కేఎల్‌ రాహుల్‌ సుడిగాలి శతకం.. వరల్డ్‌కప్‌ చరిత్రలోనే ఫాస్టెస్ట్‌ | Sakshi
Sakshi News home page

CWC 2023 IND VS NED: కేఎల్‌ రాహుల్‌ సుడిగాలి శతకం.. వరల్డ్‌కప్‌ చరిత్రలోనే ఫాస్టెస్ట్‌

Published Sun, Nov 12 2023 10:00 PM

CWC 2023 IND VS NED: KL Rahul Smashes Fastest Hundred By An Indian In ODI WC History - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ సుడిగాలి శతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో 62 బంతుల్లోనే శతక్కొట్టిన రాహుల్‌.. వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలోనే భారత్‌ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రాహుల్‌కు ముందు ఈ రికార్డు రోహిత్‌ శర్మ పేరిట ఉండేది. ఇదే వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో హిట్‌మ్యాన్‌ ఆఫ్ఘనిస్తాన్‌పై 62 బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 64 బంతులు ఎదుర్కొన్న రాహుల్‌ 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేసి ఔటయ్యాడు.

నెదర్లాండ్స్‌పై సెంచరీతో రాహుల్‌ మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. రాహుల్‌ ద్రవిడ్‌ (1999లో శ్రీలంకపై 145 పరుగులు) తర్వాత వరల్డ్‌కప్‌లో సెంచరీ సాధించిన భారత వికెట్‌కీపర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అలాగే వరల్డ్‌కప్‌లో భారత్‌ తరఫున రెండో అత్యధిక స్కోర్‌ చేసిన వికెట్‌కీపర్‌గానూ రికార్డు నెలకొల్పాడు. 

కాగా, రాహుల్‌తో పాటు శ్రేయస్‌ అయ్యర్‌ (94 బంతుల్లో 128 నాటౌట్‌; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా మెరుపు శతకంతో విరుచుకుపడటంతో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు భారీ స్కోర్‌ చేసింది. వీరితో పాటు రోహిత్‌ శర్మ (61), శుభ్‌మన్‌ గిల్‌ (51), విరాట్‌ కోహ్లి (51) హాఫ్‌ సెంచరీలతో రాణించడంతో భారత్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. 

అనంతరం ఛేదనకు దిగిన నెదర్లాండ్స్‌ భారత్‌ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా భారత్‌ 160 పరుగుల తేడాతో గెలుపొంది, ప్రస్తుత వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో వరుసగా తొమ్మిదో విజయాన్ని నమోదు చేసింది. 

భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్‌, జడేజా తలో 2 వికెట్లు పడగొట్టగా.. విరాట్‌, రోహిత్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌, విరాట్‌తో పాటు శుభ్‌మన్‌ గిల్‌ కూడా బౌలింగ్‌ చేశాడు. ఈ విజయంతో భారత్‌ లీగ్‌ దశలో ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. నవంబర్‌ 15న జరిగే తొలి సెమీస్‌లో భారత్‌.. న్యూజిలాండ్‌తో తలపడుతుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement