
భారత టెస్ట్ జట్టువైపు మరో యువ కెరటం దూసుకొస్తుంది. కోహ్లి, పుజారా రిటైర్మెంట్ తర్వాత ఖాళీగా ఉన్న మిడిలార్డర్ స్థానాలకు ఆక్రమించేందుకు మరో ఆటగాడు రేసులో వచ్చాడు. ఈ రెండు స్థానాల కోసం ఇప్పటికే పదుల సంఖ్యలో పోటీ ఉంది. సాయి సుదర్శన్, సర్ఫరాజ్ ఖాన్, కరుణ్ నాయర్ లాంటి వారు ప్రధాన పోటీదారులుగా ఉండగా.. కొత్తగా ఢిల్లీ రంజీ జట్టు కెప్టెన్ ఆయుశ్ బదోని రేసులోకి వచ్చాడు.
25 ఏళ్ల బదోనికి రెడ్ బాల్ క్రికెట్‌లో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఈ ఢిల్లీ కుర్రాడు ఆడిన 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 55కు పైగా సగటుతో 4 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీల సాయంతో 1200 పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. వీటిలో ఒకటి ఇవాళే (ఆగస్ట్ 31) చేశాడు.
దులీప్ ట్రోఫీ 2025లో భాగంగా ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో బదోని (నార్త్ జోన్) రెండో ఇన్నింగ్స్‌లో అజేయమైన డబుల్ సెంచరీతో (223 బంతుల్లో 204 నాటౌట్; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనూ బదోని మెరుపు హాఫ్ సెంచరీతో (63) మెరిశాడు.
రెడ్ బాల్ క్రికెట్‌లో ఇటీవలికాలంలో భీకరమైన ఫామ్‌లో ఉన్న బదోని టెస్ట్ బెర్త్ కోసం భారత సెలెక్టర్లకు సవాల్ విసురుతున్నాడు. గడిచిన 7 ఇన్నింగ్స్‌ల్లో అతను వరుసగా 204*, 63, 99, 60, 44, 205* & 49 స్కోర్లు చేశాడు. ఇలాంటి ప్రదర్శనల తర్వాత ఎవరైనా భారత జట్టులో చోటు ఆశిస్తారు. వాస్తవానికి టీమిండియాలో ఉండేందుకు బదోని పూర్తి అర్హుడు. కుడి చేతి వాటం బ్యాటరైన అతడు.. బౌలింగ్ (కుడి చేతి ఆఫ్ స్పిన్) కూడా చేయగలడు.
బదోని ఇదివరకే పొట్టి ఫార్మాట్‌లో తనను తాను నిరూపించుకున్నాడు. 2022 ఐపీఎల్ సీజన్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడుతున్న బదోని.. ఆ జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరించాడు. ఐపీఎల్‌లో 56 మ్యాచ్‌లు ఆడిన బదోని 138.6 స్ట్రయిక్‌రేట్‌తో 6 అర్ద సెంచరీల సాయంతో 963 పరుగులు చేశాడు. అలాగే 4 వికెట్లు తీశాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. ఫలితం తేలకపోయినా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా ఈస్ట్ జోన్‌పై నార్త్ జోన్ విజయం సాధించి, సెమీస్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ జోన్ 405 పరుగులు చేసింది. బదోని (63), కన్హయ్య (76) అర్ద సెంచరీలతో రాణించారు.
అనంతరం ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగులకే ఆలౌటైంది. ఆకిబ్ నబీ హ్యాట్రిక్ సహా వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు. భారీగా లభించిన ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్త్ జోన్.. ఈసారి మరింత భారీ స్కోర్ సాధించింది.
బదోని డబుల్ సెంచరీ సహా యశ్ ధుల్ (133), కెప్టెన్ అంకిత్ కుమార్ సెంచరీలతో కదంతొక్కారు. అంకిత్ కుమార్ (198) రెండు పరుగుల తేడాతో డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు.