దివ్యాంశు–శాంభవి జోడీకి పసిడి పతకం | Divyanshu and Shambhavi pair wins gold medal | Sakshi
Sakshi News home page

దివ్యాంశు–శాంభవి జోడీకి పసిడి పతకం

Apr 25 2026 3:05 AM | Updated on Apr 25 2026 3:05 AM

Divyanshu and Shambhavi pair wins gold medal

కైరో: అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) జూనియర్‌ ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. శుక్రవారం భారత్‌ ఖాతాలో నాలుగో స్వర్ణ పతకం చేరింది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో దివ్యాంశు దేవాంగన్‌–శాంభవి క్షీరసాగర్‌ జోడీ భారత్‌కు బంగారు పతకాన్ని అందించింది. నాలుగు జోడీల మధ్య జరిగిన ఫైనల్లో దివ్యాంశు–శాంభవి జంట 499.9 పాయింట్లు స్కోరు చేసి పసిడి పతకాన్ని దక్కించుకుంది. 

ఈ క్రమంలో కొత్త ప్రపంచ రికార్డును కూడా నమోదు చేసింది. సయ్‌ చియె యింగ్‌–చెన్‌ యు ఆన్‌ (చైనీస్‌ తైపీ) జంట 498.3 పాయింట్లో రజతం గెల్చుకోగా... టిఫెన్‌ పోమెస్‌–గాస్‌పర్డ్‌ లెసియర్‌ (ఫ్రాన్స్‌) జోడీ 434.4 పాయింట్లతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు 17 జోడీలు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో దివ్యాంశు–శాంభవి జంట 632 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలవడంతోపాటు ఫైనల్‌కు అర్హత సాధించింది. 

మరోవైపు పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. ఎనిమిది మంది షూటర్లు ఎలిమినేషన్‌ పద్ధతిలో పోటీపడ్డ ఫైనల్లో భారత షూటర్‌ సమీర్‌ 7 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు. అంతకుముందు 17 మంది షూటర్లు బరిలోకి దిగిన క్వాలిఫయింగ్‌లో సమీర్‌ 573 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందాడు. ప్రస్తుతం భారత్‌ 4 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి 12 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.   

Advertisement
 
Advertisement
Advertisement