Roger Federer: రోజర్‌ ఫెడరర్‌ వీడ్కోలు.. 20 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన దిగ్గజం 

Farewell To Roger Federer Greatest Rivalry In Tennis History - Sakshi

టెన్నిస్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన స్విస్‌ స్టార్‌  

వచ్చే వారం చివరి సారి బరిలోకి 

20 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన దిగ్గజం 

టెన్నిస్‌ను ఎంత అందంగా ఆడవచ్చో అతను చూపించాడు... బేస్‌లైన్‌నుంచి ఆడినా, నెట్‌పైకి దూసుకొచ్చినా అతని ఆటలో కళాత్మకత కనిపించింది...అతని ఫోర్‌హ్యాండ్‌ ఘనత గురించి చెప్పాలంటే అది ‘టెన్నిస్‌లోనే గొప్ప షాట్‌’...స్మాష్, స్కై హుక్, హాఫ్‌ వాలీ, స్లామ్‌ డంక్‌...పేరు ఏదైనా అతను ఏ షాట్‌ కొడితే దానికి ప్రపంచం జేజేలు పలికింది... అద్భుతమైన ఫుట్‌వర్క్‌తో పాదరసంలా జారుతూ మైదానమంతా చుట్టేసి అతను ప్రత్యర్థుల పని పట్టినప్పుడు చప్పట్లతో తమ సంతోషాన్ని ప్రకటించింది...

సుదీర్ఘ కెరీర్‌లో ఘనమైన రికార్డులెన్నో సాధించినా ఏనాడూ వివాదం దరి చేరనివ్వని అసలైన జెంటిల్‌మన్‌ అతను... ఒక్క మాటలో చెప్పాలంటే టెన్నిస్‌లో రాముడు మంచి బాలుడు ఎవరంటే మరో మాటకు తావు లేకుండా అందరూ అతని పేరే చెబుతారు.

అందుకే అతను గెలిచిననాడు వహ్వా అని సంబరాన్ని ప్రదర్శించిన ఫ్యాన్స్‌...అతను ఓడి అందరి ముందు చిన్నపిల్లాడిగా ఏడ్చి కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు తమకే ఏదో జరిగినంతగా బాధపడ్డారు... రెండు దశాబ్దాలకు పైగా ఆటపై చెరగని ముద్ర వేసిన ఆ దిగ్గజం పేరు రోజర్‌ ఫెడరర్‌. చరిత్రలో నిలిచిపోయే విజయాలను తన బయోడేటాగా మార్చుకున్న ఈ స్విస్‌ స్టార్‌ ఆటకు వీడ్కోలు పలికాడు...చిరస్మరణీయ జ్ఞాపకాలను అభిమానులకు పంచి నిష్క్రమించాడు.   

బాసెల్‌: ప్రపంచ టెన్నిస్‌ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ముగిసింది. తన ఆటతో అభిమానులను అలరించి, ఆటను శాసించిన దిగ్గజ ప్లేయర్‌ రోజర్‌ ఫెడరర్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఈ నెల 23నుంచి 25 వరకు లండన్‌లో జరిగే లేవర్‌ కప్‌లో తాను చివరిసారిగా బరిలోకి దిగుతానని, ఆపై ప్రొఫెషనల్‌ టెన్నిస్‌నుంచి పూర్తిగా తప్పుకుంటానని అతను వెల్లడించాడు. వరుస గాయాలు, ఆపై శస్త్రచికిత్సలతో చాలా కాలంగా కోర్టుకు దూరంగా ఉంటూ వచ్చిన ఫెడరర్‌ ఎప్పుడైనా తప్పుకోవచ్చనే సంకేతాలు వినిపించాయి.

అయితే గత జూలైలో వింబుల్డన్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమానికి హాజరై ఇక్కడ మరోసారి ఆడాలని ఉందని చెప్పినప్పుడు మళ్లీ బరిలోకి దిగవచ్చని అనిపించింది. కానీ ఆ ఆలోచనను పక్కన పెడుతూ 41 ఏళ్ల రోజర్‌ తన వీడ్కోలు వివరాలను సోషల్‌ మీడియా ద్వారా ధ్రువీకరించాడు. 1998లో ప్రొఫెషనల్‌గా మారిన ఈ స్విట్జర్లాండ్‌ స్టార్‌ 2021 జూలైలో చివరిసారిగా మ్యాచ్‌ ఆడాడు. వింబుల్డన్‌ క్వార్టర్‌ ఫైనల్లో హ్యూబర్ట్‌ హర్కాజ్‌ (పోలండ్‌) చేతిలో 3–6, 6–7 (4/7), 0–6 తేడాతో ఓడిపోయాక మళ్లీ రాకెట్‌ పట్టుకోలేదు. 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సాధించిన ఫెడరర్‌ కొన్నాళ్ల క్రితం వరకు అత్యధిక స్లామ్‌లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పుడు అతడిని నాదల్‌ (22), జొకోవిచ్‌ (21) అధిగమించారు.  

