అతడిని విస్మరించొద్దు.. సెలెక్టర్లకు మాజీ క్రికెటర్‌ హెచ్చరిక! | Ex-pacer Warns-Selectors Dont-Ignore Rishabh Pant-Ahead 2027 ODI WC | Sakshi
Sakshi News home page

అతడిని విస్మరించొద్దు.. సెలెక్టర్లకు మాజీ క్రికెటర్‌ హెచ్చరిక!

Jun 12 2026 6:22 PM | Updated on Jun 12 2026 6:46 PM

Ex-pacer Warns-Selectors Dont-Ignore Rishabh Pant-Ahead 2027 ODI WC

టీమిండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌ టెస్టు క్రికెట్‌లో వేగంగా ఆడుతాడ‌నే పేరుంది. కానీ వ‌న్డే, టీ20 క్రికెట్‌లో మాత్రం పంత్ ఆట పూర్తి విరుద్ధంగా ఉంటుంది. వేగంగా ఆడాల్సిన వ‌న్డే, టీ20 క్రికెట్‌లో స‌రిగ్గా ఆడ‌క‌పోవ‌డం.. ఆచితూచి ఆడాల్సిన టెస్టు క్రికెట్‌లో వేగాన్ని చూపించ‌డం పంత్ నైజం. అయితే ఇటీవ‌లే పేల‌వ ఫామ్ కార‌ణంగా వ‌న్డే, టీ20 క్రికెట్‌లో చోటు కోల్పోయిన పంత్ టెస్టు జ‌ట్టులో మాత్రం స్థానం నిలుపుకున్నాడు. 

అయితే ప‌రిమిత ఓవ‌ర్ల ఆట‌లో పంత్ ఆట ఇక ముగిసిన‌ట్లేన‌ని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్న వేళ టీమిండియా మాజీ ఆల్‌రౌండ‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ కీల‌క‌వ్యాఖ్య‌లు చేశాడు. జియో హాట్‌స్టార్ ఇంట‌ర్వ్యూలో ప‌ఠాన్ మాట్లాడాడు. పంత్‌ను వైట్‌బాల్ జ‌ట్టు నుంచి తొల‌గించిన‌ప్ప‌టికీ 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ నేప‌థ్యంలో అత‌డిని పూర్తిగా విస్మ‌రించివ‌ద్ద‌ని సెలెక్ష‌న్ క‌మిటీని కోరాడు. 

'వ‌న్డే క్రికెట్ నుంచి త‌ప్పించార‌నే నిరాశ వాదాన్ని వ‌దిలేసి మ‌ళ్లీ ట్రాక్ ఎక్కితే ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో టీమిండియాలో చోటు ద‌క్కించుకోవ‌డం పంత్‌కు పెద్ద క‌ష్ట‌మేమి కాదు. ఈ విష‌యంలో పంత్ త‌న స‌హ‌చ‌ర క్రికెట‌ర్ల‌ను ఆద‌ర్శంగా తీసుకోవాలి. వన్డేల్లో వికెట్ కీపర్ ఇప్పుడు కేఎల్ రాహుల్ తొలి ఛాయిస్. ఓపెన‌ర్‌గా, అవ‌స‌ర‌మైతే ఐదు లేదా ఆరో స్థానంలోనూ బ్యాటింగ్ చేయగలడు. అతడికి బ్యాకప్‌గా ఇషాన్ కిషన్ ను తీసుకొచ్చారు. ఇషాన్ కూడా టాపార్డ‌ర్‌లో బ్యాటింగ్ చేస్తాడు. షార్ట్‌పిచ్‌ బంతులను కూడా చక్కగా ఆడ‌గ‌ల‌డు. 

బీసీసీఐకి మూడో ఆప్షన్ సంజు శాంసన్. అతడికి ఎప్పుడు అవకాశం వచ్చినా వన్డేల్లో సత్తా చాట‌డంలో ముందుంటాడు. గత టీ20 ప్రపంచకప్‌లోనూ శాంస‌న్ ప‌లు కీలక ఇన్నింగ్స్ లు ఆడటం చూశాం. పంత్ విష‌యంలో మాత్రం సెలక్టర్లకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. 2027 వన్డే ప్రపంచ కప్ సెలక్షన్స్‌లో పూర్తిగా అతడిని పక్కన పెట్టొద్దు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడి ఫామ్ గొప్పగా లేదని తెలుసు. 

గతంలో ఇషాన్ కిషన్ కూడా జట్టులో నుంచి బయటకు వెళ్లాడు. తర్వాత రాణించి మళ్లీ జ‌ట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. సారథిగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని జార్ఖండ్‌కు అందించాడు. అందుకే అతడిని పంత్ స్ఫూర్తిగా తీసుకోవాలి. వైట్‌బాల్ క్రికెట్‌లోకి గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వాలి.' అని ఇర్ఫాన్ తెలిపాడు. 

పంత్ చివరిసారిగా 2024లో వన్డే మ్యాచ్ ఆడాడు. 2025 చాంపియ‌న్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియా జ‌ట్టులో ఉన్న‌ప్ప‌టికీ రిజ‌ర్వ్ బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు.  ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్‌లోనూ పంత్ కెప్టెన్‌గా, ఆట‌గాడిగా విఫ‌ల‌మ‌య్యాడు. ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ త‌ర‌ఫున 14 మ్యాచ్‌లాడిన పంత్ 312 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగాడు. కెప్టెన్‌గా జ‌ట్టును న‌డిపించ‌డంలో విఫ‌ల‌మైన పంత్ పాయింట్ల పట్టిక‌లో ల‌క్నోను ఆఖ‌రి స్థానంలో నిలిపాడు. 

దీంతో ల‌క్నో యాజ‌మాన్యం పంత్‌ను కెప్టెన్సీ నుంచి తొల‌గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. అయితే ఐపీఎల్‌లో చెత్త ప్ర‌ద‌ర్శ‌న    చేసిన‌ప్ప‌టికీ ఇటీవ‌లే ఆఫ్గ‌న్‌తో జ‌రిగిన టెస్టులో మాత్రం పంత్ ఆకట్టుకున్నాడు. 121 బంతులాడిన పంత్ 81 ప‌రుగులు సాధించాడు. ఇక సౌతాఫ్రికాలో జ‌ర‌గ‌నున్న 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు రోహిత్‌, కోహ్లీల‌ను నేరుగా ఎంపిక చేస్తార‌నే ఊహాగానాల‌ను ప‌ఠాన్ తోసిపుచ్చాడు.

చదవండి: అంత‌ర్జాతీయ క్రికెట్‌కు కేన్‌ విలియమ్సన్‌ వీడ్కోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement