సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించలేదని తెలుస్తోంది. అంతేకాదు అతడు జట్టును వీడి తిరిగి ముంబైకి పయనమైనట్లు సమాచారం. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్లో భాగంగా టీమిండియాతో రెండు టెస్టులు (IND vs SA) ఆడేందుకు సౌతాఫ్రికా ఇక్కడకు వచ్చింది.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినా..
కోల్‌కతా వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరుగగా సౌతాఫ్రికా టీమిండియాపై ముప్పై పరుగుల తేడాతో గెలిచింది. కోల్‌కతాలో జరిగిన ఈ మ్యాచ్ రెండో రోజు ఆట సందర్భంగా గిల్ మెడ నొప్పితో మైదానం వీడాడు. ఆ తర్వాత వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తెలిపింది.
ఆ మరుసటి రోజు గిల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు బోర్డు వెల్లడించింది. అయితే, మెడ నొప్పి ఇంకా తీవ్రంగానే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో చావోరేవో తేల్చుకోవాల్సిన రెండో టెస్టుకు గిల్ దూరమవుతాడనే అంచనాలు రాగా.. అనూహ్యంగా అతడు జట్టుతో పాటు గువాహటికి ప్రయాణం చేశాడు. తద్వారా మ్యాచ్‌కు తాను అందుబాటులో ఉంటాననే సంకేతాలు ఇచ్చాడు.
అయితే, గిల్ ఇంకా మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించినట్లు ఫిజియోలు, వైద్యులు నిర్ణయించలేదని భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ గురువారం మీడియా సమావేశంలో తెలిపాడు. శుక్రవారం సాయంత్రానికి గిల్ పరిస్థితిని బట్టి మ్యాచ్ ఆడించాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నాడు. తాజా సమాచారం ప్రకారం గిల్ ఈ మ్యాచ్ నుంచి వైదొలిగినట్లు సమాచారం.
జట్టు నుంచి రిలీజ్!
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. బీసీసీఐ గిల్‌ను జట్టు నుంచి రిలీజ్ చేసింది. కోలుకునే దశలో భాగంగా అతడిని మళ్లీ ముంబైకి పంపించినట్లు తెలుస్తోంది. బోర్డు సూచన మేరకు కొన్నాళ్ల పాటు గిల్ ముంబైలో డాక్టర్ దిన్షా పార్థీవాలా పర్యవేక్షణలో ఉండనున్నట్లు సమాచారం. రికవరీని బట్టి గిల్ సౌతాఫ్రికాతో వన్డేలు ఆడతాడా? లేదా? అన్న విషయాన్ని బోర్డు నిర్ణయిస్తుంది.
కాగా భారత్- సౌతాఫ్రికా మధ్య శనివారం మొదలయ్యే రెండో టెస్టుకు గువాహటిలోని బర్సపరా స్టేడియం వేదిక. ఇందులో గెలిస్తేనే టీమిండియా సిరీస్‌ను 1-1తో సమం చేయగలదు. లేదంటే సొంతగడ్డపై టెస్టులలో మరో ఘోర పరాభవం తప్పదు.
చదవండి: IND vs SA: 'నీ ఈగోను పక్కన పెట్టు'.. టీమిండియా ఓపెనర్‌కు వార్నింగ్


