అదే ఆహారం ఏర్పాటు చేయాలంటూ ఢిల్లీ కోర్టులో అమెరికన్ ఖైదీ పిటిషన్
న్యూఢిల్లీ: జైలు గదిలోకి వెళ్లాక చిప్పకూడు తప్పదు అని పెద్దలంటారు. కానీ అగ్రరాజ్యంలో పుట్టి పలు దేశాల్లో సాయుధ ముఠాలకు శిక్షణనిచ్చిన సైనిక నిపుణుడు, భారత్‌లో అక్రమంగా చొరబడి సాయుధ ముఠాలకు డ్రోన్లను ఆపరేట్ చేయడంలో శిక్షణ ఇచ్చేందుకు తెగించిన మాథ్యూ ఆరోన్ వ్యాన్ డైక్ మాత్రం తనకు అమెరికా డైట్ మాత్రమే కావాలని మొండిపట్టుపట్టాడు.
నిరాహార దీక్ష చేస్తూ గత 50 రోజులుగా కేవలం సోయామిల్క్ మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నాడని అతని తరఫు లాయర్లు ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. దీంతో ఈ విషయంలో మీ స్పందన తెలపాలని గతంలో ఇతడిని అరెస్ట్ చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)ను ఢిల్లీ కోర్టు ప్రత్యేక జడ్జి ప్రశాంత్ శర్మ గతవారం ఆదేశించారు. అయితే ఈ విషయమై మాథ్యూ లాయర్లు బుధవారం మాట్లాడారు.
ఎన్‌ఐఏకు బదులుగా తిహార్ జైలు అధికారులు ఈ విషయంలో స్పందన తెలపబోతున్నారని వెల్ల డించారు. ‘‘మాథ్యూ అమెరికా తరహా ఆహారం మాత్రమే తింటాడు. భారతీయ కారాగారాల్లో విచారణ ఖైదీలు, దోషులకు అందించే ఆహారం మహా ఘాటుగా, కారంగా ఉంటుంది. అది ఈయన తినలేడు. మసాలా దట్టించి నూనెలో ముంచి తీసిన, నూనెలో బాగా వేయించిన భారతీయ వంటకాలు మాథ్యూకు పడవు. అందుకే అమెరికన్ స్టైల్‌లో ఆహారం అందించాలని న్యాయస్థానాన్ని కోరాం. అతనికి రోజూ సోయామిల్క్‌ను అందుబాటులో ఉంచాలని జడ్జిని అభ్యర్థించాం’’ అని వాళ్లు వెల్లడించారు. ఈ కేసు విచారణను జడ్జి జూలై 21వ తేదీకి వాయిదావేశారు.


