IPL: జట్టును నాశనం చేయకండి.. చేతనైతే: సన్‌రైజర్స్‌పై మాజీ ప్లేయర్‌ ఘాటు వ్యాఖ్యలు

Ex SRH Star Slams Management Rashid Was Brand For Them But - Sakshi

IPL- Sunrisers Hyderabad: ‘‘నేను, రషీద్‌ 2017లో జట్టులోకి వచ్చినపుడు అంతా బాగానే ఉంది. ఆ తర్వాతి మూడేళ్లు టీమ్‌ కాంబినేషన్లు చక్కగా కుదిరాయి. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాం. కానీ గత రెండేళ్ల కాలంలో భారీ మార్పులు. అందుకు గల కారణాలు ఏమిటో, కారకులు ఎవరో నాకు తెలియదు గానీ.. ఒక్కసారిగా పరిస్థితులన్నీ మారిపోయాయి.

ఆటగాళ్లు ఆ ఫ్రాంఛైజీకి ఆడేందుకు విముఖత చూపడం ఆరంభించారు’’ అని అఫ్గనిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ నబీ.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మేనేజ్‌మెంట్‌ తీరును విమర్శించాడు. నబీతో పాటు అఫ్గన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఐపీఎల్‌-2016 విజేత సన్‌రైజర్స్‌ తరఫున గతంలో ఆడిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఇద్దరికీ ఎస్‌ఆర్‌హెచ్‌తో బంధం లేదు.

తరచూ మార్పులు
కాగా 2016లో జట్టుకు ట్రోఫీ అందించిన ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ను 2021లో కెప్టెన్సీ నుంచి తప్పించిన సన్‌రైజర్స్‌ తర్వాత అతడిని రిలీజ్‌ చేసింది. అదే విధంగా.. జట్టులో కీలక సభ్యుడైన రషీద్‌ ఖాన్‌ను ఐపీఎల్‌-2022 వేలానికి ముందు విడుదల చేసింది.

ఈ నేపథ్యంలో రషీద్‌ను సొంతం చేసుకున్న కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్‌ టైటాన్స్‌ వైస్‌ కెప్టెన్‌గా నియమించుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్‌-2022లో గుజరాత్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ స్టార్‌ బౌలర్‌... ట్రోఫీ గెలవడంలో సహాయపడ్డాడు.

మరోవైపు.. సన్‌రైజర్స్‌ మాత్రం పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. ఇక ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ -2023 మినీ వేలానికి ముందు తమ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ వదులుకున్న విషయం తెలిసిందే. దీంతో తరచూ జట్టులో మార్పులు చేస్తున్న సన్‌రైజర్స్‌ తీరుపై విశ్లేషకులు పెదవి విరిచారు.

నాశనం చేయకండి అంటూ
ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ యారీతో మాట్లాడిన ఆ జట్టు మాజీ ప్లేయర్‌ మహ్మద్‌ నబీ.. ఇకనైనా తీరు మార్చుకోవాలని ఎస్‌ఆర్‌హెచ్‌కు హితవు పలికాడు. ‘‘జట్టును నాశనం చేయడానికి బదులు.. పటిష్టం చేసేందుకు ప్రయత్నించండి. పేరున్న ఫ్రాంఛైజీగా మీరు చేయాల్సిన మొట్టమొదటి పని అదే. తరచూ మార్పులు చేయకుండా మెరుగైన జట్టు నిర్మాణానికి పాటు పడాలి’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

ఇక రషీద్‌ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఐదేళ్ల పాటు వాళ్ల జట్టుకు బ్రాండ్‌ అంబాసిడర్‌లా ఉన్న రషీద్‌ ఖాన్‌.. వాళ్లను వదిలివెళ్లేలా చేసుకున్నారు. రషీద్‌ ఒక్కడే కాదు ఎంతో మంది టాప్‌ ప్లేయర్ల పట్ల కూడా ఇదే వైఖరి. సన్‌రైజర్స్‌ ఇలా చేయకుండా ఉండాల్సింది.

అసలు వాళ్లకేం కావాలో వాళ్లకైనా అర్థమవుతోందా?’’ అని ఈ ఆల్‌రౌండర్‌.. ఎస్‌ఆర్‌హెచ్‌ విధానాల పట్ల విమర్శలు సంధించాడు. కాగా 2021లో మహ్మద్‌ నబీకి సన్‌రైజర్స్‌తో బంధం తెగిపోయింది. ఇక గతేడాది 14 మ్యాచ్‌లకు గానూ 6 గెలిచిన హైదరాబాద్‌ జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది.

చదవండి: Suryakumar Yadav: మొన్న 90.. నిన్న 95.. చెలరేగుతున్న సూర్య! టెస్టుల్లో ఎంట్రీ ఖాయం!
Aus Vs SA 2nd Test: ఎదురులేని ఆసీస్‌.. దక్షిణాఫ్రికా చిత్తు! డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసులో ఇక..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top