు. పురుషుల డెకాథ్లాన్‌లో తేజస్విన్ శంకర్ 8057 పాయింట్లు సాధించి కొత్త రికార్డు నమోదు చేశాడు. పది వేర్వేరు ఈవెంట్లలో కలిపి మొత్తం 8000కు పైగా పాయింట్లు నమోదు చేసిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచాడు.