‘గత మూడేళ్లుగా గాయాలు, శస్త్రచికిత్సలు నన్ను బాగా ఇబ్బంది పెట్టాయి. నేను పునరాగమనం చేసేందుకు చాలా ప్రయత్నించాను. కానీ శరీరం సహకరించడం లేదని నాకు అర్థమైంది. గత 24 ఏళ్లలో 40 దేశాల్లో 1500కు పైగా మ్యాచ్‌లు ఆడాను. టెన్నిస్‌ నేను ఊహించినదానికంటే ఎక్కువ స్థాయిలో గొప్ప జ్ఞాపకాలు అందించింది. లేవర్‌ కప్‌ తర్వాత ప్రొఫెషనల్‌గా కాకుండా ఆసక్తి కొద్దీ ఎప్పుడైనా టెన్నిస్‌ ఆడుతూనే ఉంటా. ఇది చాలా బాధాకరమైన నిర్ణయమే అయినా నేను సాధించినవాటితో చూస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. దేవుడు నాకు టెన్నిస్‌  బాగా ఆడే ప్రత్యేక ప్రతిభను ఇచ్చాడు.

అందులో నేను ఊహించని ఎత్తులకు వెళ్లగలిగాను. ఎంతో మంది గొప్ప ఆటగాళ్లతో పోటీ పడగలగడం నా అదృష్టం. నా ఈ ప్రయాణంలో అండగా నిలిచిన తల్లిదండ్రులు, భార్య, కోచ్‌లు, అభిమానులకు కృతజ్ఞతలు. 24 ఏళ్లు 24 గంటల్లా గడిచినట్లు అనిపిస్తున్నాయి. ఆటగాడిగా విజయాలు ఆస్వాదించాను. నవ్వాను, ఏడ్చాను, బాధను భరించాను, భావోద్వేగాలు ప్రదర్శించాను. నా సొంత నగరం బాసెల్‌లో బాల్‌బాయ్‌గా ఉన్నప్పుడు కన్న కలలు నేను పడిన శ్రమతో నిజమయ్యాయి. టెన్నిస్‌ను నేను ఎప్పటికీ  ప్రేమిస్తూనే ఉంటా’                                            
– ఫెడరర్‌  

కెరీర్‌లో గెలిచిన మొత్తం టైటిల్స్‌ – 103  
గెలుపు–ఓటములు – 1251–275 
కెరీర్‌ ప్రైజ్‌మనీ – 13 కోట్ల డాలర్లు (సుమారు రూ.1042 కోట్లు) 
తొలిసారి వరల్డ్‌ నంబర్‌వన్‌ – 02/02/2004 
ఒలింపిక్‌ పతకాలు (2) – 2008 బీజింగ్‌లో డబుల్స్‌ స్వర్ణం, 2012 లండన్‌లో సింగిల్స్‌ కాంస్యం
వరల్డ్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌ – మొత్తం 310 వారాలు (ఇందులో వరుసగా 237 వారాలు)  
గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌ విజయాల సంఖ్య – 369  
కెరీర్‌లో కొట్టిన ఏస్‌లు – 11,478 

కెరీర్‌ స్లామ్‌ పూర్తి
ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా అన్ని రకాల కోర్టుల్లో సత్తా చాటినా...ఫెడరర్‌ కెరీర్‌లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఎప్పుడూ సవాల్‌గానే కనిపించింది. అప్పటికే 13 గ్రాండ్‌స్లామ్‌లు సాధించి ఫ్రెంచ్‌ ఓపెన్‌లోకి ఫెడరర్‌ అడుగు పెట్టాడు. మరో టైటిల్‌ గెలిస్తే ఆ సమయంలో అగ్ర స్థానంలో ఉన్న పీట్‌ సంప్రాస్‌ (14) రికార్డును సమం చేస్తాడు. అయితే ఎర్రమట్టిపై వరుసగా నాలుగేళ్లు టైటిల్‌ సాధించిన నాదల్‌ జోరు కొనసాగుతోంది.

ఈ దశలో ఫెడరర్‌కు మళ్లీ కష్టమే అనిపించింది. అయితే క్వార్టర్‌ ఫైనల్లో సొదర్లింగ్‌ చేతిలో నాదల్‌ అనూహ్యంగా ఓడటంతో రోజర్‌కు దారులు తెరుచుకున్నాయి. ఈ అవకాశాన్ని వృథా చేయని అతను ఫైనల్లో సొదర్లింగ్‌నే ఓడించి తొలిసారి (ఏకైక) ఫ్రెంచ్‌ ఓపెన్‌ సాధించాడు. తన ‘కెరీర్‌ స్లామ్‌’ను పూర్తి చేసుకోవడంతో పాటు సంప్రాస్‌తో సమంగా నిలిచాడు. 

‘గ్రాండ్‌’ ఫెడెక్స్‌ 
ఆస్ట్రేలియా ఓపెన్‌ (6) – 2004, 2006, 2007, 2010, 2017, 2018 
ఫ్రెంచ్‌ ఓపెన్‌ (1) – 2009 
వింబుల్డన్‌ (8) – 2003, 2004, 2005, 2006, 2007, 2009, 2012, 2017 
యూఎస్‌ ఓపెన్‌ (5) – 2004, 2005, 2006, 2007, 2008 
తన కెరీర్‌ మొత్తంలో 1526 సింగిల్స్, 223 డబుల్స్‌ మ్యాచ్‌లు ఆడిన ఫెడరర్‌ ఒక్కసారి కూడా మ్యాచ్‌ మధ్యలో రిటైర్‌ కాలేదు.  

కవలల జోడి... 
ఫెడరర్‌ పక్కా ‘ఫ్యామిలీ మ్యాన్‌’. తన విజయాల ఘనతల్లో భార్య మిరొస్లావా (మిర్కా)కు ప్రధాన పాత్ర ఉందని తరచూ చెబుతుంటాడు. వీరికి నలుగురు పిల్లలు. వీరికి 13 ఏళ్ల కవల అమ్మాయిలు, 8 ఏళ్ల కవల అబ్బాయిలు ఉన్నారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top