ఐపీఎల్ 2026 సీజన్ ఇవాళ షురూ కానుంది. మండు వేసవిలో రెండు నెలల పాటు సాగనున్న క్రికెట్ వినోదం అభిమానుల్లో జోష్ నింపింది. అయితే ఐపీఎల్‌లో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ 2020 తర్వాత మళ్లీ ఆ స్థాయి ఆటను ప్రదర్శించడంలో విఫలమవుతూ వస్తోంది. ఈసారి కప్ కొట్టాలనే బలమైన సంకల్పంతో బరిలోకి దిగుతోంది.
ఈ నేపథ్యంలో మార్చి 30న ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో ఆడనుంది. ఇదిలా ఉంటే ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మాత్రం ఇంకా జట్టుతో చేరలేదు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను బుమ్రా శుక్రవారం సందర్శించాడు. ఆ తర్వాత బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీలో మెడికల్‌స్టాఫ్ పర్యవేక్షణలో బుమ్రా బౌలింగ్ సాధన చేశాడు.
దీంతో కేకేఆర్‌తో జరగబోయే మ్యాచ్‌కు బుమ్రా అందుబాటులో ఉంటాడా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ఒకవేళ బుమ్రా కేకేఆర్‌తో మ్యాచ్‌కు దూరమైతే మాత్రం ఆకాశ్ మధ్వాల్ ముంబై తుది జట్టులోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఐపీఎల్ మినీ వేలంలో ఆకాశ్ మధ్వాల్‌ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. కానీ శుక్రవారం రాత్రి మాత్రం ముంబై జట్టుకు నెట్ బౌలర్‌గా వ్యవహరించాడు.
ఇదే సమయంలో రోహిత్ శర్మ అక్కడికి రావడం, రోహిత్‌ను చూసిన ఆకాశ్ మధ్వాల్ రెండు చేతులు జోడించి దండం పెట్టడం కనిపించింది. దీనికి బదులుగా రోహిత్ అతన్ని హగ్ చేసుకొని ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ప్రస్తుతానికి నెట్ బౌలర్‌గా ఉన్న ఆకాశ్ మధ్వాల్ కచ్చితంగా బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడానికే ముంబై యాజమాన్యం అతన్ని తీసుకొచ్చిందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పటికే మరో బౌలర్ అథర్వ అంకోలేకర్ కూడా దూరమవ్వడంతో ముంబై జట్టుకు ఇబ్బంది ఎదురైంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ మధ్వాల్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఆకాశ్ మధ్వాల్ గతంలో (2023, 2024 సీజన్లు) ఇదే ముంబై ఇండియన్స్ తరఫున 13 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టాడు.
అయితే 2023 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఐదు పరుగులిచ్చి ఐదు వికెట్లు తీయడం ద్వారా ఆకాశ్ మధ్వాల్ పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత సీజన్‌కు రాజస్థాన్ రాయల్స్ ఆకాశ్‌ను జట్టులోకి తీసుకుంది. 2025 సీజన్‌లో ఆకాశ్ రాజస్థాన్ తరఫున నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత రాజస్థాన్ జట్టు విడుదల చేయగా ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు జరిగిన మినీ వేలంలో ఆకాశ్ మధ్వాల్ అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు.
చదవండి: గాయాలతో సతమతం.. ఆటకు గుడ్‌బై
We are sure you were not expecting this meet up 🥹💙 pic.twitter.com/MBbC2wMEAT
— Mumbai Indians (@mipaltan) March 27, 2026


