
ఐపీఎల్-2008 (IPL 2008) నాటి వీడియో తాజాగా విడుదల చేయడంపై టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ సతీమణి భువనేశ్వరి కుమారి (Bhuvaneshwari Kumari) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీకు అసలు మానవత్వం ఉందా?’ అంటూ ఐపీఎల్ తొలి చైర్మన్ లలిత్ మోదీ (Lalit Modi), ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్‌పై మండిపడ్డారు.
ఛీ.. ఇదేం పద్ధతి?
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా భువనేశ్వరి కుమారి సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘‘లలిత్ మోదీ, మైకేల్ క్లార్క్.. మీరు చేసిన పనికి సిగ్గు పడండి. 2008లొ జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను ప్రదర్శిస్తూ వ్యూస్ కోసం చీప్‌గా ప్రవర్తించారు.
దీని కారణంగా మీరు కేవలం ఇద్దరు వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేసినట్లు కాదు.. వారి కుటుంబాలు, పిల్లలపై కూడా దీని ప్రభావం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. శ్రీశాంత్, హర్భజన్ సింగ్ ఇద్దరూ ఎప్పుడో ఆ ఘటన గురించి మర్చిపోయారు.

వారిప్పుడు కేవలం ఆటగాళ్లు కాదు.. తండ్రులయ్యారు. వారికి స్కూల్‌కు వెళ్లే వయసున్న పిల్లలు ఉన్నారు. కానీ మీరు మాత్రం ఆ పాత గాయాన్ని మళ్లీ రేపుతున్నారు. ఛీ.. ఇదేం పద్ధతి? మీకసలు హృదయం ఉందా? మానవత్వం అన్నది మచ్చుకైనా మీలో ఉందా?
మీరు కాస్తైనా ఊహించగలరా?
శ్రీశాంత్ ఎంతగానో శ్రమించి మళ్లీ తన కెరీర్‌ను నిర్మించుకున్నాడు. చేదు అనుభవాలను అధిగమించి తనను తాను నిరూపించుకున్నాడు. అతడి భార్యగా.. అతడి పిల్లల తల్లిగా.. ఈ పాత వీడియో చూడటం ద్వారా నా మనసు ఎంత బాధపడుతుందో మీరు కాస్తైనా ఊహించగలరా?
ఇరు కుటుంబాలను ట్రామాలోకి నెట్టేసిన ఆ ఘటన గురించి మళ్లీ ఇప్పుడెందుకు? మీకు వ్యూస్ మాత్రమే ముఖ్యమా? చిన్నారి పిల్లల మనసులపై గతం తాలుకు మచ్చలు పడేలా చేయాలనుకుంటున్నారా? మీకు కాస్తైనా సిగ్గుందా?.. చేయని తప్పులకు వారు శిక్ష అనుభవించాలా?
మానవత్వం లేని పనులు
ఇలాంటి చెత్త, మానవత్వం లేని పనులు చేసినందుకు మీపై దావా వేయాలి. శ్రీశాంత్ పట్టుదల, మానసిక దృఢత్వం ఉన్న వ్యక్తి. ఇలాంటి చెత్త వీడియోలు అతడి హుందాతనాన్ని ఏమాత్రం తగ్గించలేవు. మీ స్వార్థం కోసం ఇతరుల కుటుంబాలను, వారి పిల్లల మనసులను బాధపెట్టడం ఎంత మాత్రం సరికాదు’’ అంటూ భువనేశ్వరి కుమారి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలేం జరిగిందంటే..
2008లో ఐపీఎల్ మొదలైన విషయం తెలిసిందే. అరంగేట్ర సీజన్‌లో భారత క్రికెటర్లు హర్భజన్ సింగ్ ముంబై ఇండియన్స్‌కు.. శ్రీశాంత్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఆడారు. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య మ్యాచ్ సమయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు జట్లు ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటున్న సమయంలో శ్రీశాంత్‌ను భజ్జీ చెంపదెబ్బ కొట్టాడు. ఈ క్రమంలో తదుపరి మ్యాచ్‌లు ఆడకుండా భజ్జీపై నిషేధం పడింది.
పెద్ద తప్పు చేశా
ఈ ఘటన గురించి ఇటీవల హర్భజన్ సింగ్ మాట్లాడుతూ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తాను పెద్ద తప్పు చేశానని.. ఇప్పటికే 200 సార్లు శ్రీశాంత్‌కు క్షమాపణ చెప్పి ఉంటానని పేర్కొన్నాడు. అయితే, శ్రీశాంత్ కుమార్తెతో మాట్లాడుతున్న సమయంలో.. ఆమె తనను తన తండ్రిని కొట్టిన వ్యక్తిగా గుర్తించడాన్ని తట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. చిన్నారి మనసులో తనపై ఇలాంటి ముద్ర పడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నా.. ఆరోజు అలా చేయకుండా ఉండాల్సింది అని మరోసారి తన తప్పును ఒప్పుకొన్నాడు.
వీడియో చూపించిన లలిత్ మోదీ
అయితే, ఇటీవల క్లార్క్ ఇంటర్వ్యూకు హాజరైన లలిత్ మోదీ.. భజ్జీ శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టిన వీడియోను లైవ్‌లో చూపించాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో కేరళ మాజీ పేసర్ శ్రీశాంత్ భార్య భువనేశ్వరి కుమారి పైవిధంగా ఘాటుగా స్పందించారు.
చదవండి: ‘టీమిండియా బెస్ట్ కెప్టెన్ అతడే.. సాధారణ జట్టుతో అద్భుత విజయాలు’